SBI Annuity Deposit Scheme: ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ్‌తో ప్రతినెలా ఆదాయం!

SBI Annuity Deposit Scheme: ఒకేసారి పెద్ద మొత్తంలో డిపాజిట్‌ చేసి దాన్నుంచి నెలనెలా ఆదాయం పొందాలనుకునేవారికి ఎస్‌బీఐ అందిస్తున్న యాన్యుటీ డిపాజిట్‌ స్కీమ్‌ సరిగ్గా సరిపోతుంది. ఈ స్కీమ్‌ పూర్తి వివరాలేంటో చూద్దాం..!

Updated : 18 May 2023 16:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణ బ్యాంకింగ్‌ సేవలతో పాటు ఎస్‌బీఐ తమ ఖాతాదారులకు అనేక రకాల ఇతర పథకాలు, ప్లాన్‌లను అందిస్తోంది. అందులో ఒకటి ‘ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్‌ స్కీమ్‌ (SBI Annuity Deposit Scheme)’. ఒకేసారి పెద్ద మొత్తంలో డిపాజిట్‌ చేసి.. ప్రతినెలా కొంత మొత్తాన్ని ఆదాయంగా పొందాలనుకునేవారికి ఇది సరైన పథకం. దీని పూర్తి వివరాలను తెలుసుకుందాం..

చాలా మంది పెద్ద మొత్తంలో డబ్బు పొదుపు చేసుకొని పెట్టుకుంటారు. దాన్నుంచి ప్రతినెలా ఆదాయం పొందాలని అనుకుంటారు. కానీ, బయట వడ్డీలకు తిప్పడం అంత సురక్షితం కాదు. అలా అని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే కాలపరిమితి ముగిసే వరకు వేచి చూడాలి. పోనీ ఎక్కడైనా మదుపు చేద్దామంటే.. రాబడిపై కచ్చితమైన హామీ ఉండదు. అలాంటి వారికి ఈ ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్‌ స్కీమ్‌ (SBI Annuity Deposit Scheme) సరిగ్గా సరిపోతుంది.

ఈ పథకం (SBI Annuity Deposit Scheme)లో భాగంగా ఒకేసారి పెద్ద మొత్తంలో బ్యాంకులో డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. దానిపై వచ్చే వడ్డీతో పాటు డిపాజిట్‌లో కొంత మొత్తాన్ని నెలనెలా ఖాతాలో జమ చేస్తారు. భారత పౌరసత్వం ఉన్న ఎవరైనా ఈ స్కీమ్‌ (SBI Annuity Deposit Scheme)లో చేరొచ్చు. మైనర్లకు కూడా పథకం అందుబాటులో ఉంది. ఎన్‌ఆర్‌ఈ, ఎన్‌ఆర్‌ఓ కేటగిరీలోకి వచ్చే కస్టమర్లు దీంట్లో చేరడానికి అనుమతి లేదు.

స్కీమ్‌ ఫీచర్లు..

  • డిపాజిట్‌ చేయాల్సిన మొత్తంపై ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు.
  • 36/60/84/120 నెలల కాలపరిమితితో డిపాజిట్‌ చేయొచ్చు.
  • భారత్‌లో ఉన్న ఏ ఎస్‌బీఐ శాఖలోనైనా ఈ పథకం అందుబాటులో ఉంటుంది.
  • టర్మ్‌ డిపాజిట్‌కు వర్తించే వడ్డీరేటునే యాన్యుటీ ప్లాన్‌కు కూడా వర్తింపజేస్తారు.
  • ప్రతినెలా అందే యాన్యుటీ మొత్తాన్ని బ్యాంకు పొదుపు లేదా కరెంటు ఖాతాలో జమ చేస్తారు.
  • నెలకు కనీసం రూ.1,000 యాన్యుటీ అందేలా డిపాజిట్‌ చేయాలి.
  • ఏ ఎస్‌బీఐ బ్రాంచికైనా పథకాన్ని బదిలీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. నామినీని కూడా ఎంపిక చేసుకోవచ్చు.
  • ఏ తేదీనైతే డిపాజిట్‌ చేస్తారో.. ప్రతినెలా అదే రోజున యాన్యుటీ అందుతుంది. ఒకవేళ ఆ తేదీ ఏదైనా నెలలో లేనట్లయితే వచ్చే నెల మొదటిరోజు యాన్యుటీ మొత్తం డిపాజిట్‌ అవుతుంది.
  • ప్రతినెలా యాన్యుటీ అందుకోగా మిగిలిన మొత్తంపై 75 శాతం వరకు ఓవర్‌డ్రాఫ్ట్‌ లేదా లోన్‌ కింద పొందొచ్చు.
  • లోన్‌ తీసుకుంటే యాన్యుటీ మొత్తం లోన్‌ ఖాతాలో డిపాజిట్‌ అవుతుంది.
  • రూ.15 లక్షలు వరకు చేసే డిపాజిట్లపై ముందస్తు ఉపసంహరణ ఆప్షన్‌ అందుబాటులో ఉంది. కానీ, టర్మ్‌ డిపాజిట్‌ నిబంధనల ప్రకారం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
  • ఒకవేళ డిపాజిటర్‌ మరణిస్తే మిగిలిన మొత్తాన్ని నామినీ లేదా చట్టపరమైన వారసులకు అందిస్తారు. ఎలాంటి పెనాల్టీ ఉండదు.

ఉదాహరణకు.. ఒక వ్యక్తి రూ.ఐదు లక్షలు ఐదేళ్ల కాలపరిమితితో ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్‌ స్కీమ్‌లో డిపాజిట్‌ చేశారనుకుందాం. ఈ మొత్తానికి ప్రస్తుతం ఉన్న టర్మ్‌ డిపాజిట్‌ రేట్ల ప్రకారం 6.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ లెక్కన సదరు వ్యక్తి నెలకు దాదాపు రూ.9,750 స్థిరమైన యూన్యుటీ పొందుతారు. దీంట్లో రూ.2,710 వడ్డీ కాగా.. మిగిలిన మొత్తాన్ని రూ.ఐదు లక్షల డిపాజిట్‌ నుంచి చెల్లిస్తారు. ఇలా ప్రతి నెలా డిపాజిట్‌ కొంత మొత్తం తగ్గుతూ వస్తుంది. ఆ మేర నెలనెలా వచ్చే వడ్డీ సైతం తగ్గుతుంది. ఫలితంగా ప్రతినెలా యాన్యుటీ మొత్తంలో డిపాజిట్‌ నుంచి చెల్లించే వాటా పెరుగుతూ ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని