Ola Electric: ఓలా ఎలక్ట్రిక్‌ పబ్లిక్‌ ఇష్యూకు సెబీ అనుమతి

విద్యుత్‌ ద్విచక్ర వాహన కంపెనీ ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ప్రతిపాదనకుకు మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ నుంచి అనుమతి లభించింది.

Published : 21 Jun 2024 03:13 IST

ఎమ్‌క్యూర్‌ ఫార్మా ఐపీఓకూ ఆమోదం

దిల్లీ: విద్యుత్‌ ద్విచక్ర వాహన కంపెనీ ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ప్రతిపాదనకుకు మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ నుంచి అనుమతి లభించింది. ఈ ఇష్యూ ద్వారా సేకరించే నిధుల్లో అధికమొత్తాన్ని బ్యాటరీసెల్‌ తయారీ ప్లాంట్‌ సామర్థ్య విస్తరణ, పరిశోధన-అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కార్యకలాపాలకు వెచ్చించనున్నట్లు సమాచారం.  బెయిన్‌ క్యాపిటల్‌ ఆధీనంలోని ఎమ్‌క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఐపీఓకూ సెబీ అనుమతి లభించింది. ఈ రెండు కంపెనీలు 2023 డిసెంబరులో ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించగా, తాజాగా అనుమతులు లభించాయి.

  • సెబీకి సమర్పించిన ముసాయిదా పత్రాల ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్‌ 9.52 కోట్ల ఈక్విటీ షేర్లను (ప్రమోటర్లు, పెట్టుబడిదార్ల వాటాలో కొంత భాగం) ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌)లో, రూ.5,500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను ఈ ఐపీఓలో విక్రయించబోతోంది. ఇందులో రూ.1,226.43 కోట్లను సెల్‌ తయారీ ప్లాంట్‌ సామర్థ్యాన్ని ప్రస్తుత 5 గిగావాట్‌ అవర్స్‌ (జీడబ్ల్యూహెచ్‌) నుంచి 6.4 జీడబ్ల్యూహెచ్‌కు విస్తరించేందుకు వినియోగించనుంది. రూ.1,600 కోట్లను ఆర్‌అండ్‌డీ కార్యకలాపాలపై వెచ్చించనుంది. రూ.800 కోట్లను అప్పులు చెల్లించేందుకు వాడనుంది.
  • ఎమ్‌క్యూర్‌ ఫార్మా ప్రతిపాదిత ఐపీఓలో రూ.800 కోట్ల విలువైన తాజా షేర్లను విక్రయించబోతోంది. మరో 1.36 కోట్ల ఈక్విటీ షేర్లను (ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదార్ల వాటాలో కొంత భాగం) ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌)లో విక్రయించనుంది. ప్రమోటర్‌ సతీశ్‌ మెహతా, పెట్టుబడిదారు బీసీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ 4 లిమిటెడ్‌ (ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం బెయిన్‌ క్యాపిటల్‌ అనుబంధ సంస్థ) ఓఎఫ్‌ఎస్‌లో షేర్లను విక్రయించబోతున్నారు. ప్రస్తుతం కంపెనీలో సతీశ్‌ మెహతాకు 41.92%, బీసీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు 13.09% వాటాలున్నాయి. తాజా షేర్ల జారీ ద్వారా సేకరించే నిధులను అప్పులు తీర్చడంతో పాటు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కంపెనీ వినియోగించనుంది.
  • అలైడ్‌ బ్లెండర్స్‌ అండ్‌ డిస్టిలర్స్‌ ఐపీఓ ఈ నెల 25న ప్రారంభమై 27న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.267- 281 నిర్ణయించారు. ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1500 కోట్లు సమీకరించనుంది. యాంకర్‌ మదుపర్లు 24న బిడ్లు దాఖలు చేసుకోవచ్చు. రిటైల్‌ మదుపర్లు కనీసం 53 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. 

జేఎం ఫైనాన్షియల్‌పై సెబీ కొరడా

దిల్లీ: 2025 మార్చి 31 వరకు డెట్‌ సెక్యూరిటీల పబ్లిక్‌ ఇష్యూలకు లీడ్‌ మేనేజర్‌గా వ్యవహరించకుండా జేఎం ఫైనాన్షియల్‌పై ఇచ్చిన తాత్కాలిక ఆదేశాలను ధ్రువీకరిస్తున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రకటించింది. నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల (ఎన్‌సీడీలు) పబ్లిక్‌ ఇష్యూలో అవకతవకల ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకుంది. జేఎం ఫైనాన్షియల్‌ డెట్‌ సెక్యూరిటీల పబ్లిక్‌ ఇష్యూలకు మాత్రమే ఈ నిషేధం వర్తిస్తుంది. ఈక్విటీ ఇష్యూలతో పాటు ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదు. ఈ ఏడాది మార్చి 7న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జేఎం ఫైనాన్షియల్‌పై సెబీ కొరడా ఝుళిపించింది. అనంతరం ఏప్రిల్‌ 24, జూన్‌ 18న జరిగిన విచారణల్లో, నిషేధం తొలగించాల్సిందిగా జేఎం ఫైనాన్షియల్‌ కోరినప్పటికీ.. సెబీ నిర్ణయం మారలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని