IPO: రెడీగా 28 ఐపీఓలు.. రూ.45 వేల కోట్ల సమీకరణ

స్టాక్‌ మార్కెట్ల నియంత్రణా సంస్థ సెబీ ఏప్రిల్-జులై మధ్య 28 కంపెనీల పబ్లిక్‌ ఇష్యూకు అనుమతులిచ్చింది...

Published : 07 Aug 2022 20:17 IST

దిల్లీ: స్టాక్‌ మార్కెట్ల నియంత్రణా సంస్థ సెబీ ఏప్రిల్-జులై మధ్య 28 కంపెనీల పబ్లిక్‌ ఇష్యూకు అనుమతులిచ్చింది. ఈ ఐపీఓల ద్వారా దాదాపు రూ.45,000 కోట్ల సమీకరణ జరగనుంది. 2022-23లో ఇప్పటికే 11 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకి వచ్చాయి. రూ.33,000 కోట్లు సమీకరించాయి. దీంట్లో ఎల్‌ఐసీ సమీకరించిన రూ.20,557 కోట్లే సింహభాగం.

సెబీ అనుమతి పొందిన వాటిలో లైఫ్‌స్టైల్‌ రిటైల్‌ బ్రాండ్‌ ఫ్యాబ్‌ఇండియా; భారత్ ఎఫ్‌ఐహెచ్‌; టీవీఎస్‌ సప్లయ్‌ చైన్‌ సొల్యూషన్స్‌; ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌; మెక్లాడ్స్‌ ఫార్మాస్యూటికల్స్‌ అండ్‌ కిడ్స్‌ క్లినిక్‌ ఇండియా వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ ఇంకా తమ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ తేదీలను ప్రకటించాల్సి ఉంది. స్టాక్‌ మార్కెట్లలో ప్రస్తుతం ప్రతికూల వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో సంస్థలు సరైన సమయం కోసం వేచి చూస్తున్నాయి. మే నెల తర్వాత ఒక్క కంపెనీ కూడా ఐపీఓకి రాలేదు.

2021-22లో దాదాపు 52 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు రూ.1.11 లక్షల కోట్ల సమీకరణ జరిగింది. కొత్తతరం టెక్నాలజీ సంస్థలు భారీ ఎత్తున ఐపీఓకి రావడం, స్టాక్‌ మార్కెట్‌లో రిటైల్‌ మదుపర్ల భాగస్వామ్యం పెరగడంతో గత ఏడాది ప్రైమరీ మార్కెట్‌లో భారీ ఎత్తున నిధుల సమీకరణ జరిగింది. కొన్ని కంపెనీలు భారీ లిస్టింగ్‌ లాభాలను అందించాయి. కానీ, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. స్టాక్‌ మార్కెట్లు భారీ ఎత్తున దిద్దుబాటుకు గురికావడంతో ఐపీఓలు పూర్తిగా స్తంభించిపోయాయి. మరోవైపు గత ఏడాది రాణించిన కొత్తతరం టెక్‌ సంస్థలు భారీ నష్టాల్ని మిగల్చడం కూడా మదుపర్లను నిరుత్సాహానికి గురిచేసింది. అలాగే ఐపీఓలో ఎల్‌ఐసీ షేర్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం కూడా ఐపీఓ మార్కెట్‌ సెంటిమెంటును దెబ్బతీసింది.

స్థూల ఆర్థిక అంశాలు నెమ్మదిగా మెరుగుపడుతుండడం, బలమైన కార్పొరేట్‌ ఫలితాల వంటి సానుకూల పరిణామాలతో స్టాక్‌ మార్కెట్లు తిరిగి గాడినపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా ద్వితీయార్ధంలో కొన్ని కంపెనీలు ఐపీఓకి వస్తాయని విశ్లేషిస్తున్నారు. పెద్ద మొత్తంలో నిధుల సమీకరణ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని