Retirement Plan: ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం ప్లాన్ చేశారా?

పదవీ విరమణను దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల్లో చేర్చి సంపాద‌న ప్రారంభ‌మైన తొలి రోజుల నుంచే మ‌దుపు చేయ‌డం ప్రారంభించాలి

Updated : 28 Jan 2022 17:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పదవీ విరమణకు చాలా స‌మ‌యం ఉందిలే.. ఇప్ప‌టి నుంచే దాని గురించి ఆలోచించ‌డం ఎందుక‌ని చాలామంది అనుకుంటారు. అందుకే దీనికోసం ప్లాన్ చేయరు. కానీ వాస్త‌వానికి ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం ఎంత త్వ‌ర‌గా ప్లాన్ చేస్తే అంత మంచిది. దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల్లో చేర్చి సంపాద‌న ప్రారంభ‌మైన తొలి రోజుల నుంచే ఇందుకోసం మ‌దుపు చేయ‌డం ప్రారంభించాలి.

పొదుపు పెంచండి: మీ ఆదాయంలో అధిక భాగం పొదుపు చేసేందుకు ప్ర‌య‌త్నించండి. ఆదాయం పెరిగేకొద్దీ, ఖ‌ర్చులు పెర‌గ‌కుండా జాగ్ర‌త్త‌పడండి. మ‌రింత ఆదా చేసేందుకే ప్రయత్నించండి. కాల‌క్ర‌మేణా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీంతో మీరు దాచుకున్న సొమ్ము మీ అవ‌స‌రాల‌కు స‌రిపోదు. అందుకే దానికి త‌గిన‌ట్లుగా పొదుపు, పెట్టుబ‌డులు చేయ‌డం అల‌వాటు చేసుకోవాలి. నెలవారీ ఖర్చులలో కనీసం 6-12 నెలలు ఖ‌ర్చుల‌కు స‌రిప‌డా అత్య‌వ‌స‌ర నిధి ఏర్పాటుచేసుకోవాలి.

పెట్టుబడులు ప్రారంభించండి: ఆదాయం త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ.. ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకుని పెట్టుబ‌డులు పెట్ట‌డం ప్రారంభించాలి. మొద‌ట కొంత చిన్న మొత్తంతో మ‌దుపు చేయండి. ప్ర‌తి ఏడాదీ ఆదాయం పెరిగే కొద్దీ పెట్టుబ‌డులు పెంచుకుంటూ పోవాలి. అప్పుడే దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల కోసం ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అధిగ‌మించి రాబ‌డి పొందేందుకు అవకాశం ఉంటుంది. ఆదాయంలో కనీసం 30 శాతం మదుపు చేయాలి.

బీమా: ప్రారంభ సంవత్సరాల్లో పెట్టుబ‌డుల‌పై శ్రద్ధ అవసరం. బీమా ఉంటే ఇత‌ర ల‌క్ష్యాల కోసం చేసిన ప్ర‌ణాళిక‌లు సాఫీగా సాగుతాయి. అందువ‌ల్లే ఉద్యోగంలో చేరిన మొద‌టి నుంచే వ్య‌క్తిగ‌తంగా, కుటుంబానికి త‌గిన జీవిత‌, ఆరోగ్య బీమా తీసుకోవాలి. సంస్థ ఇచ్చే బృంద బీమా కాకుండా మీకు ప్రత్యేక‌మైన ఆరోగ్య బీమా పాల‌సీలు ఉండాలి. కుటుంబ ఆరోగ్య బీమా కోసం ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీల‌ను ప‌రిశీలించ‌వ‌చ్చు. కుటుంబ స‌భ్యులు మీ ఆదాయంపైనే ఆధార‌ణ‌ప‌డి ఉంటే.. కుటుంబ భవిష్యత్‌ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కలిగి ఉండటం తప్పనిసరి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 12-15 రెట్లు జీవిత బీమా ఉండేలా చూసుకోవాలి. ఎండోమెంట్, మనీ బ్యాక్, హూ లైఫ్, యులిప్ లాంటి పాలసీల  నుంచి దూరంగా ఉండడం మంచిది. వీటిలో బీమా హామీ తక్కువ. రాబడి కూడా తక్కువే.

రిస్క్‌ తీసుకోండి: పెట్టుబడులు ద్రవ్యోల్బణాన్ని అధిగ‌మించి ప్ర‌యోజ‌నాల‌ను అందించాలంటే రిస్క్ తీసుకోక త‌ప్ప‌దు. ఫోర్ట్‌ఫోలియో కొంత శాతం ఈక్విటీ పెట్టుబ‌డులు ఉండాలి. అయితే, అవ‌గాహ‌న లేకుండా పెట్టుబ‌డులు ప్రారంభిస్తే పూర్తిగా న‌ష్ట‌పోవ‌చ్చు. అందువ‌ల్ల‌ ఈక్వీటీల‌లో మ‌దుపు చేసేవారు ఆర్థిక నిపుణుడిని సంప్ర‌దించి వారి స‌ల‌హాను, సూచ‌న‌లు తీసుకోవ‌డం మంచిది. ఈక్విటీ-ఆధారిత మ్యూచువల్ ఫండ్ల‌ను ఎంపిక చేసుకోండి. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్‌లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు.

సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప్లాన్ చేయండి: ఎంత‌ త్వ‌ర‌గా పెట్టుబ‌డులు ప్రారంభిస్తే.. అంత ఎక్కువ నిధిని స‌మ‌కూర్చుకోవ‌చ్చ‌ని గ్ర‌హించాలి. ఎక్కువ కాలం పెట్టుబ‌డులు కొన‌సాగిస్తే కాంపౌండింగ్‌ ప్రయోజనాన్ని పొందొచ్చు. ఉదాహరణకు, మీకు 45 సంవత్సరాల వయస్సు ఉంటే, 60 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేసే సమయానికి, 15 ఏళ్లు స‌మ‌యం ఉంటుంది. నెలకు రూ.10 వేలు పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, 8 శాతం రాబ‌డి అంచ‌నాతో సుమారు 35 ల‌క్ష‌లు స‌మ‌కూర్చుకోగ‌ల‌రు. అదే నెల‌కు రూ.10 వేల‌తో 35 సంవ‌త్స‌రాల వ‌య‌సులో పెట్ట‌బడులు ప్రారంభిస్తే సుమారు రూ.95 లక్షలు, 30 సంవ‌త్స‌రాల వ‌య‌సులో ప్రారంభిస్తే సుమారు రూ.1.50 కోట్ల‌ కార్పస్‌ను కూడబెట్టుకోగలుగుతారు. 30 సంవ‌త్స‌రాల వ‌య‌సులో రిస్క్ తీసుకునే సామ‌ర్థ్యం ఎక్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి ఈక్వీటీల్లో పెట్టుబ‌డి పెడితే దీర్ఘ‌కాలంలో 12 శాతం వ‌ర‌కు రాబ‌డి అంచ‌నా వేయొచ్చు. అలా అయితే రూ.3.50 కోట్ల వ‌ర‌కు నిధి స‌మ‌కూర్చుకోవ‌చ్చు.

చివ‌రగా..: ఇత‌రుల‌పై ఆధార‌ప‌డ‌కుండా ప‌ద‌వీవిర‌మ‌ణ జీవితాన్ని ఆనందంగా జీవించాలంటే.. ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం వీలైనంత త్వ‌ర‌గా పెట్టుబ‌డులు ప్రారంభించాల్సిందే. పొదుపు మొత్తాన్ని ఒకే ప‌థ‌కంలో కాకుండా రెండు మూడు ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డులు చేస్తూ ఫోర్ట్‌ఫోలియోని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏడాదికి ఒక‌సారైనా ఫోర్ట్‌ఫోలియోని స‌మీక్షించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని