Loans: సెక్యూర్డ్‌ Vs అన్‌సెక్యూర్డ్‌.. ఏ లోన్‌ ఎప్పుడు తీసుకోవాలి?

స్థిర ఆదాయం, మంచి క్రెడిట్ స్కోరు ఉన్న‌ప్పుడు మాత్ర‌మే బ్యాంకులు రుణాన్ని మంజూరు చేసేందుకు ముందుకు వ‌స్తాయి.

Updated : 18 Jan 2022 15:08 IST

ఉన్న‌త విద్య‌, గృహ, వాహ‌న కొనుగోళ్లు, పిల్ల‌ల చదువు, వివాహం, ఇంటి మ‌ర‌మ్మ‌తులు, వైద్య ఖ‌ర్చులు, వ్యాపార అవ‌స‌రాలు, వ‌స్తువుల కొనుగోలు, ఇత‌ర వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోసం సాధార‌ణంగా మనం బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటాం. ఇందులో కొన్ని రుణాలు అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల కార‌ణంగా తీసుకుంటే, మ‌రికొన్ని రుణాల‌ను ఒక ప్రణాళిక ప్ర‌కారం తీసుకుంటారు. రుణం తీసుకునే ముందు రుణ ర‌కాలు, ఏ రుణం ఎప్పుడు తీసుకోవాలి?రుణం తీసుకోవడం వ‌ల్ల లాభ‌నష్టాలు, త‌దిత‌ర వివ‌రాల‌ను తెలుసుకోవడం చాలా అవ‌స‌రం.

రుణాలు రెండు రకాలు..

రుణాలు రెండు ర‌కాలుగా ఉంటాయి. ఒక‌టి సుర‌క్షితమైనవి.. సెక్యూర్డ్ లోన్స్‌. రెండోది అన్‌సెక్యూర్డ్ లోన్స్‌. సుర‌క్షిత రుణాలు అంటే రుణ‌గ్ర‌హీత ఇల్లు, ఆభ‌ర‌ణాలు, భూమి, వాహ‌నం ఇలా త‌న వ‌ద్ద ఉన్న ఏదైనా ఆస్తిని బ్యాంకు వ‌ద్ద తాక‌ట్టు పెట్టి తీసుకుంటారు. ఈ రుణ విలువ బ్యాంకు వ‌ద్ద హామీ ఇచ్చిన ఆస్తి విలువ కంటే త‌క్కువ‌గా గానీ, స‌మానంగా గానీ ఉంటుంది. అన్‌సెక్యూర్డ్‌ లోన్స్‌.. ఈ రుణాల‌ను ఎటువంటి పూచీక‌త్తు లేకుండా బ్యాంకులు రుణ గ్ర‌హీత‌ల‌కు అందిస్తాయి. వ్య‌క్తిగ‌త రుణాలు, క్రెడిట్ కార్డు రుణాలు వంటివి ఈ కేట‌గిరిలోకి వ‌స్తాయి. రుణ మొత్తం త‌క్కువ‌గా ఉంటుంది. అధిక వ‌డ్డీ రేట్లు ఉంటాయి.

సెక్యూర్డ్ లోన్స్‌...

ఈ రుణాలు అందించ‌డంలో రుణ‌దాత‌ల‌కు త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉంటుంది. రుణం తీసుకున్న వ్య‌క్తి రుణం తిరిగి చెల్లించ‌డంలో విఫ‌లమైతే బ్యాంకులు బ‌కాయిల‌ను వ‌సూలు చేసుకునేందుకు తాకట్టుగా పెట్టిన ఆస్తిని స్వాధీనం చేసుకోవ‌చ్చు. తిరిగి వసూలు కాబోవన్న భ‌యం ఉండ‌దు. కాబ‌ట్టి ఇటువంటి రుణాల‌ను రుణ సంస్థ‌లు తొంద‌ర‌గా ఆమోదిస్తాయి. త‌క్కువ వ‌డ్డీ రేటుతో అధిక రుణం మంజూరు చేయ‌డంతో పాటు తిరిగి చెల్లించేందుకు దీర్ఘ‌కాలప‌రిమితిని ఇస్తాయి. చెల్లింపులకు త‌గిన‌ దీర్ఘ‌కాల ఆదాయ మార్గం ఉంటేనే ఈ రుణాల‌ను తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు.

బ్యాంకులు అందించే అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన సుర‌క్షిత రుణాల‌లో ఒక‌టి గృహ‌రుణం. ఇక్క‌డ కొనుగోలు చేసిన కొత్త ఇంటిని పూచీక‌త్తుగా ఉంచుకుని బ్యాంకులు ఇంటి కొనుగోలుకు రుణం ఇస్తాయి. ఇంటి విలువ‌లో 75 శాతం నుంచి 90 శాతం వ‌ర‌కు రుణం పొందే వీలుంది. తిరిగి చెల్లింపులు చేసేందుకు 30 సంవ‌త్స‌రాల వ‌ర‌కు కాల‌ప‌రిమితిని ఎంచుకోవ‌చ్చు. ప్ర‌తినెలా ఈఎంఐ రూపంలో తీసుకున్న రుణాన్ని వ‌డ్డీతో పాటు చెల్లించ‌వ‌చ్చు. ఒక‌వేళ ఇంటి కోసం రుణం తీసుకున్న వారు తిరిగి చెల్లించడంలో విఫలమైతే తాక‌ట్టులో ఉన్న ఇంటిని వేలం వేసేందుకు బ్యాంకులకు అధికారం ఉంటుంది. స్వ‌ల్ప‌కాల అస‌రాల కోసం బంగారాన్ని తాకట్టుగా పెట్టి కూడా రుణం తీసుకోవ‌చ్చు. ఇది కూడా సెక్యూర్డ్‌ లోన్‌ కిందకే వస్తుంది.

అన్‌సెక్యూర్డ్ లోన్స్‌...

ఈ రుణాల‌ను అందించ‌డంలో న‌ష్ట‌భ‌యం ఎక్కువ‌. కాబ‌ట్టి వ‌డ్డీ రేటు అధికంగా ఉంటుంది. చెల్లించ‌ని ప‌క్షంలో స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి పూచీకత్తు ఉండదు. కాబ‌ట్టి ఇటువంటి రుణాలు నిబంధ‌న‌లు, ష‌ర‌తుల‌తో వ‌స్తాయి. రుణం మొత్తం కూడా చాలా త‌క్కువ‌గా ఉంటుంది. రుణ గ్ర‌హీతకు స‌కాలంలో తిరిగి చెల్లించే సామ‌ర్థ్యం ఉన్న‌ప్పుడు మాత్ర‌మే అన్‌సెక్యూర్డ్‌ లోన్స్‌ తీసుకోవాలి. లేదంటే క్రెడిట్ స్కోరుపై ప్ర‌భావం ప‌డుతుంది. స‌కాలంలో చెల్లింపులు చేస్తే మెరుగైన క్రెడిట్ స్కోరును పొంద‌చ్చు. దీంతో ద‌ర‌ఖాస్తు చేసుకున్న రుణం త్వ‌రగా ఆమోదం పొందేందుకు అవ‌కాశం ఉంటుంది. త‌క్కువ వ‌డ్డీ రేటు కోసం బ్యాంకుల‌ను సంప్ర‌దించే వీలుంటుంది. 

అన్‌సెక్యూర్డ్ లోన్‌ను ఏ కార‌ణం వల్లనైనా తీసుకోవ‌చ్చు. ఇందులో ప్ర‌ధానంగా వ‌చ్చే రుణం వ్య‌క్తిగ‌త రుణం. మీరు తీసుకున్న రుణం ఎందుకోసం ఖర్చుచేస్తున్నారో రుణదాతకు తెలియప‌ర‌చాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. వ్య‌క్తిగ‌త రుణాన్ని.. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు, వైద్య ఖ‌ర్చులు, బిల్లు చెల్లింపులు, ప్ర‌యాణ ఖ‌ర్చులు వంటి వాటి కోసం ఉప‌యోగించుకోవ‌చ్చు. సాధార‌ణంగా రుణ చెల్లింపుల‌కు 5 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి వ‌ర‌కు అనుమ‌తిస్తారు. రుణ గ్ర‌హీత క్రెడిట్ చ‌రిత్ర ఆధారంగా రుణం మంజూరు చేస్తారు. స్వ‌ల్ప‌కాల అవ‌స‌రాల కోసం క్రెడిట్ కార్డుని ఉప‌యోగించుకోవ‌చ్చు. క్రెడిట్ కార్డులు ప్రీ-అప్రూవ్డ్‌ క్రెడిట్ లిమిట్‌తో వ‌స్తాయి. తిరిగి చెల్లించేంద‌కు నిర్ణీత కాల‌ప‌రిమితి ఉంటుంది. ఈ లోపు చెల్లిస్తే ఎలాంటి వ‌డ్డీ వ‌ర్తించ‌దు. లేదంటే చెల్లించాల్సిన మొత్తంపై 35 నుంచి 45 శాతం వ‌ర‌కు వార్షిక‌ వ‌డ్డీ చెల్లించాల్సి వ‌స్తుంది.

స్థిర ఆదాయం, మంచి క్రెడిట్ స్కోరు ఉన్న‌ప్పుడు మాత్ర‌మే బ్యాంకులు రుణాన్ని మంజూరు చేసేందుకు ముందుకు వ‌స్తాయి. రుణం కోసం ప్రైవేట్ సంస్థ‌ల‌ను గానీ, వ్య‌క్తుల‌ను గానీ ఆశ్ర‌యిస్తే ఎక్కువ వ‌డ్డీ వ‌సూలు చేయ‌వ‌చ్చు. లేదా ముందుగానే రుణం చెల్లించ‌మ‌ని ఒత్తిడి చేయ‌వ‌చ్చు. అందుకే రుణం కోసం బ్యాంకుల‌ను సంప్ర‌దించ‌డ‌మే మంచిది. ఇందుకోసం క్రెడిట్ స్కోరుపై ప్రభావం ప‌డ‌కుండా తీసుకున్న రుణం ఏదైనా స‌కాలంలో చెల్లించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని