సెకెండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేశారా? బీమా బ‌దిలీ నిర్లక్ష్యం చేయ‌కండి!

సెకెండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసిన త‌రువాత14 రోజుల లోపుగా మోటారు బీమా బ‌దిలీ అయ్యేలా చూసుకోవాలి

Updated : 20 Dec 2021 16:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సెకెండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసే ముందు చాలా ర‌కాలుగా ఆలోచించి కొనుగోలు చేస్తుంటారు. అయితే, మోట‌ర్ బీమా పాల‌సీ బ‌దిలీ చేసుకునేందుకు మాత్రం కొందరు ప్రాధాన్య‌ం ఇవ్వ‌రు. మోటారు బీమా పాల‌సీని మీ పేరు మీద బ‌దిలీ చేసుకోకపోతే ఆర్థికంగా న‌ష్ట‌పోవ‌డ‌మే కాకుండా, చ‌ట్ట ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్త య‌జ‌మాని కార‌ణంగా ఏదైనా యాక్సిడెంట్ లేదా న‌ష్టం ఏర్ప‌డితే క్లెయిమ్ చేసుకునేందుకు అర్హ‌త ఉండ‌దు. చాలా మంది కారు కొనుగోలుదారుల‌కు స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల‌, వారు చేసే క్లెయిమ్‌లు తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వుతున్నాయి. అందువ‌ల్ల వాహ‌నాన్ని కొనుగోలు చేసిన నిర్ణీత స‌మ‌యంలోపుగా పాల‌సీని వాహ‌న య‌జ‌మాని పేరుపైకి బ‌దిలీ చేసుకోవాలి. ఈ విష‌యంలో నిర్లక్ష్యం ప‌నికిరాదు. మోటారు వాహ‌నాల చ‌ట్టం సెక్ష‌న్ 157 ప్ర‌కారం ఒకరు ఉప‌యోగించిన కారును మ‌రొక‌రు కొనుగోలు చేసిన‌ప్పుడు, వాహ‌న కొత్త య‌జ‌మాని అత‌డి పేరు మీద‌కు పాల‌సీని బ‌దిలీ చేసుకోవాలి. లేదా నేరుగా బీమా సంస్థ‌ను సంప్ర‌దించి వాహ‌నం కొనుగోలు చేసిన 14 రోజుల్లోపు పాల‌సీ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

పాత య‌జ‌మానికీ స‌మ‌స్య కావొచ్చు: ఒక‌వేళ వాహనాన్ని కొనుగోలు చేసిన వ్య‌క్తి (కొత్త‌య‌జ‌మాని) కార‌ణంగా ఏదైనా ప్ర‌మాదం సంభ‌వించి మూడో వ్య‌క్తి న‌ష్ట‌పోతే, ఆ న‌ష్ట ప‌రిహారం చెల్లించ‌వ‌ల‌సిన‌దిగా పాత య‌జ‌మానికి కోర్టు నుంచి నోటీసులు రావొచ్చు. అందువ‌ల్ల చ‌ట్ట‌బ‌ద్ధంగా ఎటువంటి స‌మ‌స్య‌లూ త‌లెత్త‌కుండా కొనుగోలు, విక్ర‌య‌దారులు ఇరువురూ బాధ్యతగా వాహ‌న బీమా పాల‌సీని బ‌దిలీ చేసుకోవాలి.

కారు బీమా పాల‌సీని బ‌దిలీ చేసుకునే విధానం..
* సెకెండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసిన త‌ర్వాత, కారుకు సంబంధించిన బీమా పాల‌సీ పాత య‌జ‌మాని పేరు నుంచి కొత్త య‌జ‌మాని పేరు మీద‌కి, కారు కొనుగోలు చేసిన 14 రోజుల్లోపు బ‌దిలీ అయ్యేలా చూసుకోవాలి.

* పాల‌సీని బ‌దిలీ చేసేందుకు కొత్త ప్ర‌తిపాద‌నా ఫార‌మ్‌తో పాటుగా, కారు విక్ర‌యించిన‌ట్లుగా ఆర్‌సీ బ‌దిలీ, పాత య‌జ‌మాని సంత‌కం చేసిన ఫార‌మ్ 29, 30, బ‌దిలీ కోసం చెల్లించాల్సిన రుసుములు, ఇంత‌కు ముందు ఉన్న‌ పాల‌సీ కాపీ మొద‌లైన ప‌త్రాలు ఇవ్వాల్సి టుంది. పైన తెలిపిన వాటిని బీమా సంస్థ‌కు ఇచ్చిన త‌ర్వాత, బీమా బ‌దిలీకి సంస్థ ఆమోదం తెలుపుతుంది.

క్లెయిమ్ చేసే స‌మ‌యంలో ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా, ఆర్‌టీఓ జారీ చేసిన కొత్త ఆర్‌సీ కాపీని బీమా సంస్థ‌కు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

* కొత్త య‌జ‌మాని పేరుపై బీమా బ‌దిలీ అయిన‌ప్ప‌టికీ ఆర్‌సీ కాపీలో పేరు మారిన‌ట్లు చూపించ‌క‌పోతే.. క్లెయిమ్ స‌మయంలోనైనా ఆర్‌సీ బ‌దిలీ ఫ్రూఫ్‌ని బీమా సంస్థ‌కు ఇవ్వాలి.

* ఆర్‌సీ బ‌దిలీ ప్ర‌క్రియ కొన‌సాగుతుండ‌గా క్లెయిమ్ చేయ‌వ‌ల‌సి వ‌స్తే, అటువంటి క్లెయిమ్‌లను కూడా తిర‌స్క‌రించ‌రు. అయితే, ఆర్‌సీ బ‌దిలీ అయిన‌ట్లుగా ఆధారాల‌ను ఇచ్చిన త‌ర్వాత మాత్ర‌మే హామీ మొత్తం చెల్లిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని