Term Insurance: సెకెండ్ ట‌ర్మ్ ప్లాన్ vs ఇంక్రిమెంట‌ల్‌ ట‌ర్మ్ ప్లాన్‌.. ఏది బెట‌ర్‌?

ట‌ర్మ్ బీమా హామీ మొత్తం పెంచుకోవ‌డం కోసం రెండ‌వ పాల‌సీని కొనుగోలు చేయడం మంచిదా.. కాలానుగుణంగా హామీ మొత్తం పెరిగే పాల‌సీ ఎంచుకోవాలా..?

Updated : 31 Dec 2021 15:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థిక జీవ‌నం సాఫీగా సాగాలంటే ఆర్థిక ప్రణాళిక ఉండ‌డం ఎంత ముఖ్య‌మో.. ఆర్థిక ప్ర‌ణాళిక‌లో టర్మ్ బీమా పాల‌సీ భాగంగా ఉండడం అంతే ముఖ్యం. పాల‌సీదారుడు అకాలంగా మ‌ర‌ణిస్తే నామినీ లేదా లబ్ధిదారునికి బీమా హామీ ల‌భిస్తుంది. అందువ‌ల్ల ఆర్థికంగా ఆధారిత స‌భ్యులు ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ట‌ర్మ్ బీమాను త‌ప్ప‌కుండా తీసుకోవాలి.

టర్మ్ బీమా కొనుగోలు చేసేటప్పుడు.. ఎంత లైఫ్ క‌వ‌ర్ అవ‌స‌ర‌మో అంద‌రికీ తెలియ‌క‌పోవ‌చ్చు. కెరీర్‌ ప్రారంభంలో బాధ్యతలు త‌క్కువ ఉండ‌డం వ‌ల్ల‌ త‌క్కువ హామీ మొత్తంతో కొనుగోలు చేసేవారు కొంద‌రైతే.. వేత‌నం త‌క్కువ ఉన్న కార‌ణంగా ప్రీమియం గురించి ఆలోచించి హామీ విష‌యంలో రాజీప‌డేవారు మరికొందరు. ఆదాయం పెరిగాక బీమా కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని వాయిదా వేసేవారు ఇంకొద‌రు. ఇక్క‌డో విష‌యం గుర్తించాలి. వ‌య‌సు పెరుగుతున్న కొద్దీ సంపాద‌న పెరుగుతుంది. అందుకు అనుగుణంగానే బాధ్యతలు, ఆర్థిక లక్ష్యాలతో పాటు జీవ‌న‌శైలి ఖ‌ర్చులు కూడా పెరుగుతాయి. సంపాద‌న పెరిగితే, ఎక్కువ ఆదా చేసేందుకు వీలుంటుంద‌ని చాలామంది న‌మ్మ‌కం. అయితే సంపాద‌న పెరిగే కొద్దీ జీవ‌న శైలిలో చోటుచేసుకునే మార్పుల కార‌ణంగా ఖ‌ర్చులు కూడా పెరుగుతుంటాయి. అందువ‌ల్ల ఏదైనా అనుకోని సంఘ‌ట‌న జ‌రిగితే కుంటుంబాన్ని ఆర్థికంగా ర‌క్షించేందుకు పెద్ద మొత్తంలో క‌వ‌రేజ్ అవ‌స‌రం అవుతుంది. ఈ కారణంగానే ఆధారిత కుటుంబ స‌భ్యులు ఉన్న వ్య‌క్తులు త‌మ వార్షిక ఆదాయానికి క‌నీసం 12 నుంచి 15 రెట్లు  హామీతో టర్మ్ బీమా కొనుగోలు చేయాల‌ని నిపుణులు చెబుతుంటారు. మీ బీమా అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు, రెండో ట‌ర్మ్ ప్లాన్ కొనుగోలు చేయొచ్చు. అయితే దీనికి మ‌రో మార్గం కూడా ఉంది. అదే ఇంక్రిమెంట‌ల్ ట‌ర్మ్ ఇన్సురెన్స్ ప్లాన్‌. 

సెకెండ్ ట‌ర్మ్ ప్లాన్ vs ఇంక్రిమెంట‌ల్ ట‌ర్మ్ ప్లాన్.. 
ఈ ప్లాన్ ఎంచుకుంటే పెరుగుతున్న ద్ర‌వ్యోల్బ‌ణం, ఇత‌ర ఆర్థిక ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ముందుగానే నిర్ణ‌యించిన విధంగా హామీ మొత్తం ప్ర‌తి సంవత్సరం పెరుగుతుంటుంది. 10 శాతం ఇంక్రీజింగ్ ట‌ర్మ్ పాల‌సీని ఎంచుకుంటే, ప్ర‌తి సంవ‌త్స‌రం పాల‌సీదారుని బీమా హామీ మొత్తం 10 శాతం చొప్పున పెరుగుతూ ఉంటుంది. ప్రీమియం కూడా కొద్దిగా పెరిగే అవ‌కాశం ఉంది. ఎక్కువ ప్రీమియం చెల్లించే కంటే, ఆదాయం పెరిగిన‌ప్పుడు మ‌రో ట‌ర్మ్ ప్లాన్ తీసుకోవ‌డం మంచిది అనుకుంటారు చాలా మంది. మ‌రి రెండో పాల‌సీ తీసుకోవడం మంచిదా? కాలంతో పాటు హామీ మొత్తం పెరిగే పాల‌సీ తీసుకోవ‌డం మంచిదా? ఒక ఉదాహ‌ర‌ణ‌తో అర్థం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిద్దాం.. 

ఉదాహ‌ర‌ణ‌కు 30 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న వ్య‌క్తి 40 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితితో (అత‌డి 70 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌ర‌కు) రూ.1 కోటికి ట‌ర్మ్ పాల‌సీ తీసుకుంటే, వార్షికంగా చెల్లించాల్సిన ప్రీమియం రూ.14,500 అనుకుందాం. 40 సంవ‌త్స‌రాల్లో అత‌డు చెల్లించే ప్రీమియం రూ.5.80 ల‌క్ష‌లు. హామీ మొత్తం పెంచుకునేందుకు 45 సంవ‌త్స‌రాల వ‌య‌సులో రూ.1 కోటి హామీ మొత్తంతో రెండో ట‌ర్మ్ పాల‌సీ తీసుకుంటే.. అత‌డు చెల్లించాల్సిన వార్షిక ప్రీమియం రూ.30 వేలు. మ‌రో 25 సంవ‌త్స‌రాలు పాల‌సీ కొన‌సాగించాలి కాబ‌ట్టి ఈ కాలానికి అత‌డు చెల్లించే ప్రీమియం రూ.7.50 ల‌క్ష‌లు. 50 సంవ‌త్స‌రాల వ‌య‌సులో రూ.50 ల‌క్ష‌ల హామీ మొత్తానికి మూడో పాల‌సీ తీసుకుంటే చెల్లించాల్సిన వార్షిక ప్రీమియం రూ.24 వేలు. 70 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కు మూడో ప్రీమియానికి రూ.4.80 ల‌క్ష‌లు చెల్లించాల్సి వ‌స్తుంది. ఈ మూడు పాల‌సీల‌కు చెల్లించే మొత్తం ప్రీమియం రూ.18.1 ల‌క్ష‌లు.

ప్ర‌తి ఏడాది క‌వ‌రేజ్ పెరిగే ట‌ర్మ్ పాల‌సీ కొనుగోలు చేసిన 30 సంవ‌త్స‌రాల వ్య‌క్తి, 40 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితితో (అత‌డి 70 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌ర‌కు) రూ.1 కోటి హామీ మొత్తానికి చెల్లించాల్సిన వార్షిక ప్రీమియం దాదాపు రూ.20 వేలు ఉంటుంది. అంటే 40 సంవ‌త్స‌రాల్లో చెల్లించే మొత్తం ప్రీమియం రూ.8 ల‌క్ష‌లు మాత్ర‌మే. కానీ క‌వ‌రేజ్ స్థిరంగా పెరుగుతూ ఉంటుంది.

ట‌ర్మ్ ప్లాన్ ప్రీమియంను ప్రభావితం చేసే అంశాల్లో పాల‌సీదారుని వ‌య‌సు ముఖ్య‌మైన‌ది. పాల‌సీ కొనుగోలు చేసే నాటికి మీ వ‌య‌సును బ‌ట్టి ప్రీమియంలో హెచ్చుత‌గ్గులు ఉంటాయి. అందుకే చిన్న వయ‌సులో పాల‌సీని కొనుగోలు చేయాలని చెబుతారు. రెండో పాల‌సీ తీసుకునే నాటికి మీ వ‌య‌సు పెరుగుతుంది కాబ‌ట్టి మొద‌టి పాల‌సీతో పోలిస్తే ఒక్కోసారి రెట్టింపు ప్రీమియం చెల్లించాల్సి వ‌స్తుంది. ఇది మ‌రింత భారంగా మారే అవ‌కాశం ఉంటుంది. అయితే సాధార‌ణ పాల‌సీతో పోలిస్తే.. ఇంక్రిమెంట‌ల్ ట‌ర్మ్ ప్లాన్‌లో వార్షిక‌ ప్రీమియం కాస్త ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ, హామీ మొత్తం స్థిరంగా పెరుగుతుంది. టర్మ్ ప్లాన్ అనేది ఒక వార్షిక ఒప్పందం. ఎప్పటికప్పుడు టర్మ్ ప్లాన్ల ప్రీమియంని పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చు. ప్రస్తుత పాలసీ కంటే కొత్త పాలసీ ప్రీమియం తక్కువగా ఉంటే పాత పాలసీని ఆపేసి కొత్త పాలసీ తీసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని