Budget 2023: ‘కిసాన్‌’ వడ్డీ చెల్లిస్తే సరిపోతుందా..? బడ్జెట్‌పై ఎస్‌బీఐ రీసెర్చ్‌ అంచనాలు!

Budget 2023: రాబోయే బడ్జెట్‌పై వివిధ సంస్థలు తమ అంచనాలను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎస్‌బీఐ రీసెర్చ్‌ తమ నివేదికను విడుదల చేసింది.

Updated : 25 Jan 2023 13:08 IST

దిల్లీ: ఓవైపు ఆర్థిక మాంద్యం భయాలు, మరోవైపు అస్థిర ఆర్థిక పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్‌ (Budget 2023) ప్రవేశపెట్టనుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు..  ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్‌ 2.0కు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ (Budget 2023) కావడం కూడా అంచనాలను పెంచుతోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ (Budget 2023)పై అనేక సంస్థలు తమ అభిప్రాయాలు, అంచనాలను వెల్లడిస్తున్నాయి. తాజాగా ఎస్‌బీఐ రీసెర్చ్‌ రిపోర్ట్‌ సైతం పలు రంగాలపై తమ అంచనాలను బయటపెట్టింది.

చిన్న మొత్తాల పొదుపులకు బూస్ట్‌..

‘సుకన్య సమృద్ధి యోజన (SSY)’ వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలకు రాబోయే బడ్జెట్‌ (Budget 2023)లో ప్రాధాన్యం ఉండొచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్‌ తన నివేదికలో పేర్కొంది. ద్రవ్యలోటు వచ్చే ఆర్థిక సంవత్సరం 6 శాతం వరకు చేరొచ్చని అంచనా వేసింది. దీన్ని భర్తీ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపైనే ప్రధానంగా ఆధారపడే అవకాశం ఉందని తెలిపింది. కొత్త రిజిస్ట్రేషన్లను పెంచడం కోసం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రకటించొచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం తపాలాశాఖలతో పోలిస్తే బ్యాంకుల్లో చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో కూడా ఖాతాల సంఖ్యను పెంచడం కోసం ప్రత్యేకంగా బిజినెస్‌ కరెస్పాండెంట్‌లను నియమించుకునే అవకాశం కల్పించొచ్చని తెలిపింది.

సీనియర్లకు ఊతం..

ధరలు పెరిగి కుటుంబ ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో తాజా బడ్జెట్‌ (Budget 2023)పై సీనియర్‌ సిటిజన్స్‌ సైతం అనేక ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ వర్గం చేసే డిపాజిట్లపై వచ్చే వడ్డీ మినహాయింపు పరిమితి పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించొచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్‌ తెలిపింది. ప్రస్తుతం సెక్షన్‌ 80టీటీబీ కింద సేవింగ్స్‌, ఫిక్స్‌డ్‌, రికరింగ్‌ ఖాతాల్లో చేసే డిపాజిట్లపై వచ్చే వడ్డీకి రూ.50,000 వరకు పన్ను మినహాయింపు ఉంది. ఈ పరిమితిని రూ.75,000 నుంచి రూ. 1 లక్ష వరకు పెంచాల్సిన అవసరం ఉందని సీనియర్‌ సిటిజన్స్‌ నుంచి వినిపిస్తున్న ప్రధాన డిమాండ్‌.

కిసాన్‌ వడ్డీ చెల్లిస్తే చాలు..

రాబోయే బడ్జెట్‌ (Budget 2023)లో పలు వ్యవసాయ పథకాలకు కూడా ప్రోత్సాహకాలు ఉండొచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్‌ అంచనా వేసింది. చిన్న, సన్నకారు రైతులు కిసాన్‌ క్రెడిట్‌ కార్డును మరింత సమర్థంగా ఉపయోగించుకునేలా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం కిసాన్‌ క్రెడిట్‌ కార్డు రుణాలను పునర్‌వ్యవస్థీకరించేందుకు అసలుతో పాటు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కేవలం వడ్డీ చెల్లించినా రుణాన్ని రెన్యూవల్‌ చేసేలా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ అభిప్రాయపడింది. ప్రస్తుతం వ్యవసాయ, అనుబంధ రంగాల రుణ బకాయిల్లో 60% కేసీసీ ఆధారితమైనవే.

అప్పు రూ.16 లక్షల కోట్లు..

మరోవైపు 2023- 24లో ప్రభుత్వ నికర అప్పులు రూ.11.7 లక్షల కోట్లకు చేరొచ్చని నివేదిక అంచనా వేసింది. మరో రూ. 4.4 లక్షల కోట్లు ఇప్పటికే తీసుకున్న అప్పులకు చెల్లింపులు చేయాల్సి ఉందని తెలిపింది. దీన్ని కూడా కలిపితే మొత్తం అప్పులు రూ. 16.1 లక్షల కోట్ల వరకు చేరొచ్చని లెక్కగట్టింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని