SBI Chairman salary: ఎస్‌బీఐ ఛైర్మన్‌ జీతమెంతో తెలుసా..? ప్రైవేటు బ్యాంకు బాస్‌ల కంటే తక్కువే!

దేశీయ అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా జీతమెంతో తెలుసా?

Updated : 06 Jun 2022 20:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా జీతమెంతో తెలుసా? సంవత్సరానికి రూ.34.42 లక్షలు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆయన బేసిక్‌ పే ద్వారా రూ.27 లక్షలు పొందగా.. రూ.7.42 లక్షలు డీఏ రూపంలో ఆయన అందుకున్నారు. ఇవి కాకుండా ప్రోత్సాహకాల రూపంలో మరో రూ.4 లక్షలు ఆయనకు లభించింది. దీంతో ఏడాది మొత్తంగా ఆయన రూ.38.12 లక్షలు వేతనంగా పొందారు. గతేడాదికి సంబంధించి తాజాగా ఎస్‌బీఐ వెలువరించిన వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

1984లో ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఖారా.. 2020 అక్టోబర్‌లో ఎస్‌బీఐ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు ఎస్‌బీఐ బోర్డులో ఉన్న నలుగురు మేనేజింగ్‌ డైరెక్టర్లు అదే స్థాయిలో వేతనాలు అందుకుంటున్నారు. చల్లా శ్రీనివాసులు శెట్టి రూ.32.62 లక్షలు, అశ్వనీ భాటియా రూ.32.15 లక్షలు, స్వామినాథన్‌ జానకిరామన్‌ రూ.31.74 లక్షలు, అశ్వినికుమార్‌ తివారీ రూ.31.66 లక్షలు చొప్పున వేతనాలుగా పొందుతున్నట్లు ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది.

ఇక మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకు అధిపతుల వేతనాల విషయానికొస్తే.. కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఎల్వీ ప్రభాకర్‌ అదే ఏడాది రూ.36.89 లక్షలు వేతనంగా పొందారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎండీ, సీఈఓ సంజీవ్‌ చద్దా రూ.40.46 లక్షలు పొందారు. అదే సమయంలో ప్రైవేటు బ్యాంకుల బాస్‌ల ఇంతకంటే కొన్ని రెట్లు అధికంగా వేతనం లభిస్తుండడం గమనార్హం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ శశిధర్‌ జగదీశన్‌ ఏడాదికి అక్షరాలా రూ.4.77 కోట్లు వేతనంగా అందుకున్నారు. యాక్సిస్‌  బ్యాంక్‌ ఎండీ అమితాబ్‌ చౌధరి ఇదే ఏడాది రూ.6 కోట్లు వేతనంగా పొందారు. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ సందీప్‌ భక్షి మాత్రం కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో కేవలం ఒక్క రూపాయి మాత్రమే గౌరవ వేతనంగా తీసుకోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని