SBI క్రెడిట్‌ కార్డుదారులకు అలర్ట్‌.. నవంబర్‌ 15 నుంచి కొత్త ఛార్జీలు!

క్రెడిట్‌ కార్డుకు సంబంధించి SBI రెండు కీలక మార్పులు చేసింది. ఈఎంఐ లావాదేవీలపై ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్‌ ఫీజును పెంచేసింది. కొత్తగా రెంట్‌ పేమెంట్‌పై ఛార్జీలు వసూలు చేయబోతున్నట్లు ప్రకటించింది.

Updated : 20 Oct 2022 14:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వరంగ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన క్రెడిట్‌కార్డు వినియోగదారులకు షాకిచ్చింది. క్రెడిట్‌ కార్డుకు సంబంధించి రెండు కీలక మార్పులు చేసింది. ఈఎంఐ లావాదేవీలపై ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్‌ ఫీజును రూ.100 మేర పెంచేసింది. అలాగే కొత్తగా రెంట్‌ పేమెంట్‌పై ఛార్జీలు వసూలు చేయబోతున్నట్లు ప్రకటించింది. నవంబర్‌ 15 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఆ బ్యాంక్‌ కస్టమర్లకు సందేశాలు పంపుతోంది.

ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఆ మొత్తాన్ని ఈఎంఐ లావాదేవీగా మారిస్తే దానికి ప్రస్తుతం రూ.99+ వర్తించే పన్నులు ఎస్‌బీఐ వసూలు చేస్తోంది. నవంబర్‌ 15 నుంచి ప్రాసెసింగ్‌ ఫీజును రూ.199 చేసింది. అంటే ఇకపై ఎస్‌బీఐ కార్డుదారులు ఈఎంఐ లావాదేవీ చేస్తే రూ.199+ వర్తించే పన్నులు వసూలు చేస్తారు. అలాగే రెంట్‌ పేమెంట్‌ లావాదేవీలపై ఇప్పటి వరకు ఎలాంటి ఛార్జీలూ వేయని ఎస్‌బీఐ.. ఇకపై రూ.99+ వర్తించే పన్నులు వసూలు చేయనుంది. అయితే నవంబర్‌ 15లోపు లావాదేవీలు చేసే వారికి ఈ ఛార్జీలు వర్తించవు.

ప్రస్తుతం బ్యాంకులు థర్డ్‌ పార్టీ పేమెంట్స్‌ అందిస్తున్న ‘రెంట్‌పే’ ఆప్షన్‌పై దృష్టి సారించాయి. క్రెడిట్‌కార్డు ద్వారా స్వల్ప ఛార్జీలతో రెంట్‌ పేమెంట్‌ ఆప్షన్‌ను అవి వినియోగదారులకు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆయా లావాదేవీలపై 1 శాతం ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది. అక్టోబర్‌ 20 నుంచి ఈ ఛార్జీలను అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఇది వరకే ఆ బ్యాంక్‌ ప్రకటించింది. తాజాగా ఎస్‌బీఐ సైతం రూ.99+ చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది.

వాస్తవానికి రెంట్‌ పేమెంట్‌, మెయింటనెన్స్‌ అనేవి పైకి చెప్పే మాటలే. వాస్తవంలో జరిగేది వేరు. చాలా మంది వినియోగదారులు తమ అవసరాలకు నగదు అవసరం అయినప్పుడు ఈ సేవలను వినియోగించుకుంటున్నారన్నది వాస్తవం. సాధారణంగా క్రెడిట్‌కార్డుల నుంచి నేరుగా నగదు పొందాలంటే భారీ రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. దీన్నుంచి తప్పించుకునేందుకు క్రెడిట్‌కార్డుదారులు ఈ ‘థర్డ్‌పార్టీ’ మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐసీఐసీఐ, ఎస్‌బీఐలు ఛార్జీలను తీసుకొచ్చాయి. మున్ముందు ఇతర బ్యాంకులూ ఈ తరహా ఛార్జీలను తీసుకురాబోతున్నాయని తెలుస్తోంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts