SBI Card: ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు రుసుములు.. ఏ సేవకు ఎంతెంత?

ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు హోల్డర్లు..అనేక ఆర్థిక సేవలు పొందొచ్చు. వీటికి ఫీజులు, రుసుములు ఉంటాయి. అవెంటో ఇక్కడ తెలుసుకోండి.

Published : 20 Jan 2023 14:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు పొందడం ఇప్పుడు చాలా సులువు. అనేక ప్రయోజనాల కారణంగా చాలా మంది ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటారు. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ఉపయోగించడం కోసం వినియోగదారులు SBICPSL(ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌)కు వార్షిక రుసుముగా కొంత మొత్తాన్ని చెల్లించాలి. ఈ రుసుము నేరుగా కార్డు హోల్డర్‌ ఖాతాకు ఛార్జ్‌ చేస్తారు. కార్డు స్టేట్‌మెంట్‌లో ఇది కనబడుతుంది. దీంతో పాటు కార్డుపై విధించే వివిధ రుసుములు చూద్దాం.

పునరుద్ధరణ రుసుములు: కార్డు పునరుద్ధరణ రుసుము ప్రతి సంవత్సరం వసూలు చేస్తారు. ఇది వివిధ వినియోగదారులకు వేరు వేరుగా ఉండొచ్చు. అలాగే, వివిధ కార్డు వేరియంట్‌లకూ మారొచ్చు.

నగదు చెల్లింపు రుసుములు: ఎస్‌బీఐ కార్డు హోల్డర్లు తమ బకాయిలను ఎస్‌బీఐ ఎంపిక చేసిన శాఖల్లో రూ.250+వర్తించే పన్నుల సేవా రుసుముతో చెల్లించొచ్చు. దీని కోసం వారు తమ క్రెడిట్‌ కార్డు నంబరు, చెల్లించే మొత్తాన్ని పే-ఇన్‌-స్లిప్‌లో పేర్కొని బ్రాంచ్‌ కౌంటర్‌లో డిపాజిట్‌ చేయాలి. డిపాజిట్‌ చేసిన తర్వాత కార్డుదారులకు రశీదు అందిస్తారు. అయితే, కరూర్‌ వైశ్యా బ్యాంకుకు సంబంధించిన (ఎంపిక చేసిన) శాఖల్లో తమ బకాయిలను చెల్లించే ఎస్‌బీఐ కార్డు హోల్డర్లకు ఎటువంటి రుసుమూ వర్తించదు.

నగదు ఫీజు: దేశీయ, అంతర్జాతీయ ఏటీఎంలలో ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డును ఉపయోగించి నగదు ఉపసంహరణ చేసినట్లయితే రూ.500 లేదా 2.50% (ఏది ఎక్కువైతే అది) చొప్పున లావాదేవీ రుసుమును వసూలు చేస్తారు.

వడ్డీ రహిత గ్రేస్‌ పీరియడ్‌: వస్తువుల, వివిధ సేవల చెల్లింపులకు క్రెడిట్‌ కార్డు వాడిన అనంతరం గ్రేస్‌ పీరియడ్‌ 20 నుంచి 50 రోజుల వరకు ఉంటుంది. వినియోగదారుడు గత నెల బ్యాలెన్స్‌ను క్లియర్‌ చేసినప్పుడు మాత్రమే వడ్డీ రహిత క్రెడిట్‌ వ్యవధి వర్తిస్తుంది.

ఫైనాన్స్‌ ఛార్జీలు: ఒకవేళ వినియోగదారుడు తన బ్యాలెన్స్‌ను పూర్తిగా చెల్లించనట్లయితే, కార్డుదారుడు చెల్లించని ఈఎంఐ వాయిదాలు సహా అన్ని లావాదేవీలపై నెలవారీ వడ్డీ రేటుతో ఫైనాన్స్‌ ఛార్జీలను చెల్లించాలి. కార్డు హోల్డరు తీసుకున్న నగదుపై వాటిని తిరిగి చెల్లించే వరకు ఫైనాన్స్‌ ఛార్జీలు వర్తిస్తాయి. ప్రస్తుతం, ఫైనాన్స్‌ ఛార్జీలు (లావాదేవి తేదీ నుంచి) నెలకు 3.50% (సంవత్సరానికి 42%) వరకు ఉన్నాయి.

ఆలస్య చెల్లింపు ఛార్జీలు(LPC): కార్డుదారుడు సకాలంలో బకాయి చెల్లించడంలో విఫలమైతే LPC (Late Payment Charge) వర్తిస్తుంది. ఉదా: బకాయి మొత్తం రూ.500 కంటే ఎక్కువ, రూ.1000 కంటే తక్కువ ఉంటే..రూ.400 LPC చెల్లించాలి. రూ.1000-రూ.10,000 వరకు ఉన్న మొత్తాలకు రూ.750 చెల్లించాలి. రూ.10,001-రూ.25,000 వరకు ఉన్న మొత్తానికి రూ.950 LPC చెల్లించాలి.

ఓవర్‌ లిమిట్‌ ఫీజులు: బకాయి ఉన్న మొత్తం ఎస్‌బీఐ కార్డు పరిమితిని మించి ఉంటే ఓవర్‌ లిమిట్‌ రుసుము విధిస్తారు. ఓవర్‌ లిమిట్‌ మొత్తంలో 2.50% లేదా రూ.600 (ఏది ఎక్కువైతే అది) విధిస్తారు.

కార్డు రీప్లేస్‌మెంట్‌: నష్టం, దొంగతనం కారణంగా కార్డును పొగొట్టుకున్న వినియోగదారుడు.. కార్డును తిరిగి పొందడానికి రూ.100-250 వరకు చెల్లించాలి. 'Aurum' కార్డుదారుడు అయితే రూ.1500 చెల్లించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని