Yes bank: యెస్‌ బ్యాంక్‌లో వాటా తగ్గించుకోనున్న SBI

SBI stake in Yes bank: ప్రైవేటు రంగ బ్యాంక్‌ యెస్‌ బ్యాంక్‌లో ఎస్‌బీఐ తన వాటాలను తగ్గించుకోనుంది. లాకిన్‌ గడువు ముగియనుండడంతో త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనుంది.

Published : 02 Mar 2023 16:17 IST

దిల్లీ: బ్యాంక్‌ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా యెస్‌ బ్యాంక్‌లో (Yes bank) మెజారిటీ వాటాలు పొందిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI).. త్వరలో తన వాటాను తగ్గించుకోనుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) విధించిన మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ మార్చి 6తో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం యెస్‌ బ్యాంక్‌ ఆర్థిక పరిస్థితి సైతం మెరుగైన నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ నిర్ణయానికి వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. యెస్‌ బ్యాంక్‌లో వాటాల తగ్గింపు అంశంపై త్వరలో ఎస్‌బీఐ బోర్డు సమావేశం కానుందని, ఎంత మేర వాటాలు తగ్గించుకోవాలనే అంశం ఈ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. సంబంధిత ప్రతిపాదనను ఆర్‌బీఐ ఆమోదానికి పంపనుంది.

తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయిన యెస్‌ బ్యాంక్‌ను పునరుద్ధరించేందుకు 2020 మార్చిలో ఆర్‌బీఐ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎస్‌బీఐ 49 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ సైతం కొంతమేర వాటాలను కొనుగోలు చేశాయి. 2022 డిసెంబర్‌ 31 నాటికి ఎస్‌బీఐకి 26.14 శాతం వాటా ఉంది. అయితే, మూడేళ్లు పూర్తయ్యే వరకు తమ వాటాను 26 శాతం కంటే దిగువకు తగ్గకూడదన్న నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో లాకిన్‌ గడువు ముగియనుండడంతో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకోనుంది. డిసెంబర్‌ నాటికి యెస్‌ బ్యాంక్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.61 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌, 1.57 శాతం, ఐడీఎఫ్‌స్‌ ఫస్ట్‌ బ్యాంక్‌ 1 శాతం కలిగి ఉన్నాయి. ఎల్‌ఐసీకి 4.34 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 3.48 శాతం వాటాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని