SBI Q4 Results: ఎస్‌బీఐ క్యూ4 లాభంలో 83 శాతం వృద్ధి

SBI Q4 Results: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో 83 శాతం నికర లాభాన్ని నమోదు చేసింది.

Published : 18 May 2023 17:03 IST

దిల్లీ: ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక ఫలితాలను (Q4 results) ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.16,694.51 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ మొత్తం 83 శాతం పెరిగింది. 2021-22 జనవరి-మార్చి త్రైమాసికంలో ఎస్‌బీఐ రూ.9,113.53 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. వడ్డీ ఆదాయం పెరగడం, మొండి బాకీలు తగ్గడంతో ఎస్‌బీఐ భారీ లాభాలు నమోదు చేసింది.

మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్‌కు వడ్డీ రూపంలో రూ.92,951 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 31 శాతం అధికం. మొండి బకాయిలు ఇతరత్రాలకు కేటాయింపులు 2021-22 జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.7,237.45 కోట్లు ఉండగా.. ఆ మొత్తం ఈ సారి రూ.3,315.71 కోట్లకు తగ్గింది. ఇక మొత్తం ఏడాదికి గానూ నికర లాభం 59 శాతం వృద్ధితో రూ.50,232.45 కోట్లు నమోదు చేసింది. అలాగే డివిడెండ్‌ను కూడా ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ ఒక్కో ఈక్విటీ షేరుపై రూ. 11.30 చొప్పున డివిడెండ్‌ చెల్లించేందుకు నిర్ణయించింది. జూన్‌ 14న చెల్లింపులు చేయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని