SBI Q2 Results: అదరగొట్టిన ఎస్‌బీఐ.. నికర లాభం 74 శాతం వృద్ధి

బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది.

Published : 05 Nov 2022 15:30 IST

దిల్లీ: బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. గతేడాది రూ.7,626.57 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసిన ఎస్‌బీఐ.. ఈ ఏడాది 74 శాతం వృద్ధితో ఏకంగా రూ.13,264.62 లాభాన్ని సాధించింది. మొండి బకాయిలు తగ్గడం, వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం పెరగడం భారీ లాభాల నమోదుకు దోహదపడింది.

కంపెనీ ఆదాయం సైతం 14 శాతం మేర వృద్ధి చెందింది. గతేడాది రూ.77,689.09 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ ఏడాది రూ.88,733.86 కోట్లకు పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో వడ్డీ ఆదాయం సైతం 12.83 శాతం వృద్ధితో రూ. 35,183 కోట్లకు పెరిగినట్లు ఎస్‌బీఐ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

  • సెప్టెంబర్‌ 30 నాటికి ఎస్‌బీఐ డిపాజిట్లు రూ.41,90,255 కోట్లకు చేరాయి. గతేడాదితో పోలిస్తే 10 శాతం మేర పెరిగాయి. గతేడాది ఇదే  సమయంలో బ్యాంకు వద్ద ఉన్న డిపాజిట్లు రూ.38,09,630 కోట్లు.
  • నికర నిరర్ధక ఆస్తులు (NPA) సైతం 1.52 శాతం నుంచి 0.80 శాతానికి తగ్గినట్లు ఎస్‌బీఐ తెలిపింది. విలువ పరంగా రూ.26,99 కోట్ల నుంచి రూ.2011 కోట్లకు తగ్గినట్లు బ్యాంక్‌ తెలిపింది. 
  • ఎస్‌బీఐ గ్రూప్‌ పరంగా చూస్తే ఏకీకృత నికర లాభం 66 శాతం పెరిగి రూ.14,752 కోట్లకు పెరిగింది. గతేడాది ఈ మొత్తం రూ.8,890 కోట్లుగా ఉంది.
  • ఎస్‌బీఐ గ్రూప్‌ మొత్తం ఆదాయం సైతం రూ.1,01,143.26 కోట్ల నుంచి రూ.1,14,782 కోట్లకు పెరిగింది.
  • త్రైమాసిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌బీఐ షేరు విలువ కొత్త గరిష్ఠాలను నమోదు చేసి రూ. 596.95 వద్ద ముగిసింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని