Health insurance: ఆరోగ్య బీమాతో రూ. 1 ల‌క్ష వర‌కు ప‌న్ను ఆదా! ఎలాగంటే..

ఆరోగ్య బీమా రూ. 1 ల‌క్ష వ‌ర‌కు ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు.   

Updated : 26 Mar 2022 15:08 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 - 2022) కొన్ని రోజుల్లో ముగియనుంది. ఇప్పటికీ పన్ను ఆదా కోసం పెట్టుబడులు పెట్టని వారు.. మార్చి 31లోగా ఆ ప్రక్రియను ముగించాలి. అయితే, ప‌న్ను ఆదా కోసం ప్ర‌తీ ఒక్క ప‌న్ను చెల్లింపుదారుడు ముందుగా సెక్ష‌న్ 80సి నే ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. సెక్ష‌న్ 80సి ప‌రిమితి రూ. 1.50 లక్ష‌ల వరకు మాత్రమే. ఇలాంటప్పుడు సెక్ష‌న్ 80డి ప‌రిగ‌ణించ‌వ‌చ్చు.  

నేటి రోజుల్లో చిన్న, పెద్ద తేడా లేకుండా ప్ర‌తీ ఒక్క‌రికీ ఆరోగ్య బీమా అవ‌స‌రం. భ‌విష్య‌త్తులో వ‌చ్చే వైద్య అవ‌స‌రాల‌కు ఇది ఆర్థికంగా చేయూతనిస్తుంది. అంటే కుటుంబ సంర‌క్ష‌ణ‌కు ఆరోగ్య బీమా త‌ప్ప‌నిస‌రి.  దీంతో పాటు ప‌న్ను కూడా ఆదా చేసుకోవ‌చ్చు. సెక్షన్ 80డి ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులకు సంబంధించిన అన్ని పరిమితులు, నిబంధనలకు లోబడి పన్ను మినహాయింపు ఇస్తుంది. రూ. 1 ల‌క్ష వ‌ర‌కు ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు. అయితే, ప‌న్ను ప‌రిమితి ప‌న్ను చెల్లింపుదారుడి వ‌య‌సు, అత‌ను ఎవ‌రి కోస‌మైతే ఆరోగ్య‌బీమా కొనుగోలు చేశారో.. ఆయా వ్య‌క్తుల వ‌య‌సుపై ఆధారప‌డి ఉంటుంది. 

వ్యక్తిగత ప్లాన్‌లు, మెడిక్లెయిమ్, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్, క్రిటికల్ ఇల్‌నెస్‌ ప్లాన్లు, జీవిత బీమా ప్లాన్‌ల హెల్త్ రైడర్లు, ఇతర ఆరోగ్య బీమా వేరియంట్లు.. ఇలా ఆరోగ్య బీమా అందించే అన్ని ప్లాన్ల ప్రీమియం చెల్లింపుల‌పై ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961, సెక్ష‌న్ 80డి కింద‌ ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు. అలాగే 'హెల్త్ చెక్ అప్' ఖ‌ర్చుల‌పై కూడా సెక్ష‌న్ 80డి కింద‌ రూ. 5 వేల వ‌ర‌కు మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అయితే, మెడికల్ చెక్ అప్ వ్యక్తిగత ప్రీమియం మినహాయింపులో భాగమే. వ్య‌క్తి వ‌య‌సుపై ఈ లిమిట్ ఆధార‌ప‌డి ఉంటుంది. 60 ఏళ్ల లోపు వ్య‌క్తుల కోసం చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపుపై రూ. 25 వేల వ‌ర‌కు, 60 ఏళ్లు పైబ‌డిన వారికి రూ. 50 వేల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. 

ఒక‌వేళ 60 ఏళ్ల లోపు వ‌య‌సు గల వారు తమ పేరున, అలాగే 60 ఏళ్లు దాటిన త‌మ త‌ల్లిదండ్రుల కోసం ఆరోగ్య బీమా తీసుకుంటే, ప్రీమియం చెల్లింపుపై రూ. 75 వేల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. అదే ప‌న్ను చెల్లింపుదారుడు, అత‌ని/ ఆమె త‌ల్లిదండ్రులు ఇద్దరూ సినియ‌ర్ సిటిజ‌న్లు అయితే బీమా ప్రీమియం చెల్లింపుల‌పై రూ. 1 ల‌క్ష వ‌ర‌కు ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు.

కొన్ని ఉదాహరణల ద్వారా పరిశీలిస్తే…
కేస్ 1:

రామ్ వయసు 35 సంవత్సరాలు. అతనికి భార్య, ఒక కూతురు, తల్లిదండ్రులు (తల్లి వయసు 55, తండ్రి వయసు 57 సంవత్సరాలు)
ఒక ఏడాదికి రామ్ తనకు + భార్యకు + కూతురికి కలిపి ఉన్న పాలసీకి రూ. 15,000 చెల్లించాడు. తల్లిదండ్రలకు రూ. 34 వేలు  బీమా ప్రీమియం చెల్లించాడు. అయితే, సెక్షన్ 80డి కింద రామ్‌కి ఎంత పన్ను మినహాయింపు లభిస్తుందో చూద్దాం…
వ్యక్తిగత + కుటుంబానికి కలిపి పన్ను మినహాయింపు పరిమితి రూ.25,000 , తల్లిదండ్రులకు రూ.25,000. అంటే రామ్ ఇప్పుడు రూ.15,000 + రూ.25,000 మొత్తం కలిపి రూ.40,000 సెక్షన్ 80డి కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. 

కేస్ 2:
రాకేష్ వయసు 48 సంవత్సరాలు, అతనికి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు (తల్లి వయసు 64, తండ్రి వయసు 70 సంవత్సరాలు) ఉన్నారు.
సంవత్సరానికి బీమా ప్రీమియం తనకు, భార్య, ఇద్దరు పిల్లలకు కలిపి రూ.32,000 చెల్లిస్తున్నాడు. తల్లిదండ్రుల కోసం రూ. 63,000, అదేవిధంగా మెడికల్ చెకప్ కోసం రూ.8000 చెల్లిస్తున్నాడు. అయితే, ఇప్పుడు రాకేష్ సెక్షన్ 80డి కింద ఎంత క్లెయిమ్ చేసుకోచ్చు అంటే…

రాకేశ్ + భార్య + పిల్లలు కలిపి మినహాయింపు పరిమితి రూ.25,000, తల్లిదండ్రులు సినియర్ సిటిజన్లు కావడంతో పరిమితి రూ.50,000. అంటే రాకేశ్ ఇప్పుడు మొత్తం రూ.75,000 క్లెయిమ్ చేసుకోవచ్చు. రాకేష్ చెల్లిస్తున్న ప్రీమియం మినహాయింపు పరిమితికి మించి ఉంది కాబట్టి మెడికల్ చెకప్ కోసం చెల్లించిన మొత్తం క్లెయిమ్ చేసుకునేందుకు వీల్లేదు. ఎందుకంటే, మెడికల్ చెకప్ వ్యక్తిగత ప్రీమియం మినహాయింపులో కలిపి ఉంటుంది.

కేస్ 3:
శివ‌ వయసు 61 సంవత్సరాలు, అతనికి భార్య, ఇద్ద‌రు పిల్ల‌లు, తండ్రి (తండ్రి వయసు 84 సంవత్సరాలు) ఉన్నారు. పిల్ల‌లు వివాహ‌, ఉద్యోగ జీవితాల్లో సెటిల్ అయ్యిపోయారు. తనకు, భార్యకు కలిపి సంవ‌త్స‌రానికి రూ.45,000 ఆరోగ్య బీమా ప్రీమియం, హెల్త్ చెక‌ప్ కోసం రూ. 5 వేలు చెల్లిస్తున్నాడు. తండ్రి కోసం రూ.35,000, అదే విధంగా మెడికల్ చెకప్ కోసం రూ.8000 ఖ‌ర్చు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు శివ‌ సెక్షన్ 80డి కింద ఎంత క్లెయిమ్ చేసుకోచ్చు అంటే…

శివ సీనియ‌ర్ సిటిజ‌న్ కావున అత‌ను + భార్య కలిపి మినహాయింపు పరిమితి రూ.50,000, తండ్రి సినియర్ సిటిజన్ కావడంతో పరిమితి రూ.50,000. అంటే శివ‌ ఇప్పుడు మొత్తం రూ.1,00,000 క్లెయిమ్ చేసుకోవచ్చు.  శివ‌ చెల్లిస్తున్న ప్రీమియం మిన‌హాయింపు ప‌రిమితికి మించ‌లేదు కాబ‌ట్టి హెల్త్ చెక్‌తో క‌లిపి త‌ను, భార్య కోసం చెల్లిస్తున్న రూ. 45,000+ రూ. 5,000 = రూ.  50,000, అలాగే తండ్రి కోసం చెల్లిస్తున్న రూ. 35,000 + రూ. 5,000 = రూ. 40,000 మొత్తం రూ. 90,000 క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. (ఇక్క‌డ తండ్రి హెల్త్ చెకప్ కోసం రూ. 8,000 ఖ‌ర్చు చేస్తున్నా రూ. 5,000 మాత్ర‌మే మిన‌హాయింపు ప‌రిమితి ఉంటుంది)

సూప‌ర్ సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు.. సెక్ష‌న్ 80డి డిడ‌క్ష‌న్‌..
ఆదాయ‌పు ప‌న్ను శాఖ.. 80 సంవ‌త్స‌రాలు నిండిన వ్య‌క్తుల‌ను సూప‌ర్ సీనియ‌ర్ సిటిజ‌న్ క్యాటగిరీకి తీసుకొస్తుంది. ఇటువంటి వారికి బీమా ప్రీమియం చెల్లింపులు + ముంద‌స్తు హెల్త్ చెక‌ప్ ఖ‌ర్చుల‌పై సెక్ష‌న్ 80డి ప్ర‌కారం రూ. 50,000 వ‌ర‌కు మినహాయింపు ల‌భిస్తుంది. ఒక‌వేళ సూప‌ర్ సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఆరోగ్య బీమా లేక‌పోతే..అటువంటి వారు మెడిక‌ల్ చెక‌ప్‌లు, ట్రీట్‌మెంట్ల‌కు అయిన ఖ‌ర్చుల‌పై సెక్ష‌న్ 80డి కింద రూ. 50,000 క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఇది వారి స్వంత ఖ‌ర్చుల‌కు క్లెయిమ్ చేసుకోలేరు.

చివ‌రిగా:

ఆరోగ్య బీమా పాలసీపై పన్ను మినహాయింపు పొందడం మంచి విషయం. ఆరోగ్య బీమా అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసర‌ని కోవిడ్ త‌ర్వాత అంద‌రికీ అర్థమ‌య్యింది. అందువ‌ల్ల ప్ర‌తీ ఒక్క‌రూ వారి వారి ఆర్థిక‌ ప్రణాళికలో ఆరోగ్య బీమాను భాగం చేయాలి. వ్యక్తిగత, కుటుంబ ఆరోగ్య బీమా పాలసీని తీసుకుంటే ఆరోగ్య భద్రతతో పాటు ప‌న్ను ఆదా చేసుకోవచ్చు. బీమా హామీ ఎంత తీసుకోవాలన్నది వ్యక్తిగత స్థితిగతులు, కుటుంబ ఆరోగ్య పరిస్థితులపై ఆధార‌ప‌డి ఉంటుంది. అందుకు అనుగుణంగానే బీమా తీసుకోవాలి త‌ప్ప ప‌న్ను మిహాయింపు దృష్టిలో పెట్టుకుని తీసుకోకూడ‌దు. ప‌న్ను మిన‌హాయింపు అద‌న‌పు ప్ర‌యోజ‌నం కింద మాత్ర‌మే చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని