SBI Gold loan: ఎస్‌బీఐ ఆఫర్‌.. గోల్డ్‌ లోన్‌ ప్రాసెసింగ్‌ ఫీజులో 50% తగ్గింపు

అత్య‌వ‌స‌ర స్థితిలో డ‌బ్బు అవ‌స‌ర‌మైతే రుణం పొందేందుకు ఉన్న సుర‌క్షిత‌మైన, సుల‌భమైన‌ మార్గాల్లో గోల్డ్ లోన్ ఒక‌టి. 

Updated : 30 May 2022 11:14 IST


అత్య‌వ‌స‌ర స్థితిలో డ‌బ్బు అవ‌స‌ర‌మైతే రుణం పొందేందుకు ఉన్న సుర‌క్షిత‌మైన, సుల‌భమైన‌ మార్గాల్లో గోల్డ్ లోన్ ఒక‌టి. బంగారు ఆభ‌ర‌ణాలు, నాణేలపై కొద్దిపాటి పేప‌ర్ వ‌ర్క్‌తో, త‌క్కువ వ‌డ్డీ రేటుతో బంగారంపై రుణాలు ల‌భిస్తున్నాయి. 18 నుంచి 24 క్యారెట్ల బంగారాన్ని బ్యాంకు వ‌ద్ద ఉంచి మీ వ్యాపారం లేదా ఇత‌ర అవ‌స‌రాల కోసం రుణం తీసుకోవ‌చ్చు. బంగారం స్వ‌చ్ఛ‌త‌ను త‌న‌ఖీ చేసి రుణ మొత్తాన్ని బ్యాంకులు నిర్ణయిస్తాయి. వ‌డ్డీ రేటు బ్యాంకును బ‌ట్టి మారుతుంటుంది. 7 శాతం నుంచి 29 శాతం వ‌ర‌కు ఉండొచ్చు. ఎస్‌బీఐ కూడా బంగారంపై రుణాల‌ను ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా కాంపిటీటివ్ వ‌డ్డీ రేటుతో పాటు, 50 శాతం ప్రాసెసింగ్ ఫీజును మిన‌హాయింపుతో బంగారంపై రుణాల‌ను అందిస్తున్న‌ట్లు ఎస్‌బీఐ ప్ర‌క‌టించింది. 

ఈ మేర‌కు ఎస్‌బీఐ త‌న అధికారిక ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేసింది. వేగ‌వంతంగా రుణాల‌ను మంజూరు చేయ‌డంతో పాటు, సౌక‌ర్య‌వంత‌మైన రీపేమెంట్ ఆప్ష‌న్ కూడా అందుబాటులో ఉన్న‌ట్లు తెలిపింది. యోనో యాప్ ద్వారా సుల‌భంగా బంగారంపై రుణాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఎవ‌రు తీసుకోవ‌చ్చు? ఎంతిస్తారు?

18 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వ‌య‌సు ఉండి, క్రమానుగ‌త ఆదాయం ఉన్న వారు లోన్ తీసుకోవ‌చ్చు. అదే విధంగా పింఛనుదారులు కూడా బంగారంపై రుణాలు తీసుకోవ‌చ్చు. వీరు ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. క‌నీస రుణ మొత్తం రూ.20 వేలు కాగా.. గరిష్ఠంగా రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇస్తారు.

ప్రాసెసింగ్ ఫీజు, వ‌డ్డీ రేట్లు..

రుణగ్రహీతలు తమ బంగారు ఆభరణాల నాణ్యత, పరిమాణాల‌ను ధ్రువీకరించుకొన్న త‌ర్వాతే బ్యాంకు వ‌ద్ద ఉంచ‌వ‌చ్చు. ప్రాసెసింగ్ ఫీజు రుణ మొత్తంపై 0.25 శాతం లేదా క‌నీసం రూ.250తో పాటు జీఎస్‌టీ వ‌ర్తిస్తుంది. ప్ర‌తీ గోల్డ్ లోన్‌పై 25 శాతం, లిక్విడ్ గోల్డ్ లోన్‌పై 25 శాతం, బులెట్ రీపేమెంట్ గోల్డ్‌పై 35 శాతం మార్జిన్ ఉంటుంది. ఒక సంవ‌త్స‌రం ఎమ్‌సీఎల్ఆర్ రేటుపై 0.30 శాతం అద‌నంగా వ‌డ్డీ ఉంటుంది. ప్ర‌స్తుతం ఒక సంవ‌త్స‌రం ఎస్‌బీఐ మార్జిన‌ల్ కాస్ట్ ఫండ్స్ బేస్డ్‌ లెండింగ్ రేటు (ఎమ్‌సీఎల్ఆర్‌) 7.20 శాతంగా ఉంది. ఎస్‌బీఐ అందించే గోల్డ్ లోన్‌ను తిరిగి చెల్లించేందుకు 36 నెల‌ల స‌మ‌యం ఉంటుంది. కాల‌ప‌రిమితి కంటే ముందుగా కూడా రుణాల‌ను తిరిగి చెల్లించ‌వ‌చ్చు.

గోల్డ్ లోన్‌ విషయంలో ముఖ్యంగా ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాల్సింది వ‌డ్డీ రేట్లే అయినా మిగిలిన అంశాల‌నూ ప‌రిశీలించాలి. అందులో ప్రాసెసింగ్  ఫీజు, కాల‌ప‌రిమితి ముఖ్య‌మైన‌వి. కొన్ని బ్యాంకులు తిరిగి చెల్లింపుల‌కు ఏడాది మాత్ర‌మే స‌మ‌యం ఇస్తున్నాయి. అందువ‌ల్ల బ్యాంకులు అందించే వ‌డ్డీ రేటుతో పాటు, ప్రాసెసింగ్ ఫీజు, కాల‌ప‌రిమితి వంటివ‌న్నీ చెక్‌చేసుకున్న త‌ర్వాత మాత్ర‌మే రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని