OYO IPO: ఓయో ఐపీఓ పత్రాలను తిప్పి పంపిన సెబీ

ఐపీఓ పత్రాల్లో తగిన మార్పులు చేర్పులు చేసి తిరిగి సమర్పించాలని ఓయోను సెబీ ఆదేశించింది.

Published : 03 Jan 2023 18:03 IST

దిల్లీ: ఓయో పేరిట ఆతిథ్య సేవలను అందిస్తోన్న ఒరావెల్‌ స్టేస్‌ లిమిటెడ్‌ సమర్పించిన ఐపీఓ (OYO IPO) ముసాయిదా పత్రాలను మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీ తిప్పి పంపింది. తగిన మార్పులు చేసి తిరిగి పంపాలని ఆదేశించింది. దీంతో ఓయో ఐపీఓ (OYO IPO) ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

గురుగ్రామ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ యూనికార్న్‌ కంపెనీ తొలిసారి సెప్టెంబరు 2021లో ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది. రూ.8,430 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నట్లు అప్పటి ముసాయిదా పత్రాల్లో పేర్కొంది. రూ.7,000 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు, రూ.1,430 కోట్ల విలువైన ‘ఆఫర్‌-ఫర్‌- సేల్‌’ షేర్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సెబీ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. తాజాగా డిసెంబరు 30న మార్కెట్‌ నియంత్రణా సంస్థ వీటిని తిప్పి పంపింది. తగిన మార్పులు చేర్పులు చేయాలని సూచించింది. అయితే, అవి ఏంటనే విషయాన్ని మాత్రం సెబీ స్పష్టంగా పేర్కొనలేదు.

అంతకుముందు ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలతో కూడిన పత్రాలను సెబీకి ఓయో సమర్పించింది. తొలి అర్ధభాగంలో రూ.63 కోట్ల లాభం వచ్చినట్లు తెలిపింది. క్రితం ఏడాది ఇదే సమయంలో రూ.280 కోట్ల నష్టాన్ని నివేదించింది. ఏప్రిల్‌- సెప్టెంబరు మధ్య ఆదాయం 24 శాతం పెరిగి రూ.2,905 కోట్లుగా నమోదైంది. ఐపీఓ దరఖాస్తును సమీక్షించే నాటికి తాజా పత్రాలు సమర్పించాలని ఓయోకు సెబీ గడువిచ్చింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు