Satya Nadella: క్రికెట్‌ ఆట నుంచి టెక్‌ కంపెనీ సీఈవో దాకా.. సక్సెస్‌ సీక్రెట్ చెప్పిన సత్య నాదెళ్ల!

చిన్నవయసులో తన ధ్యాసంతా ఎక్కువగా క్రికెట్‌పై ఉండేదని, చదువులో కూడా గొప్ప రాణించేవాణ్ని కాదని చెప్పారు మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఈవో సత్య నాదెళ్ల(Satya Nadella). నాయకత్వం అనేది  విశేషాధికారమో, ప్రత్యేకమైన సౌకర్యమో మాత్రమే కాదని అన్నారు.

Published : 11 Mar 2023 01:42 IST

కాలిఫోర్నియా: చిన్నవయసులో తల్లిదండ్రులు ఇచ్చిన మద్దతు,  ఆత్మవిశ్వాసం, నచ్చిన అంశాన్ని ఎంచుకునే స్వేచ్ఛ కారణంగానే తాను ఈ స్థాయిలో ఉన్నానని మైక్రోసాఫ్ట్‌ (Microsoft) సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) అన్నారు. లింక్డిన్‌ (LinkedIn') సీఈవో ర్యాన్‌ రోస్లాన్‌స్కీ(Ryan Roslansky) నిర్వహించే ది పాత్‌ (The Path) అనే వీడియో సిరీస్‌ కార్యక్రమంలో పాల్గొన్న సత్య నాదెళ్ల పలు ఆసక్తికర అంశాల గురించి మాట్లాడారు. ఆ విశేషాలు ఏంటో చూద్దాం. 

వారి వల్లే ఈ స్థాయికి

వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నేను ఈ స్థాయిలో ఉండటం వెనుక నా తల్లిదండ్రుల పాత్ర ఉంది. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, ఆర్థికవేత్త. అమ్మ సంస్కృతం ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. వారిద్దరు రెండు వేర్వేరు ధృవాలు అని చెప్పుకోవాలి. ఏ విషయంపైనా వారికి ఏకాభిప్రాయం  ఉండేది కాదు. కానీ, నా విషయంలో మాత్రం ఇద్దరు ఒకే మాటపై ఉండేవారు. నా అభిరుచికి తగినట్లుగా ముందుకు సాగేందుకు ఎప్పుడు అడ్డుచెప్పలేదు. నాలో ఆత్మవిశ్వాసం కలిగించేందుకు ఎంతో కృషి చేశారు.  

క్రికెట్‌ నుంచి కంప్యూటర్‌వైపు

చిన్నవయసులో నా ధ్యాసంతా ఎక్కువగా క్రికెట్‌పై ఉండేది. చదువులో కూడా గొప్పగా రాణించేవాణ్ని కాదు. భారత్‌లో మధ్యతరగతి కుటుంబంలో పెరగడం కొన్నిసార్లు సవాల్‌తో కూడుకున్న వ్యవహారం. తొలిసారి కంప్యూటర్‌ వినియోగించిన సందర్భం ఇప్పటికీ గుర్తుంది. ఆ సమయంలో అమెరికన్‌ టెక్నాలజీ నన్ను కట్టిపడేసింది. అలాంటి సందర్భాల్లో అందరిలా అదే నా భవిష్యత్తు అని నిర్ణయించుకున్నానని నేను చెప్పలేదు. దాన్ని ఉపయోగించే కొద్ది అది నన్ను ఆకర్షించింది.

సన్‌ మైక్రోసిస్టమ్‌ టు మైక్రోసాఫ్ట్‌

భారత్‌లో ఎలక్ట్రిక్‌ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత సత్య నాదెళ్ల మాస్టర్స్‌ చదివేందుకు అమెరికా వెళ్లారు. అది పూర్తయ్యాక ఆయన సన్‌ మైక్రోసిస్టమ్స్‌(Sun Microsystems)లో ఉద్యోగంలో చేరారు. అప్పట్లో కంప్యూటర్లకు అవసరమైన సాంకేతికతను అందించే సంస్థల్లో సన్‌ మైక్రోసిస్టమ్స్‌ చాలా పెద్దది. తర్వాత 1992లో సత్య నాదెళ్ల విండోస్‌ ఎన్‌టీ (Windows NT) ప్రాజెక్ట్ కోసం మైక్రోసాఫ్ట్‌లో చేరారు. మైక్రోసాఫ్ట్‌ సంస్థ విడుదల చేసిన తొలి విండోస్‌ ఓఎస్‌ ఇదే. తర్వాత ఆయన మైక్రోసాఫ్ట్‌కు చెందిన బింగ్‌ (Bing), ఎమ్‌ఎస్‌ ఆఫీస్‌ (Microsoft Office), ఎక్స్‌బాక్స్‌ లైవ్‌ (XBOX Live), క్లౌడ్‌ సాంకేతికతకు సంబంధించిన ఈవీపీ(EVP) వంటి వాటిని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. 

సక్సెస్‌ సీక్రెట్‌

30 ఏళ్ల పాటు ఒకే సంస్థలో పనిచేయడం గురించి మాట్లాడుతూ..‘‘ 1992లో 22 ఏళ్ల వయసులో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగంలో చేరాక, ఈ ప్రపంచంలోనే గొప్ప ఉద్యోగం చేస్తున్నానని అనుకునేవాణ్ని. నేను చేస్తున్న పని గొప్పదనే భావనతో ఉండేవాణ్ని. మరో చోటికి వెళ్లి ఉద్యోగం చేయాలనే ఆలోచన నాకు ఉండేది కాదు. ఇప్పటికీ చాలా మంది కెరీర్‌కు సంబంధించి మంచి సలహా ఇవ్వమని అడుగుతుంటారు. వారికి నేను చెప్పేదొక్కటే.. మీరు బాగా పనిచేసేందుకు మరో ఉద్యోగం కోసం ఎదురుచూడొద్దని చెబుతాను. నేను సీఈవో అయ్యే ముందు రోజు వరకు నాకు అలాంటి ఆలోచనేలేదు’’అని చెప్పారు. 

నాయకత్వం అనేది  విశేషాధికారమో, ప్రత్యేకమైన సౌకర్యమో మాత్రమే కాదని అన్నారు. ఇతరులకు నాయకత్వం వహిస్తున్నప్పుడు.. సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను కనుగొన్నప్పుడు మాత్రమే దానికి మనం అర్హులమని భావించాలి. అనుకూలమైన పరిస్థితుల కోసం ఎదురు చూడకుండా.. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే నాయకుడు తన బృందాన్ని విజయపథంలో నడిపించగలుగుతాడని అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని