Credit Suisse: సౌదీ నేషనల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ రాజీనామా.. క్రెడిట్‌ సూయిజ్‌ పతనమే కారణమా?

Credit Suisse: ఈ తరుణంలో ఖుదైరీ రాజీనామా చేయడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. క్రెడిట్‌ సూయిజ్‌ సంక్షోభమే ఆయన రాజీనామాకు దారి తీసి ఉండొచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated : 27 Mar 2023 17:27 IST

దుబాయ్‌: ‘సౌదీ నేషనల్‌ బ్యాంక్‌’ ఛైర్మన్‌ అమ్మర్‌ అల్‌-ఖుదైరీ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని రియాద్‌లోని ‘తడావుల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌’కు సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బ్యాంకు వెల్లడించింది. వ్యక్తిగత కారణాల వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొంది.

ఐరోపాలో ఇటీవల ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిన క్రెడిట్‌ సూయిజ్‌ (Credit Suisse)లో సౌదీ నేషనల్‌ బ్యాంక్‌ అతిపెద్ద వాటాదారు. ఇకపై తాము క్రెడిట్‌ సూయిజ్‌కు నిధులు సమకూర్చబోమని ఖుదైరీ 2023 మార్చి 15న ప్రకటించారు. వెంటనే క్రెడిట్‌ సూయిజ్‌ షేర్లు 30 శాతానికి పైగా నష్టపోయాయి. ఈ పరిణామం తర్వాతే ఆ కంపెనీ ఆర్థికంగా పతనం అంచులకు చేరిందన్న విషయం స్పష్టమైంది. ఈ తరుణంలో ఖుదైరీ రాజీనామా చేయడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. క్రెడిట్‌ సూయిజ్‌ సంక్షోభమే ఆయన రాజీనామాకు దారి తీసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

సౌదీ నేషనల్‌ బ్యాంక్ మార్చి 15 నాటి ప్రకటన తర్వాత క్రెడిట్‌ సూయిజ్‌ను ఆదుకునేందుకు ‘స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌’ ముందుకొచ్చింది. 54 బిలియన్‌ డాలర్ల నిధులను సమకూర్చేందుకు అంగీకరించింది. అయినప్పటికీ.. ఇన్వెస్టర్లలో విశ్వాసం బలపడలేదు. షేర్ల పతనం కొనసాగింది. దీంతో మరింత సంక్షోభాన్ని నివారించేందుకు స్విట్జర్లాండ్‌ ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగింది. క్రెడిట్‌ సూయిజ్‌ను కొనుగోలు చేసేలా యూఎస్‌బీని ఒప్పించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని