వొడాఫోన్‌ ఐడియాకు ఊరట.. బకాయిలను ఈక్విటీగా మార్చేందుకు సెబీ ఆమోదం..!

ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన టెలికాం సంస్థలకు ఆదుకునేందుకు కేంద్రం గతేడాది కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ చెల్లించాల్సిన బకాయిలను ఈక్విటీగా మార్చాలని ప్రతిపాదించింది. దానికి సెబీ తాజాగా ఆమోదముద్ర వేసినట్లు సమాచారం.

Published : 20 Oct 2022 23:45 IST

దిల్లీ: తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న వొడాఫోన్‌ ఐడియాకు ఊరట లభించింది. ఈ సంస్థ బకాయిలను ఈక్విటీగా మార్చేందుకు చేసిన ప్రతిపాదనను మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ వ్యవహారంతో సంబంధమున్న ఇద్దరు సీనియర్‌ అధికారులు వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

రుణ ఇబ్బందుల్లో కూరుకుపోయిన టెలికాం కంపెనీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. స్పెక్ట్రమ్‌ వాయిదాలతో పాటు సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) బకాయిలపై వడ్డీ చెల్లించడానికి బదులుగా ఆ మొత్తాన్ని సంస్థలో ఈక్విటీ వాటాగా మార్చాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు వొడాఫోన్‌ ఇండియా అంగీకరించింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం రూ.16వేల కోట్ల వడ్డీని సుమారు 33 శాతం వాటాగా మార్చేందుకు బోర్డు నిర్ణయించింది.

ఈ ప్రతిపాదనను సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్ ఇండియా (సెబీ)కి పంపగా సెబీ ఆమోదించినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు మీడియాకు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని సెబీ త్వరలోనే టెలికాం శాఖకు తెలపనున్నట్లు సమాచారం. అయితే దీనిపై అటు సెబీ నుంచి గానీ.. ఇటు సంస్థ/ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా.. బకాయిలను ఈక్విటీగా మార్చిన తర్వాత ప్రభుత్వం ఆ వాటాలను విక్రయించాలని భావిస్తున్నట్లు సదరు వర్గాల సమాచారం. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని