మార్కెట్లో ప‌న్ను ఆదా పొదుపు ప‌థ‌కాలు

ప‌న్ను ఆదా చేసుకునేందుకు సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ల‌భించే 15 ర‌కాల పెట్టుబ‌డి మార్గాల గురించి తెలుసుకోండి.. క‌ష్ట‌ప‌డి సంపాదించిన సొమ్ము ప‌న్ను రూపంలో చెల్లించాల‌ని ఎవ‌రికి ఉంటుంది. అలాగ‌ని ప‌న్ను చెల్లించ‌కుండా ఉంటే చ‌ట్ట‌రిత్యా నేరం అవుతుంది. అందుకే ప‌న్ను మిన‌హాయింపుల‌కు ప్ర‌త్యామ్నాయాలు ప‌రిశీలిస్తుంటారు. అవేంటో తెలుసుకోండి.

సెక్ష‌న్ 80సీ కింద ఎవ‌రు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు?.. వ్య‌క్తిగ‌త ప‌న్నుచెల్లింపుదారులు, హిందు అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌) సెక్ష‌న్ 80 సీ కింద ప‌న్ను క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అంద‌రికీ ప‌న్ను గురించి అంత‌గా అవ‌గాహ‌న ఉండ‌క‌పోవ‌చ్చు. అందుకే ఈ క‌థ‌నం.

సెక్ష‌న్ 80సీ కిందికి వ‌చ్చే ప‌న్ను-ఆదా పెట్టుబ‌డి మార్గాలు

ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థకాలు (ఈఎల్ఎస్ఎస్‌): ఈఎల్ఎస్ఎస్ అనేవి ఈక్విటీ ఆధారిత మ్యూచ్‌వ‌ల్ ఫండ్లు, ఇందులో పెట్టుబ‌డిని క‌నీసం మూడేళ్ల పాటు కొన‌సాగించాల్సి (లాక్‌-ఇన్ పీరియ‌డ్‌) ఉంటుంది. దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డుల‌ను అందిస్తాయి. అయితే ఈ సంవ‌త్స‌రం నుంచి దీర్ఘ‌కాల పెట్టుబ‌డి రాబ‌డి రూ.1 ల‌క్ష‌కు మించితే 10 శాతం దీర్ఘ‌కాల మూల‌ధ‌న రాబ‌డి ప‌న్ను (ఎల్‌టీసీజీ) చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ వంటి వాటితో పోలిస్తే కొంత రిస్క్‌తో కూడుకున్న‌ద‌నే చెప్పుకోవాలి. గ‌త ఐదేళ్ల నుంచి ఈఎల్ఎస్ఎస్ 18.45 శాతం రాబ‌డిని న‌మోదు చేసింది. సెక్ష‌న్ 80 సీ కింద ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డుల‌పై రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.

5 సంవ‌త్స‌రాల ఎఫ్‌డీ: ప‌న్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ లాకిన్ పీరియ‌డ్ 5 సంవ‌త్స‌రాల. సెక్ష‌న్ 80సీ కింద దీనికి రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది. ఇందులో పెట్టుబ‌డులు పూర్తి భ‌ద్ర‌త‌తో పాటు క‌చ్చిత‌మైన రాబ‌డిని అందిస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. వ‌డ్డీ రేట్లు 7 నుంచి 9 శాతం వ‌ర‌కు ఉంటాయి. ప‌న్ను మిన‌హాయింపు వ్య‌క్తుల‌కు, హిందు అవిభాజ్య కుటుంబాల‌కు (హెచ్‌యూఎఫ్‌), సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు, ఎన్ఆర్ఐల‌కు ల‌భిస్తుంది. ఐదేళ్ల కంటే ముందు ఉప‌సంహ‌ర‌ణ‌ల‌కు వీలుండ‌దు. ఒక‌రు లేదా ఉమ్మ‌డిగా ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు. అయితే ఉమ్మ‌డి ఖాతా తీసుకుంటే మొద‌టి వ్యక్తికి మాత్ర‌మే ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.

ప్ర‌జా భ‌విష్య నిధి ఖాతా (పీపీఎఫ్‌): ఇది సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డి ప‌థ‌కం, సంపాదించే వ్య‌క్తులు వారి కోసం గానీ, వారి భార్య పిల్ల‌ల కోసం గానీ ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో క‌నీసం రూ.500 నుంచి రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ఒక ఏడాదిలో 12 కంటే ఎక్కువ సార్లు డిపాజిట్ చేయ‌కూడ‌దు. బ్యాంకులలో, పోస్టాఫీసుల‌లో పీపీఎఫ్‌ ఖాతా తెర‌వాల్సి ఉంటుంది. క‌నీస కాలవ్య‌వ‌ధి 15 ఏళ్లు. ఆ త‌ర్వాత‌ ప్ర‌తీ 5 ఏళ్ల చొప్పున పొడిగించుకునే అవ‌కాశం ఉంది. పీపీఎఫ్ ఖాతాపై మూడేళ్ల నుంచి ఆరేళ్ల వ‌ర‌కు రుణాలు కూడా ల‌భిస్తాయి. ఏడు సంవ‌త్స‌రాల త‌ర్వాత పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌ల‌కు అవ‌కాశం ఉంటుంది. ఇది పెట్టుబ‌డి ప‌థ‌కంగా మాత్ర‌మే కాకుండా ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. వ‌డ్డీ, మోచ్యూరిటీ మొత్తం మీద కూడా ఈఈఈ కేట‌గిరీలో పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.

సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతా: ఈ ప‌థ‌కం ముఖ్య ఉద్దేశం అమ్మాయిల చ‌దువు, వివాహ స‌మ‌యంలో ఖ‌ర్చుల నిమిత్తం ఆర్ధికి అవ‌సరాల కోసం ఇబ్బంది ప‌డ‌కుండా త‌గినంత మొత్తం స‌మ‌కూర్చు కోవ‌డం. దీనిపై కూడా పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. 10 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌సు ఆడ‌పిల్లల పేరు మీద సంర‌క్ష‌కుడు ఈ ఖాతాను తెరువ‌వ‌చ్చు. 18 సంవ‌త్స‌రాల వ‌య‌సులో 50 శాతం విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. వ‌డ్డీ రేటు ప్ర‌స్తుతం 8.4 శాతంగా ఉంది. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.1.5 ల‌క్ష‌ల కంటే ఎక్కువ‌గా పెట్టుబ‌డుల‌కు అవ‌కాశం లేదు. మెచ్యూరిటి గ‌డువు 21 సంవ‌త్స‌రాలు.

జీవిత బీమా ప్రీమియం: కుటుంబ‌ సంర‌క్ష‌ణ కోసం తీసుకున్న జీవిత బీమాల నుంచి కూడా సెక్ష‌న్ 80 C ప్ర‌కారం ప‌న్ను మిన‌హాయింపులుంటాయి. ఇందులో ఈఈఈ కేట‌గిరిలో ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. అయితే హామీ మొత్తంలో ప్రీమియం 10 శాతం కంటే త‌క్కువ‌గా ఉంటేనే ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. ఏడాదికి రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు.

జాతీయ పొదుపు స‌ర్టిఫికెట్ (ఎన్ఎస్‌సీ): చిన్న మొత్తాల్లో పొదుపు చేయాలనుకునేవారి కోసం భారత ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించింది. కచ్చితమైన రాబడి ఆశించేవారికి సురక్షితమైన పెట్టుబడి మార్గం ఇది. ఐదేళ్ల మెచ్యూరిటీ పీరియడ్‌తో జాతీయ పొదుపు ప‌త్రాల పథకం అందుబాటులో ఉంది. మేజ‌ర్లు వారి సొంత‌పేరుపై జాతీయ పొదుపు ప‌త్రాల‌ను కొనుగోలు చేసేందుకు అర్హులు. ప‌దేళ్లు దాటిన మైన‌ర్లు సంర‌క్ష‌కుడి పేరిట జాతీయ పొదుపు ప‌త్రాలు కొనుగోలుచేయ‌వ‌చ్చు. ఒక జాతీయ పొదుపు ప‌త్రం కొనుగోలుకు క‌నీసం రూ.100 పెట్టుబ‌డి పెట్టాలి. గ‌రిష్ఠంగా ప‌రిమితి లేదు. స‌క్ష‌న్ 80 సీ కింద ఏడాదికి రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. వ‌డ్డీ రేట్లు 7.9 శాతం. చాలావ‌ర‌కు పెట్టుబ‌డుదారులు ఈ ప‌త్రాల‌పై బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకుంటారు. ఒక వ్య‌క్తి నుంచి మ‌రొక వ్య‌క్తికి స‌ర్టిఫికేట్ల‌ను బ‌దిలీ చేసుకునే అవ‌కాశం కూడా ఉంటుంది.

ఇన్‌ఫ్రాస్ర్ట‌క్చ‌ర్ బాండ్లు: దేశంలో ప్ర‌భుత్వ ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో ఈ బాండ్ల ద్వారా పెట్టుబ‌డులు రాబ‌డ‌తారు. ప్ర‌భుత్వం లేదా ప్రభుత్వ ఆదీనంలోని కంపెనీలు ఈ బాండ్ల‌ను జారీ చేస్తాయి. అయితే ఇవి ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉండ‌వు. ప్ర‌భుత్వానికి న‌గ‌దు అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఈ బాండ్ల‌ను జారీ చేసి నిధిని స‌మీక‌రిస్తుంది. దేశంలో నివ‌సిస్తున్న సామాన్య పౌరులు, హెచ్‌యూఎఫ్‌లు కూడా ఈ బాండ్ల‌ను 10-15 సంవ‌త్స‌రాల గ‌డువుతో కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఐదేళ్ల లాకిన్ త‌ర్వాత బైబ్యాక్ ఆప్ష‌న్ కూడా ఉంటుంది. ఈ బాండ్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల‌లో న‌మోద‌య్యాయి. ఆదాయ ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80 సీసీఎఫ్ కింద ఏడాదికి రూ.20 వేల‌పై ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. ఇప్పుడు వీటిని ప్రభుత్వం నిలిపి వేసింది.

ట్యూష‌న్ ఫీజు: పిల్ల‌ల‌ ట్యూష‌న్ ఫీజుపై ప‌న్నుచెల్లింపుదారుడు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. మొత్తం ఫీజుపై కాకుండా కేవ‌లం ట్యూష‌న్ ఫీజుపై మాత్ర‌మే ఈ అవ‌కాశం ఉంటుంది. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు సంబంధించిన ఫీజును ఆధారంగా చూపి ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు.

ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్య‌క్తికి న‌లుగురు పిల్ల‌లు ఉన్నారు. కుటుంబంలో ఆదాయం పొందుతున్న‌ది అత‌డు ఒక్క‌డు మాత్ర‌మే. అయితే ఇద్ద‌రు పిల్ల‌ల‌కు సంబంధించిన ట్యూష‌న్ ఫీజును క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అయితే పిల్ల‌ల త‌ల్లిదండ్రులిద్ద‌రు ఆదాయం పొందుతున్న‌ట్లయితే, ఇద్ద‌రు ఆదాయ ప‌న్ను పరిదిలోకి వ‌స్తే మొత్తం న‌లుగురి పిల్ల‌ల‌కు సంబంధించిన ట్యూష‌న్ ఫీజుపై క్లెయిమ్ చేసుకోఉవ‌చ్చు. ద‌త్త‌త తీసుకున్న పిల్ల‌ల‌కు కూడా ఇది వ‌ర్తిస్తుంది.

సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్ స్కీమ్స్ (ఎస్‌సీఎస్ఎస్‌): సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్ స్కీమ్ 60 ఏళ్ల‌కు పైబ‌డిన‌వారు ఈ ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు. 55 ఏళ్ల వ‌య‌సులో స్వ‌చ్ఛందంగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన‌వారు ఒక నెల‌లోపు దీనిని ప్రారంభించ‌వ‌చ్చు. ఈ ప‌థ‌కంలో క‌నీస కాల‌ప‌రిమితి ఐదేళ్లు. క‌నీస పెట్టుబ‌డి రూ.1000, గ‌రిష్ఠంగా రూ.15 ల‌క్ష‌లు. వార్షిక వ‌డ్డీ రేటు 8.6 శాతం. మెచ్యూరిటీ త‌ర్వాత మ‌రో మూడేళ్ల పాటు ఖాతాను కొన‌సాగించ‌వ‌చ్చు. అన్ని ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, మూడు ప్రైవేటు రంగ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల్లో లేదా పోస్టాఫీస్‌లో ఈ ఖాతాను ప్రారంభించాలి. భార్య లేదా భ‌ర్త పేరుతో ఉమ్మ‌డి ఖాతాను కూడా తీసుకోవ‌చ్చు. ఖాత‌ను ఒక పోస్టాఫీస్ నుంచి మ‌రొక పోస్టాఫీస్‌కు మార్చుకునే అవ‌కాశం కూడా ఉంటుంది. నామినీ స‌దుపాయం ఉంటుంది.

గృహ రుణ చెల్లింపు: గృహ రుణ చెల్లింపుల్లో అస‌లుపై సెక్ష‌న్ 80 సీ కింద రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. అయితే దీనికి కొన్ని ప‌రిమితులు ఉన్నాయి. రుణం తీసుకొని క‌చ్చితంగా ఇంటిని కొనుగోలు చేయడ‌మో, నిర్మించ‌డ‌మో చేయాలి. ఐదేళ్ల వ‌ర‌కు ఆస్తిని ఇత‌రుల‌కు విక్ర‌యించ‌కూడ‌దు.

స్టాంప్ డ్యూటీ: ఇంటి రిజిస్ర్టేష‌న్ ఖ‌ర్చులు , స్టాంప్ డ్యూటీ, ఇత‌ర వ్య‌యాల‌పై సెక్ష‌న్ 80 సీ కింద రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. అయితే చెల్లించిన ఏడాది క్లెయిమ్ చేసుకోవాలి.

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లు: పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ మైన‌ర్ పేరుతో కూడా ప్రారంభించ‌వ‌చ్చు. మేజ‌ర్ అయిన త‌ర్వాత ఖాతాను త‌మ పేరుతో మార్చుకోవ‌చ్చు. ఇద్ద‌రు మేజ‌ర్లు ఉమ్మ‌డి ఖాతాను కూడా ప్రారంభించ‌వ‌చ్చు. వ్య‌క్తిగ‌త‌ ఖాతాను ఉమ్మ‌డి ఖాతాగా, ఉమ్మ‌డి ఖాతాను వ్య‌క్తిగ‌త ఖాతాగా మార్చుకోవ‌చ్చు. నామినీ స‌దుపాయం ఉంది. ఖాతాను ఒక పోస్టాఫీస్ నుంచి మ‌రొక పోస్టాఫీస్‌కు బ‌దిలీ చేసుకోవ‌చ్చు. వ‌డ్డీ రేట్లు త్రైమాసికంగా లెక్కించి వార్షికంగా అంద‌జేస్తారు. క‌నీసం రూ.200 డిపాజిట్ చేయాలి, గ‌రిష్ఠ ప‌రిమితి లేదు. సెక్ష‌న్ 80 సీ ప్ర‌కారం ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.

ప్ర‌భుత్వం తాజాగా పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్లును స‌వ‌రించింది. ఒక సంవ‌త్స‌ర టైమ్ డిపాజిట్ వ‌డ్డీ రేట్లు(త్రైమాసికంగా కాంపౌండ్ చేస్తారు)ను జ‌న‌వ‌రి-మార్చి త్రైమాసికానికి గానూ 6.9 శాతానికి పెంచింది. ఇంత‌కు ముందు త్రైమాసికానికి ఇది 6.9 శాతంగా ఉంది. 3సంవ‌త్స‌రాల టైమ్ డిపాజిట్ రేట్ల‌ను 7 శాతం నుంచి 6.9 శాతానికి త‌గ్గించింది. రెండు సంవ‌త్స‌రాల టైమ్ డిపాజిట్‌పై 6.9 శాతం, 5 సంవ‌త్స‌రాల టైమ్ డిపాజిట్‌పై 7.7 శాతం వ‌డ్డీ రేట్లు కొన‌సాగుతాయి. అదేవిధంగా 5 సంవ‌త్స‌రాల పోస్టాఫీసు రిక‌రింగ్ డిపాజిట్ వ‌డ్డీ రేట్లు 7.2 శాతం వ‌ద్ద స్థిర‌ప‌రిచింది.

యూనిట్ ఆధారిత బీమా ప‌థ‌కాలు (యూలిప్స్‌): యులిప్స్‌లో బీమా సౌక‌ర్యంతో పాటు పెట్టుబ‌డులు నిర్వ‌హించే స‌దుపాయం ఉంటుంది. ప్రీమియం నుంచి మోర్టాలిటీ, ఫండ్ మేనేజ్‌మెంట్ మొద‌ల‌గు రుసుముల‌ను మిన‌హ‌యించ‌గా, మిగ‌తా మొత్తాన్ని వివిధ ర‌కాల (ఈక్విటీ, డెట్‌) ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెడ‌తారు. క‌నీసం 5 ఏళ్లు పెట్టుబ‌డులు వెన‌క్కి(లాక్‌-ఇన్ పీరియ‌డ్‌) తీసుకోరాదు. ఇందులో కూడా ఈఈఈ కేట‌గిరిలో ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. అయితే జీవిత బీమా యులిప్‌లో ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు క‌చ్చితంగా రెండేళ్ల కొన‌సాగించాలి.

జాతీయ పొదుపు ప‌థ‌కం (ఎన్‌పీఎస్‌): ఎన్‌పీఎస్ పెన్ష‌న్ స్కీమ్‌ ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత పెన్ష‌న్ పొందేందుకు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ఈ ఖాతాను 18 నుంచి 60 సంవ‌త్స‌రాల వ‌య‌సు వారు ఎవ‌రైనా ప్రారంభించ‌వ‌చ్చు. పెట్టుబ‌డుల‌కు ఎలాంటి ప‌రిమితి లేదు. వ‌డ్డీ రేట్లు 12-14 శాతం వ‌ర‌కు ఉంటాయి. పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌ల‌కు అవ‌కాశం ఉంటుంది. సెక్ష‌న్ 80 సీ కింద రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. అద‌నంగా రూ.50 వేల వ‌ర‌కు పెట్టుబ‌డులపై సెక్ష‌న్ 80సీసీడీ(1 బీ) కింద ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.

ఉద్యోగ భ‌విష్య నిధి (ఈపీఎఫ్): ఈపీఎఫ్ ఉద్యోగుల‌కు ప‌ద‌వి విర‌మ‌ణ నిధిని ఏర్పాటు చేసుకునేందుకు ప్రారంభించిన ప‌థ‌కం. ఉద్యోగి ప్రాథ‌మిక వేత‌నం నుంచి 12 శాతం + డీఏ సంస్థ ఈపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేస్తుంది. నెల‌కు ప్రాథ‌మిక వేత‌నం రూ.15 వేల వ‌ర‌కు ఉన్న ఉద్యోగులు ఈ ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు. వ‌డ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. దీనికోసం ఉద్యోగి, సంస్థ వేత‌నం 12 శాతం చొప్పున డీఏతో క‌లిపి డిపాజిట్ చేయాలి. పీఎఫ్ ఖాతాపై ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. అయితే ఐదేళ్ల లోపు విత్‌డ్రా చేసుకుంటే ప‌న్ను వ‌ర్తిస్తుంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని