Updated : 08 Aug 2022 17:01 IST

9 ఏళ్ల‌లో భారీగా పెరిగిన సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్ డిపాజిట్లు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: గడిచిన 9 ఏళ్ల‌లో (2013-2022) సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) డిపాజిట్లు 1527% పెరిగాయి. 2013-14లో పోస్టాఫీసుల్లో సీనియ‌ర్ సిటిజ‌న్‌ల చిన్న పొదుపు ప‌థ‌కం కింద మొత్తం స్థూల డిపాజిట్లు రూ.1997.9 కోట్లు. ఇవి 2021-22 నాటికి రూ.32,507.89 కోట్ల‌కు పెరిగాయి. ఈ SCSS డిపాజిట‌ర్ల‌కు 7.40% ఆక‌ర్ష‌ణీయ‌మైన వ‌డ్డీ రేటు ఉంది. ఈ వ‌డ్డీ రేటు ప్ర‌తి త్రైమాసికానికి స‌వ‌రిస్తారు. కానీ గ‌త కొన్ని త్రైమాసికాలుగా SCSS డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్లు మార‌లేదు. ఈ  డిపాజిట్లు పెర‌గ‌డానికి బ‌ల‌మైన ఆర్థిక కార‌ణాలే ఉన్నాయి.

సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్ స్కీమ్: ఇది పోస్టాఫీస్‌ అందిస్తున్న పొదుపు ప‌థ‌కం. త్రైమాసిక ప్రాతిప‌దిక‌న అధిక స్థిర రాబ‌డి, సాధార‌ణ ఆదాయం కోసం చూస్తున్న సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఈ సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్ స‌రిపోతుంది. చాలా మంది ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన వారి మొద‌టి ఎంపిక సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్స్ స్కీమ్. పేరులో ఉన్న‌ట్లుగానే ఈ ప‌థ‌కం సీనియ‌ర్ సిటిజ‌న్‌లు లేదా ముందుగా ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన వారికి మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది. 60 ఏళ్లు పైబ‌డిన ఎవ‌రైనా పోస్టాఫీస్ లేదా బ్యాంకు నుంచి ఈ ప‌థ‌కంలో చేరొచ్చు. ఈ ప‌థ‌కం 5 ఏళ్ల ప‌ద‌వీ కాలం క‌లిగి ఉంటుంది. అయితే ప‌థ‌కం మెచ్యూర్ అయిన త‌ర్వాత దీనిని 3 ఏళ్ల పాటు పొడిగించ‌వ‌చ్చు. మ‌ధ్య‌లో ఉప‌సంహ‌ర‌ణ‌కు అనుమ‌తి ఉంటుంది. దీనిలో పెట్టుబ‌డులు 1961 ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సి కింద సంవ‌త్స‌రానికి రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపునకు అర్హులు.

అధిక వ‌డ్డీ రేటు: ఈ పొదుపు ప‌థ‌కానికి ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం 7.40% వార్షిక వ‌డ్డీని అందిస్తుంది. బ్యాంకులు, పోస్టాఫీసు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) కంటే మెరుగైన వ‌డ్డీ రాబ‌డి ఈ ప‌థ‌కానికి ఉంది.

పెట్టుబ‌డి ప‌రిమితి: ఇది ఒకేసారి పెట్టుబ‌డి పెట్టే సింగిల్ ప్రీమియం డిపాజిట్‌. SCSSలో ఒక సీనియ‌ర్ సిటిజ‌న్ చేయ‌గ‌లిగే గ‌రిష్ఠ డిపాజిట్ రూ.15 ల‌క్ష‌లు, క‌నీస డిపాజిట్ రూ.1000.

పన్ను ప్ర‌యోజ‌నం: SCSSలో ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.50 వేల వ‌ర‌కు వ‌డ్డీకి ప‌న్ను ఉండ‌దు. ఒక సంవ‌త్స‌రంలో మొత్తం వ‌డ్డీ రూ.50,000 దాటితే అప్పుడు ప‌న్ను విధిస్తారు. SCSS ఖాతాదారు ఫార‌మ్ 15జీ/15హెచ్‌ని స‌మ‌ర్పించిన‌ట్ల‌యితే ఒక సంవ‌త్స‌రంలో వ‌డ్డీ రూ.50,000 కంటే ఎక్కువ ఉండ‌క‌పోతే టీడీఎస్ క‌టింగ్ ఉండ‌దు.

ఆటో క్రెడిట్: SCSS మొత్తానికి వ‌చ్చే వ‌డ్డీ రాబ‌డిని తీసుకోవ‌డానికి సీనియ‌ర్ సిటిజ‌న్లు పోస్టాఫీసుకు వెళ్ల‌న‌వ‌స‌రం లేదు. అదే పోస్టాఫీసులో ఉన్న వారి సేవింగ్స్ ఖాతాలోకి SCSS వ‌డ్డీ ఆటో క్రెడిట్ అయిపోతుంది. ఆ సేవింగ్స్ ఖాతా నుంచి డ‌బ్బుని కావాల్సిన‌ప్పుడు తీసుకోవ‌చ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని