SBI vs Post Office: రికరింగ్ డిపాజిట్లు..తాజా వడ్డీ రేట్లు

ఆర్‌డీ ఖాతాలో నెలవారీగా చెల్లించాల్సిన వాయిదా మొత్తం ఒక్కసారి నిర్ణయించిన తరువాత మార్చుకునే వీలుండ‌దు.

Published : 05 Jul 2022 16:19 IST

 
నెల‌వారిగా నిర్దిష్ట మొత్తాన్ని పొదుపు చేసే వారికి రిక‌రింగ్‌ డిపాజిట్లు మంచి ఎంపిక‌. ఈ ఖాతాలో ముందుగా నిర్ణయించిన మొత్తాన్ని, ముందుగా నిర్ణయించిన వ్యవధుల్లో జమ చేయాల్సి ఉంటుంది. నెలవారీగా చెల్లించాల్సిన వాయిదా మొత్తం ఒక్కసారి నిర్ణయించిన తరువాత మార్చుకునే వీలుండ‌దు. ఆర్‌డీ ఖాతాను బ్యాంకులలో గానీ పోస్టాఫీసులో గానీ తెరవొచ్చు. స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాతో పాటు ఇతర బ్యాంకుల్లోనూ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. 

ఎస్‌బీఐ vs పోస్టాఫీస్‌..
*
ఎస్‌బీఐ వేరు వేరు కాల‌ప‌రిమితులు గ‌ల రికరింగ్ డిపాజిట్ల‌ను అందుబాటులో ఉంచింది. ఈ డిపాజిట్ల‌పై సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు 5.30 శాతం నుంచి 5.50 శాతం వ‌ర‌కు కాల‌ప‌రిమితి ఆధారంగా వ‌డ్డీ రేటు ఆఫ‌ర్ చేస్తుంది. సీనియర్ సిటిజన్లకు మరో 50 (0.50 శాతం) బేసిస్ పాయింట్లు అధిక వడ్డీ ల‌భిస్తుంది. ఈ వడ్డీ రేట్లు జూన్ 14, 2022 నుంచి అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీసు తమ ఆర్‌డీ ఖాతాదారులకు 5.80 శాతం వార్షిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది.
* ఒక సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు వేర్వేరు కాలపరిమితి గల రికరింగ్ డిపాజిట్లను ఎస్‌బీఐ అందుబాటులో ఉంచింది. పోస్టాఫీస్ 5 సంవత్సరాల కాలపరిమితితో మాత్రమే ఆర్‌డీ అందిస్తుంది. 
* ఎస్‌బీఐ ఆర్‌డీ ఖాతాను చెక్కు/నగదు ద్వారా తెరవొచ్చు. పోస్టాఫీస్ ఆర్‌డీ ఖాతాను నగదు ద్వారా మాత్రమే తెరిచే వీలుంది.
* ఆన్‌లైన్‌లో నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎస్‌బీఐ ఆర్‌డీ ఖాతాను తెరవొచ్చు. పోస్టాఫీసు ఆర్‌డీ ఖాతాను తెరిచేందుకు పోస్టాఫీసు బ్రాంచ్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. 
* ఎస్‌బీఐ ఆర్‌డీ ఖాతాలో కనీసం రూ.100తో ప్రారంభించి (రూ.110, రూ.120...చొప్పున 10 గుణిజాలలో) ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. పోస్టాఫీస్ ఆర్‌డీ ఖాతాను కనీసం రూ.10తో ప్రారంభించవచ్చు. 5 గుణిజాల్లో (రూ.15, రూ.20, రూ.25..చొప్పున) ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. ఇందులో కూడా గరిష్ఠ పరిమితంటూ ఏదీ లేదు.
* ఐదు సంవత్సరాల పోస్టాఫీస్ ఆర్‌డీ ఖాతా వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎస్‌బీఐ వడ్డీ రేటు టెన్యూర్ ప్రాతిపదికన మారుతుంది. 
* ఆర్‌డీ ఖాతా నెల‌వారి వాయిదాలు స‌మ‌యానికి డిపాజిట్ చేయ‌క‌పోతే 5 సంవ‌త్సార‌ల లోపు ఆర్‌డీ ఖాతాపై రూ. 1.50 చొప్పున‌, 5 సంవ‌త్స‌రాల కంటే ఎక్కువ కాల‌పరిమితి గ‌ల ఖాతాపై రూ. 2.00 చొప్పున ప్ర‌తీ రూ. 100పై ఎస్‌బీఐ పెనాల్టీ విధిస్తుంది. అదే విధంగా పోస్టాఫీసు కూడా ఆల‌స్య‌పు వాయిదాల‌కు ప్ర‌తీ రూ. 100 డిపాజిట్‌పై రూ. 1.00 పెనాల్టీ విధిస్తుంది.

ఎస్‌బీఐ ఆర్‌డీ ఖాతా వడ్డీ రేట్లు..
* ఏడాది నుంచి రెండేళ్లలోపు డిపాజిట్లకు - 5.30 శాతం
* రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు డిపాజిట్లకు - 5.35 శాతం
* మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు డిపాజిట్లకు - 5.45 శాతం
* ఐదేళ్ల నుంచి పదేళ్లలోపు డిపాజిట్లకు - 5.50 శాతం

పోస్టాఫీస్..
పోస్టాఫీస్ ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ ఖాతాకు 5.80 శాతం వార్షిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. వడ్డీని త్రైమాసికంగా కాంపౌండ్ చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని