ఎస్‌బీఐ లైఫ్ అందిస్తున్న సంపూర్ణ కాన్సర్ సురక్ష పాలసీ వివరాలు...

క్యాన్స‌ర్ నుంచి ఆర్ధిక ర‌క్ష‌ణ కోసం ప్ర‌త్యేక పాల‌సీని అందుబాటులోనికి తీసుకొచ్చింది ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌. సంపూర్ణ్ క్యాన్స‌ర్ సుర‌క్ష పేరిట దీనిని విడుద‌ల చేశారు.

Published : 19 Dec 2020 16:38 IST

స‌వాళ్లను ఎదుర్కొనే ప‌టిమ, నేర్పు, ఓర్పు ఉండి… అందుకు సంసిద్ధంగా ఉంటే… అది క్యాన్స‌ర్ లాంటి మ‌హ‌మ్మారి అయినా స‌రే… సుల‌భంగా పోరాడ‌గ‌లిగే ధైర్యం వ‌స్తుంది. క్యాన్స‌ర్ … ప్రాణాంత‌క వ్యాధి. చికిత్సా ఖ‌ర్చుల‌కు భ‌య‌ప‌డి వెన‌క‌డుగు వేసేవారు ఎంద‌రో. శారీర‌కంగా, మాన‌సికంగానే కాదు…ఆర్థికంగా చితికిపోయేలా చేస్తుందిది. ప్ర‌జా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ర‌క్షించేందుకు మేమున్నామంటూ ‘‘ఎస్‌బీఐ లైఫ్ సంపూర్ణ్ క్యాన్స‌ర్ సుర‌క్ష’’ పేరుతో ఓ స‌రికొత్త పాల‌సీని తీసుకొచ్చింది.

పాల‌సీ కొనుగోలు చేసే క‌నీస, గ‌రిష్ట వ‌య‌సు అర్హ‌త‌లు, బీమా హామీ సొమ్ము, ప్రీమియం చెల్లింపు, అందే ప్ర‌యోజ‌నాలను స‌వివ‌రంగా అందిస్తున్నాం.

క్యాన్స‌ర్ పాల‌సీ కీల‌క అంశాలివే…

SBI-CANCER-MAP.png

ఎవ‌రు కొనుగోలు చేయ‌వ‌చ్చు…

  • 6 నుంచి 65 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌వారి పేరిట ఈ పాల‌సీ కొనుగోలు చేయ‌వ‌చ్చు.

  • వ్య‌క్తి వ‌య‌సు 75 ఏళ్లు వ‌చ్చే దాకా ఈ పాల‌సీ వ‌ర్తిస్తుంది.

  • క‌నీస బీమా హామీ సొమ్ము… రూ.10ల‌క్ష‌లు… ఆ పై రూ.ల‌క్ష పెంచుకుంటూ వెళ్లొచ్చు. గ‌రిష్టంగా రూ.50ల‌క్ష‌ల దాకా అనుమ‌తిస్తారు.

  • పాల‌సీ కాల‌వ్య‌వ‌ధి క‌నీసం 5 ఏళ్లు. గ‌రిష్టం 30ఏళ్లు.
    SBI-PREMIUM.png

ప్రీమియం చెల్లింపులు

  • ప్రీమియం చెల్లించే గ‌డువు… పాల‌సీ కాల‌వ్య‌వ‌ధి కొన‌సాగేంత వ‌ర‌కు చేస్తుండాలి.

  • ప్రీమియం సంవ‌త్స‌రానికి ఒక సారి చెల్లించ‌వ‌చ్చు. లేదా ఆరు నెల‌ల‌కు, మూడు నెల‌ల‌కు, నెల‌కోసారి క‌ట్ట‌వ‌చ్చు.

  • నెల‌వారీ ప్రీమియం చెల్లింపును ఎంచుకుంటే తొలి సారి మూడు నెల‌ల ప్రీమియాన్ని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది.

  • రూ.15ల‌క్ష‌ల‌కు బీమా హామీ తీసుకుంటే… వ్య‌క్తి వ‌య‌సును బ‌ట్టి నెల‌కు రూ.50 క‌నీస ప్రీమియం, సంవ‌త్స‌రానికి రూ.600 ఉండ‌వ‌చ్చు. వ‌య‌సు, పాల‌సీ కాల‌వ్య‌వ‌ధి, పొగ‌తాగే అల‌వాటును బ‌ట్టి ప్రీమియంల‌లో మార్పు ఉంటుంది.

  • ప్రీమియం చెల్లింపుల‌కు అయిదేళ్ల బ్లాక్ పీరియ‌డ్‌ను నిర్ణ‌యించారు. అంటే అయిదేళ్ల దాకా ప్రీమియం రేట్లు స్థిరంగా ఉంటాయి. ఆ త‌ర్వాత రేట్ల‌ను స‌వ‌రించ‌వ‌చ్చు.

పాల‌సీ రకాలు

స్టాండ‌ర్డ్‌, క్లాసిక్‌, ఎన్‌హాన్స్‌డ్‌

స్టాండ‌ర్డ్ ర‌కం

పాల‌సీలో ఈ ర‌కానికి చెందినది కొనుగోలు చేస్తే … ప‌రిహారం అంద‌జేత ఇలా ఉంటుంది.

  • మైన‌ర్ ద‌శ‌లో క్యాన్స‌ర్ ను తొలి సారి గుర్తిస్తే బీమా హామీ సొమ్ములో 30శాతం చెల్లిస్తారు. రెండో సారి మైన‌ర్ క్యాన్స‌ర్‌ను గుర్తిస్తే మ‌రోసారి 30శాతం ప‌రిహారం అంద‌జేస్తారు.

  • ఆ త‌ర్వాత మేజ‌ర్ ద‌శ‌లో క్యాన్స‌ర్‌ను గుర్తిస్తే మిగ‌తా 40శాతం ప‌రిహారం అందిస్తారు.

ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్య‌క్తి రూ.10ల‌క్ష‌ల క్యాన్స‌ర్ పాల‌సీ తీసుకున్నాడ‌నుకుందాం. కొన్ని నెల‌ల త‌ర్వాత క్యాన్స‌ర్ మైన‌ర్ ద‌శ‌లో ఉన్న‌ట్టు గుర్తిస్తే రూ.3ల‌క్ష‌లు ప‌రిహారం ఇస్తారు. ఆ త‌ర్వాత మ‌రోసారి క్యాన్స‌ర్ మైన‌ర్ ద‌శ‌లో ఉన్న‌ట్టు గుర్తిస్తే రూ.3ల‌క్ష‌లు ప‌రిహారం ఇస్తారు. మేజ‌ర్ ద‌శ‌లో క్యాన్స‌ర్‌ను గుర్తిస్తే… మిగ‌తా రూ.4ల‌క్ష‌లు ఇస్తారు.

  • మొద‌టి సారి మైన‌ర్ ద‌శ‌లో క్యాన్స‌ర్‌ను గుర్తించాక త‌దుప‌రి 5 సంవ‌త్స‌రాల దాకా ప్రీమియంలు చెల్లించ‌న‌క్క‌ర్లేకుండా ప్రీమియం వెయివ్ ఆఫ్ చేసేస్తారు. రెండో సారి మైన‌ర్ ద‌శ క్యాన్స‌ర్‌ను గుర్తిస్తే ప్రీమియం వెయివ్ ఆఫ్ చేయ‌రు.

  • మేజ‌ర్ ద‌శ‌లో క్యాన్స‌ర్‌ను గుర్తింస్తే: మొత్తం బీమా హామీ సొమ్ము ఒకే సారి చెల్లిస్తారు. లేదా

60శాతం సొమ్మును ఒకే మొత్తంగా పొంది, మిగిలిన 40శాతం మొత్తాన్ని బీమా సంస్థ వ‌ద్దే ఉంచుకుని ప్ర‌తి నెలా మొత్తం బీమా హామీ సొమ్ములోంచి 1.2శాతం చెల్లిస్తుంటారు. ఈ నెలవారీ నగదు మొత్తం 36 నెల‌ల పాటు పొందవచ్చు.

ఉదాహ‌ర‌ణ‌కు రూ.10ల‌క్ష‌ల బీమా హామీ సొమ్ముపై మంత్లీ ఇన్‌క‌మ్ బెనిఫిట్ రూ.12వేలు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంది.

క్లాసిక్ ర‌కం

పాల‌సీలో ఈ ర‌కానికి చెందినది కొనుగోలు చేస్తే … ప‌రిహారం అంద‌జేత ఇలా ఉంటుంది.

  • స్టాండ‌ర్డ్ పాల‌సీ మాదిరిగానే ఇక్క‌డా మొద‌టిసారి మైన‌ర్ ద‌శ క్యాన్స‌ర్‌ను గుర్తిస్తే 30శాతం ప‌రిహారం, ఆ త‌ర్వాత మ‌రో 30శాతం ప‌రిహారం అంద‌జేస్తారు.

  • అయితే ఇక్క‌డ మైన‌ర్ ద‌శ‌లో క్యాన్స‌ర్ ను గుర్తించిన త‌దుప‌రి పాల‌సీ ట‌ర్మ్ ముగిసేవ‌ర‌కు ప్రీమియం చెల్లించ‌న‌క్క‌ర్లేదు.

  • స్టాండ‌ర్డ్ ర‌కం మాదిరిగానే …మేజ‌ర్ ద‌శ‌లో క్యాన్స‌ర్‌ను గుర్తింస్తే మొత్తం బీమా హామీ సొమ్ము ఒకే సారి చెల్లిస్తారు. లేదా

60శాతం సొమ్మును ఒకే మొత్తంగా పొంది, మిగిలిన 40శాతం మొత్తాన్ని బీమా సంస్థ వ‌ద్దే ఉంచుకుని ప్ర‌తి నెలా మొత్తం బీమా హామీ సొమ్ములోంచి 1.2శాతం చెల్లిస్తుంటారు. ఈ నెలవారీ నగదు మొత్తం 36 నెల‌ల పాటు పొందవచ్చు.

  • ఇక అడ్వాన్స్‌డ్ ద‌శ‌లో ఉండే క్యాన్స‌ర్‌ను గ‌నుక గుర్తించిన‌ట్టయితే బీమా హామీ సొమ్ములో 150శాతం సొమ్మును చెల్లిస్తారు.

ఉదాహ‌ర‌ణ‌కుః రూ.10ల‌క్ష‌ల బీమా హామీ సొమ్ము క‌లిగిన పాల‌సీ కొనుగోలు చేసిన‌ట్ట‌యితే … రూ.15ల‌క్ష‌ల దాకా ప‌రిహారం అందుకోవ‌చ్చు.
రెండు సార్లు మైన‌ర్ ద‌శ‌లో రూ.3లక్ష‌లు, రూ.3ల‌క్ష‌లు, ఇంకా మేజ‌ర్ ద‌శ‌లో రూ.6ల‌క్ష‌లు… ఇలా మొత్తం రూ.10ల‌క్ష‌లు ఇచ్చాక‌… అడ్వాన్స్‌డ్ ద‌శ‌కు క్యాన్స‌ర్ చేరుకుంటే బీమా హామీ మొత్తానికి 150% అంటే రూ.15ల‌క్ష‌లు చెల్లిస్తారు. ఇది వ‌ర‌కే రూ.10ల‌క్ష‌లు అందుకున్నారు కాబ‌ట్టి … ఇక చివ‌ర‌గా అదనపు రూ.5ల‌క్ష‌ల ప‌రిహారం అంద‌జేస్తారు.

ఎన్ హాన్స్‌డ్ ర‌కం

ఎన్ హాన్స్‌డ ర‌కం పాల‌సీ కొనుగోలు చేస్తే … ప‌రిహారం అంద‌జేత ఇలా ఉంటుంది.

  • క్లాసిక్ పాల‌సీ మాదిరిగానే ఇక్క‌డా తొలి సారి మైన‌ర్ ద‌శ క్యాన్స‌ర్ గుర్తింపున‌కు, మ‌లి సారి క్యాన్స‌ర్ గుర్తింపున‌కు… ఆ త‌ర్వాత మేజ‌ర్ ద‌శ క్యాన్స‌ర్ ద‌శ గుర్తింపున‌కు 30 శాతం, 30శాతం, 40శాతం వ‌రుస‌గా ప‌రిహార చెల్లింపులు ఉంటాయి.

  • క్లాసిక్ పాల‌సీ మాదిరిగానే అడ్వాన్స్ ద‌శ‌లో క్యాన్స‌ర్ గుర్తించిన‌ట్ల‌యితే బీమా హామీ సొమ్ములో 150శాతం దాకా ప‌రిహారం చెల్లిస్తారు.

  • మైన‌ర్ లేదా మేజ‌ర్ క్యాన్స‌ర్ గుర్తించిన క్ష‌ణం నుంచి… పాల‌సీ గ‌డువు ముగిసే దాకా త‌దుప‌రి ప్రీమియంలు చెల్లించ‌న‌క్క‌ర్లేకుండా వెయివ్ ఆఫ్ చేస్తారు.

స‌మ్ అస్యూర్డ్ రీసెట్ బెనిఫిట్‌

  • ఎన్‌హాన్స్‌డ్ ర‌కంతో కూడిన పాల‌సీని కొనుగోలు చేస్తే మైన‌ర్ లేదా మేజ‌ర్ ద‌శ క్యాన్స‌ర్ గుర్తించాక‌… క్లెయిం చేసుకున్న మూడు సంవ‌త్స‌రాల వ‌ర‌కూ ఎటువంటి క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాల‌ను గుర్తించ‌క‌పోతే బీమా హామీ సొమ్మును య‌థాస్థితికి చేరుస్తారు.

ఉదాహ‌ర‌ణ‌కుః ఓ వ్య‌క్తి రూ.10ల‌క్ష‌ల పాల‌సీ కొనుగోలు చేశాడ‌నుకుందాం. మైన‌ర్‌, మేజ‌ర్ క్యాన్స‌ర్ ద‌శ‌ల‌ను దాటి క్లెయిం చేసుకొని మొత్తం రూ.5 లక్ష‌లు ప‌రిహారం తీసుకున్నారు. ఆ త‌ర్వాత మూడేళ్ల దాకా ఆ వ్య‌క్తిలో ఎలాంటి క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలను క‌నుగొన‌లేదు. అప్పుడు ఈ రీసెట్ బెనిఫిట్ రంగంలోకి వ‌స్తుంది. బీమా హామీ సొమ్ము య‌థాత‌థంగా రూ.10లక్ష‌ల బీమా హామీ సొమ్ము జ‌త‌చేరుతుంది.

దీనికున్న ష‌ర‌తులుః

  • మేజ‌ర్ లేదా మైన‌ర్ క్యాన్స‌ర్‌కు పూర్తి చికిత్సా విధానాలైన రేడియోథెర‌పీ, కీమోథెర‌పీ లాంటివి పొంది ఉండాలి.

  • ఇది వ‌ర‌కే వ‌చ్చిన క్యాన్స‌ర్ పున‌రావృత‌మైనా, మ‌రో ర‌కం క్యాన్స‌ర్ వ‌చ్చిన దానితో సంబంధం లేకుండా ఈ రీసెట్ బెనిఫిట్ ఆప్ష‌న్ వ‌ర్తిస్తుంది.

  • పాల‌సీ కాల‌వ్య‌వ‌ధిలోనే ఈ రీసెట్ బెనిఫిట్ ప్ర‌యోజ‌నం అందుకోవ‌చ్చు.

SBI-CANCER-DIFF@eenadusiri.png

పాల‌సీ కొనుగోలు

  • పాల‌సీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో పాల‌సీ కొనుగోలు చేసినవారికి 5శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నారు.

  • ఆఫ్ లైన్ విధానంలో నేరుగా సంస్థ నుంచి , ఏజెంట్ ద్వారా కొనుగోలు చెయ్యవచ్చు.

క్లెయిం విధానం

  • ఈ పాల‌సీ కొనుగోలు చేసిన‌వారు క్లెయిం చేయ‌ద‌ల్చుకుంటే త‌గిన డాక్యుమెంట్లు, వైద్యుడి ధ్రువీక‌ర‌ణ‌, చికిత్సా వివ‌రాల‌తో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ‌ను నేరుగా లేదా ఏజెంటు ద్వారా సంప్ర‌దించ‌వ‌చ్చు.

  • 1800 22 90 90 టోల్ ఫ్రీ నెంబ‌రులోనూ వారిని సంప్ర‌దించ‌వ‌చ్చు.

  • ఇ-మెయిల్ చేయ‌ద‌లుచుకుంటే info@sbilife.co.in చిరునామాలో ల‌భిస్తారు.

క్యాన్స‌ర్ … మారిన జీవ‌న ప్ర‌మాణాల దృష్ట్యా భార‌త‌దేశంలో వేగంగా విస్త‌రిస్తోంది. ఇది ఒక్క‌సారి వ‌స్తే ఆర్థికంగా బాగా న‌ష్ట‌పోతాం… భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకొని త‌క్కువ ప్రీమియంతో మంచి పాల‌సీ కొనుగోలు చేయాలంటే ఎస్‌బీఐ లైఫ్ అందిస్తోన్న ఈ ప్ర‌త్యేక సుర‌క్షా ప‌థ‌కాన్ని ప‌రిశీలించవ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని