SBI Q3 Results: అదరగొట్టిన ఎస్‌బీఐ.. లాభం 62 శాతం వృద్ధి

ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (State Bank of India) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాలను (Q3 Results) ప్రకటించింది. 68 శాతం వృద్ధిని నమోదుచేసుకున్నట్లు బ్యాంక్‌ తన ఫైలింగ్‌లో తెలిపింది.

Published : 03 Feb 2023 19:19 IST

దిల్లీ: ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (State Bank of India) మూడో త్రైమాసిక ఫలితాలను (Q3 Results) శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రెండంకెల వృద్ధితో అదరకొట్టింది. 62 శాతం వృద్ధితో రూ.15,477  కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు పేర్కొంది.

2022 ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో స్టాండలోన్‌ ప్రాతిపదికన పన్ను అనంతరం రూ.14,205 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.  అంతకుముందు (జులై-సెప్టెంబర్‌) త్రైమాసికంలో రూ.13,265 కోట్ల లాభాన్ని నమోదుచేసింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆదాయం రూ.98,084 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్‌ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.78,351 కోట్లుగా ఉంది.

ఖర్చుల విషయానికొస్తే రూ.20,839 నుంచి రూ.24,317 కోట్లకు పెరిగినట్లు ఎస్‌బీఐ తన ఫైలింగ్‌లో తెలిపింది. గత త్రైమాసికంలో 3.52 శాతంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తులు (NPA) విలువ 3.14 శాతానికి తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి 4.50 శాతంగా ఉన్నినాయి. ఫలితాల వెల్లడి నేపథ్యంలో శుక్రవారం మార్కెట్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈలో ఎస్‌బీఐ షేరు ధర 3.12 శాతం పెరిగి రూ.544.45 వద్ద ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని