Sebi Panel: ‘ఫ్యూచర్స్‌’ నియంత్రణకు ‘ఆప్షన్స్‌’ ఇవే!

అధిక నష్టాలకు కారణమవుతున్న ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌ఓ) విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని నియంత్రించే చర్యలకు వేగంగా అడుగులు పడుతున్నాయి.

Updated : 10 Jul 2024 15:15 IST

కనీస లాట్‌ పరిమాణం రూ.20- 30 లక్షలకు పెంచాలి
వారంలో గడువు తీరే కాంట్రాక్టుల కుదింపు
నిపుణుల కమిటీ సిఫారసు
చిన్న మదుపర్ల ప్రాతినిథ్యం తగ్గించేందుకే

అధిక నష్టాలకు కారణమవుతున్న ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌ఓ) విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని నియంత్రించే చర్యలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. భారీ నష్టాలకూ అవకాశం ఉంటుందనే అవగాహన లేకుండా.. తక్కువ పెట్టుబడితో, పరిమిత సమయంలో లాభాలు పొందొచ్చనే ఆలోచనతో ఎఫ్‌అండ్‌ఓ విభాగంలో ట్రేడ్‌ చేస్తున్న రిటైల్‌ మదుపర్ల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. అప్పులు చేసి మరీ ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడుతున్న వారున్నారు. సెబీ గణాంకాల ప్రకారం.. ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌ చేసే ప్రతి 10 మంది చిన్న మదుపర్లలో 9 మంది నష్టాల్నే చవిచూస్తున్నారు. ఈ పరిణామాలపై సెబీ, ఆర్‌బీఐ, ఆర్థిక శాఖ పలు సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఎఫ్‌అండ్‌ఓ విభాగంలో స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌ జోరును నియంత్రించేందుకు సెబీ గత నెలలో నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ పలు సిఫారసులు చేసినట్లు ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ పేర్కొంది. అవేమిటంటే... 

  •  డెరివేటివ్‌ కాంట్రాక్టులకు కనీస లాట్‌ పరిణామాన్ని రూ.20- 30లక్షలకు పెంచాలి. ప్రస్తుతం ఇది రూ.5 లక్షల నుంచి ఉంది. 

ఉదాహరణకు.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టు లాట్‌ పరిమాణం 250 షేర్లు. ప్రస్తుతం ఈ కంపెనీ జులై కాంట్రాక్టు రూ.3,190.25 వద్ద ట్రేడవుతోంది. అంటే రిలయన్స్‌ జులై ఫ్యూచర్స్‌ కాంట్రాక్టు లాట్‌ పరిమాణం విలువ రూ.8,00,000 వరకు అవుతుంది. ఇందుకు రూ. 1.42 లక్షలు పెట్టుబడి సరిపోతుంది.

ఇప్పుడు లాట్‌ పరిమాణాన్ని రూ.20 - 30 లక్షలకు పెంచాలనుకుంటే.. తదనుగుణంగా ఈ లాట్‌లో షేర్ల సంఖ్యను ప్రస్తుత 250 నుంచి 650 వరకు పెంచాలి. తక్కువ పెట్టుబడితో ట్రేడ్‌ చేసే చిన్న మదుపర్లు ఈ స్థాయిలో ఒక లాట్‌ను కొనడం భారంతో కూడుకున్నదే. తద్వారా వీరిని ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ నుంచి దూరం చేయొచ్చన్నది నిపుణుల కమిటీ అభిప్రాయం కావచ్చు. అయితే మార్జిన్‌ కింద తక్కువ మొత్తంతోనే ఫ్యూచర్స్‌ కాంట్రాక్టులను ట్రేడ్‌ చేసేందుకు బ్రోకరేజీలు వీలు కల్పిస్తుంటాయి. ఒకవేళ లాట్‌ పరిమాణాన్ని పెంచితే.. ఆ మేరకు మార్జిన్‌ మొత్తాన్ని కూడా బ్రోకరేజీలు పెంచే అవకాశం ఉంటుంది. 

 రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ధర రూ.3180గా ఉంది. సాధారణ పద్ధతిలో 250 షేర్లు కొనాలంటే రూ.79500 అవుతుంది. 

  •  వారంలో గడువు తీరే కాంట్రాక్టుల సంఖ్యను కుదించాలి. ఒక ఎక్స్ఛేంజీకి వారంలో ఒకటే వారం కాంట్రాక్టు ఎక్స్‌పైరీకి అనుమతినివ్వాలి. 

ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 50 సూచీ వారం కాంట్రాక్టు గురువారం ముగుస్తుండగా.. బ్యాంక్‌ నిఫ్టీ బుధవారం, ఫైనాన్షియల్‌ నిఫ్టీ మంగళవారం, మిడ్‌క్యాప్‌ నిఫ్టీకి సోమవారం ఎక్స్‌పైరీగా ఉంటోంది. బీఎస్‌ఈలో సెన్సెక్స్‌ వారం కాంట్రాక్టుల గడువు రోజు శుక్రవారం కాగా.. బ్యాంకెక్స్‌ సూచీకి సోమవారంగా ఉంది. అంటే ఈ కాంట్రాక్టులు తీసుకున్న వారు, ఆరోజుకు తమ లాభనష్టాలను భరించాల్సి ఉంటుంది.

నిపుణుల కమిటీ సిఫారసు అమల్లోకి వస్తే ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలు పరిమిత సంఖ్యలోనే వారం కాంట్రాక్టులను ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వివిధ రకాల సూచీల్లో వారం కాంట్రాక్టులు అందుబాటులో ఉండటంతో, ఎక్కువమంది ట్రేడ్‌ చేయడానికి కారణమవుతోంది.  వారంలో గడువు తీరే చాలా కాంట్రాక్టుల వల్ల ఎటువంటి ఆర్థిక ప్రయోజనం లేదని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. డెరివేటివ్‌ ఉత్పత్తులను సాధారణంగా హెడ్జింగ్‌ కోసం వాడాల్సి ఉండగా.. కేవలం స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌ కోసం అత్యధికులు ఉపయోగిస్తున్నారు. 

  •  ఆప్షన్‌ కాంట్రాక్టులకు స్ట్రైక్‌ ధరల సంఖ్యను పరిమితం చేయాలి. 

అసాధారణ స్థాయిలో పెరిగిపోతున్న డెరివేటివ్‌ కాంట్రాక్టుల లావాదేవీల పరిమాణాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం దోహదం చేయొచ్చు. 

  •  ఇవే కాకుండా ఆప్షన్ల కాంట్రాక్టుల కోసం ట్రేడర్ల నుంచి ముందస్తు మార్జిన్‌ వసూలు చేయడం, ఇంట్రాడేలో పొజిషన్ల పరిమితిపై పర్యవేక్షణ, ఎక్స్‌పైరీ గడువు సమీపించినప్పుడు మార్జిన్‌ పరిమితి పెంచడం లాంటి సిఫారసులను కూడా నిపుణుల కమిటీ చేసినట్లు తెలుస్తోంది.  

తుది నిర్ణయం అప్పుడే.. 

నిపుణుల కమిటీ సిఫారసులను సెకండరీ మార్కెట్‌ అడ్వయిజరీ కమిటీ పరిశీలించాక తుది నిర్ణయం తీసుకుంటారు. డెరివేటివ్‌ ఉత్పత్తులపై నిపుణుల కమిటీ సూచనలను పరిశీలించి, అమలు చేసేందుకు సెబీ సిద్ధంగా ఉందని సెబీ ఛైర్‌పర్సన్‌ మాధవి పురి బచ్‌ ఇటీవల వెల్లడించడం గమనార్హం. 

సెబీ గణాంకాల ప్రకారం.. 

  •  డెరివేటివ్‌ ట్రేడింగ్‌ లావాదేవీల టర్నోవరు 2017-18లో రూ.210 లక్షల కోట్లు కాగా.. 2023-24లో రూ.500 లక్షల కోట్లకు చేరింది. 
  •  ఎఫ్‌అండ్‌ఓలో ట్రేడ్‌ చేస్తున్న చిన్న మదుపర్ల సంఖ్య 2022-23లో 65 లక్షలు కాగా.. 2023-24లో 40% పెరిగి 96 లక్షలకు చేరింది. 
  •  సూచీల (ఇండెక్స్‌) ఆప్షన్‌ కాంట్రాక్టులను ట్రేడ్‌ చేసే వ్యక్తిగత ట్రేడర్ల సంఖ్య 2017-18లో 2 శాతమే కాగా.. 2023-24లో 41 శాతానికి పెరిగింది. 

రీట్, ఇన్విట్‌ నిబంధనల్లో సవరణలు

స్థిరాస్తి పెట్టుబడుల ట్రస్టు (రీట్‌), మౌలిక పెట్టుబడుల ట్రస్టుల (ఇన్విట్‌) నిబంధనల్లో ప్రతిపాదించిన సవరణలపై ప్రజాభిప్రాయాలు ఆహ్వానిస్తున్నట్లు సెబీ తెలిపింది. రీట్, ఇన్విట్‌ బోర్డులో డైరెక్టర్‌ను నామినేట్‌ చేసేందుకు యూనిట్‌ హోల్డర్లకు ఉన్న హక్కులపై ప్రతిపాదిత సవరణల్లో సెబీ స్పష్టత ఇచ్చింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఇన్విట్‌ లేదా రీట్‌లో గణనీయ వాటా ఉన్న ఒక యూనిట్‌హోల్డర్‌కు ఒక డైరెక్టరును నామినేట్‌ చేసే హక్కు ఉంటుంది. అయితే వాళ్ల వాటా పరిమితి నిర్దేశిత పరిమితికి మించాల్సి ఉంటుంది. సెబీ నిబంధనలకు అనుగుణంగా డైరెక్టరును నామినేట్‌ చేసే అధికారం ఉన్నట్లయితే.. డైరెక్టరును నామినేట్‌ చేసే విషయంలో యూనిట్‌హోల్డర్‌పై ఆంక్షలు వర్తించవని తాజా ప్రతిపాదనల్లో సెబీ పేర్కొంది. వీటిపై ఈనెల 29లోపు అభిప్రాయాలు తెలపొచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని