ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ ప‌థ‌కం (Vs) పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్‌

కొన్ని ప‌థ‌కాలు సాధార‌ణ నెల‌వారీ ఆదాయాన్ని గ్యారెంటీగా అందిస్తాయి.

Updated : 01 Aug 2022 16:17 IST

మార్కెట్ లో అనేక పెట్టుబడి పధకాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని పధకాలు మంచి రాబడిని అందించినా రిస్క్ తో కూడుకుని ఉంటాయి. వాటిలో ఒకోసారి నష్టాలూ రావచ్చు. అయితే, కష్టపడిన సొమ్ముని నష్టాల్లో చూడడం చాలా మందికి బాధగా ఉంటుంది. ప్ర‌భుత్వ రంగ బ్యాంకు/పోస్టాఫీసు ల పధకాలు మదుపరులకు పూర్తిగా ధీమానిస్తాయి. స్వల్పకాలానికి రిస్క్ లేకుండా హామీ తో కూడిన రాబడిని కోరుకునే వారి కోసం ఇలాంటి రెండు ప‌థ‌కాలు దిగువ‌న ఉన్నాయి. వాటి ఫీచర్స్, రాబడి, ఇతర వివరాలు తెలుసుకుందాం.

ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ పథకం:
ఖాతాదారులు నెలవారీ ఆదాయ పథకం అయిన ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ పథకంలో ఒకేసారి డిపాజిట్ చేయొచ్చు . ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 36, 60, 84, 120 నెలలు. వ్యక్తులు, మైనర్లు వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ పథకాన్ని తెరవొచ్చు . ఈ పథకంపై సాధారణ ప్రజలకు బ్యాంకు ప్రస్తుతం 5.45% - 5.50% వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లకు 5.95% - 6.30% వడ్డీ రేటును అందజేస్తోంది. ఈ పథకానికి నామినేషన్ సౌకర్యముంది. పథకంలో ఓవ‌ర్‌డ్రాఫ్ట్‌, రుణ సౌకర్యం ఉంది. ఈ అవకాశం ఖాతా నిల్వలో 75% వరకు ఉంటుంది. ఈ ఖాతాలో రూ. 15 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు . అకాల ఉపసంహరణకు అనుమతి ఉంది. అయితే, టర్మ్ డిపాజిట్లపై వర్తించే విధంగానే జరిమానా ఉంటుంది. డిపాజిటర్ మరణిస్తే ఎలాంటి పరిమితులు లేకుండా ముందస్తుగా కూడా నామినీ డిపాజిట్‌ని ఉపసంహరించుకోవచ్చు . 

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌క‌మ్‌ స్కీమ్ (PO-MIS): 
ఈ పథకంలో హామితో కూడిన నెలవారీ ఆదాయాన్ని పొందొచ్చు . ఇది ప్రభుత్వ హామి ఉన్న పథకం కాబట్టి, మెచ్యూరిటీ వరకు పెట్టుబడులకు ప్రభుత్వంచే రక్షణ ఉంటుంది. ప్రభుత్వం నిర్వహించే పోస్టాఫీసు మంత్లీ ఇన్‌క‌మ్‌ స్కీ మ్ (PO-MIS) అనేది చిన్న పొదుపు పెట్టుబడి పథకాలలో ఒకటి. ముఖ్యంగా  సాంప్రదాయవాద పెట్టుబడిదారులు, సీనియర్ సిటిజన్లకు ఈ పథకం సరైనది.

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌క‌మ్ ప‌థ‌కంలో కనీసం రూ. 1,000 పెట్టుబడి పెట్టవచ్చు. ఒక ఖాతాలో గరిష్టంగా రూ. 4.50 లక్షలు, ఉమ్మడి ఖాతాలో రూ. 9 లక్షలు గరిష్టంగా పెట్టుబడి పెట్టవచ్చు. సంవత్సరానికి లభించే వడ్డీ రేటు 6.60%, ప్రతి నెలా వడ్డీ అందచేస్తారు. ఈ నెలవారీ ఆదాయ పథకం 5 సంవత్సరాల లాక్-ఇన్ కాల వ్యవధితో వస్తుంది. పెట్టుబడి మెచ్యూర్ అయిన తర్వాత నిధులను ఉపసంహరించుకోవచ్చు, తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు . అయితే, ఇది ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది. ఈ పోస్టాఫీసు పథకంలో పెట్టుబడులు సెక్షన్ 80సీ కిందకు రావు. సీనియర్ సిటిజన్లకు అదనపు ప్రయోజనాలు కూడా ఉండవు.

ఈ పథకంలో పెట్టుబడులు పెట్టిన మొదటి నెల నుండి వడ్డీ రాబడిని అందుకోవచ్చు . వడ్డీ ప్రతి నెలాఖరులో వస్తుంది. అయితే ఇందులో రాబడులు ద్రవ్యోల్బణాన్ని అధిగమించవని నిపుణుల అభిప్రాయం. అయితే ప్రముఖ బ్యాంకుల వడ్డీ రేట్లతో పోలిస్తే ఇందులో వడ్డీ కాస్త ఎక్కువే అని చెప్పవచ్చు. మీరు మంత్లీ ఇన్‌క‌మ్ ప‌థ‌కంలో గరిష్టంగా ముగ్గురు వ్యక్తులతో ఉమ్మడి ఖాతాను కూడా తెరవచ్చు . 10 లేదా అంత‌కంటే ఎక్కువ వ‌య‌స్సున్న మైన‌ర్ త‌ర‌పున ఖాతాను తెర‌వ‌వ‌చ్చు. మైన‌ర్ 18 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌చ్చిన త‌ర్వాత ఖాతాను నిర్వ‌హించొచ్చు. ఖాతా మ‌ధ్య‌లో ఉప‌సంహ‌రించుకుంటే 1-2% వ‌ర‌కు జ‌రిమానా ఉంటుంది. ఖాతాదారుడు ఖాతా మెచ్యూరిటీకి ముందే మ‌ర‌ణించిన‌ట్ల‌యితే డిపాజిట్ మొత్తం నామినీకి లేదా చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సుల‌కు చెల్లిస్తారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని