Health Insurance: సీనియర్ సిటిజన్స్ ఆరోగ్య బీమా తీసుకునే ముందు..ఏం చూడాలి?

వృధ్ధాప్యంలో నిరంత‌ర వైద్య స‌హాయం అవ‌స‌ర‌మ‌వుతుంది కాబ‌ట్టి ఆరోగ్య బీమా పాల‌సీ ఏ వ‌య‌సులో తీసుకున్న.. జీవిత‌కాల పున‌రుద్ధ‌ర‌ణ ఉన్న పాల‌సీని ఎంచుకోవ‌డం మేలు

Published : 09 Jun 2022 16:33 IST


సాధార‌ణంగా సీనియ‌ర్ సిటిజ‌న్లు ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకునేందుకు ఆలోచిస్తుంటారు. పాల‌సీలో ఉన్న‌ సంక్లిష్టతే ఇందుకు కార‌ణం. వయోవృద్ధులకు ఆరోగ్య సంరక్షణ ఎక్కువగా అవసరం, వారి విషయంలో ఖర్చులూ ఎక్కువే. అందువ‌ల్ల ప్రీమియం త‌దిత‌ర విష‌యాల‌లో బీమా సంస్థ‌లు వివిధ 'క్లాజులు' వ‌ర్తింప‌జేస్తుంటాయి. పాల‌సీ తీసుకునేట‌ప్పుడు పాల‌సీ పత్రాన్ని క్షుణ్ణంగా చ‌ద‌వాలి. లేదంటే చిన్న చిన్న పొర‌పాట్లే క్లెయిమ్ దాఖ‌లు చేసేట‌ప్పుడు స‌మ‌స్య‌ల‌కు దారితీయ‌వ‌చ్చు. పాల‌సీ తీసుకునే ముందే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. 

ప్ర‌వేశ వ‌య‌సు..
మీరు పాల‌సీ తీసుకునేట‌ప్పుడు ప్రాథ‌మికంగా చూడాల్సింది ప్ర‌వేశ వ‌య‌సు. గ‌రిష్ట ప్ర‌వేశ వ‌య‌సు 60 నుంచి 80 మ‌ధ్య‌లో ఉన్న పాల‌సీని ఎంపిక చేసుకోవ‌డం మంచిది. ఒక‌వేళ భ‌విష్య‌త్తులో సీనియ‌ర్ సిటిజ‌న్లు అయిన త‌ల్లిదండ్రుల కోసం తీసుకోవాల్సి వ‌స్తే ఇబ్బందులు ఉండ‌వు. 

పున‌రుద్ధ‌ర‌ణ‌..
వృధ్ధాప్యంలో నిరంత‌ర వైద్య స‌హాయం అవ‌స‌ర‌మ‌వుతుంది కాబ‌ట్టి ఆరోగ్య బీమా పాల‌సీ ఏ వ‌య‌సులో తీసుకున్నా..జీవిత‌కాల పున‌రుద్ధ‌ర‌ణ ఉన్న పాల‌సీని ఎంచుకోవ‌డం మేలు. 

క‌వ‌రేజ్‌, వెయిటింగ్ పిరియ‌డ్‌..
సీనియ‌ర్ సిటిజ‌న్లు ఆరోగ్య బీమా పాల‌సీని ఎంచుకునేట‌ప్పుడు ఇప్ప‌టికే ఉన్న ఆరోగ్య ప‌రిస్థితులు, తీవ్ర‌మైన వ్యాధుల‌ను క‌వ‌ర్ చేయ‌గ‌ల స‌మ‌గ్ర ఆరోగ్య ప్ర‌ణాళిక‌ను ఎంచుకోవాలి. కొన్ని వ్యాధులు క‌వ‌ర‌య్యేందుకు ఎక్కువ వెయిటింగ్ పిరియ‌డ్ ఉంటుంది. ఇది 1 నుంచి 5 సంవ‌త్స‌రాల వ‌ర‌కు కూడా ఉండొచ్చు. పాల‌సీని ఎంచుకునేట‌ప్పుడు పాల‌సీలో క‌వ‌ర‌య్యే వ్యాధుల జాబితా, వ‌ర్తించే వెయిటింగ్ పిరియ‌డ్‌ల‌ను తెలుసుకోవాలి. కొంత అధిక ప్రీమియం చెల్లించ‌డం ద్వారా వెయిటింగ్ పిరియ‌డ్‌ను కొన్ని బీమా సంస్థ‌లు త‌గ్గిస్తాయి. ఇటువంటి వాటి గురించి కూడా పాల‌సీదారుడు తెలుసుకోవాలి. 

స‌హా - చెల్లింపులు..
చాలా వ‌ర‌కు బీమా సంస్థ‌లు సీనియ‌ర్ సిటిజ‌న్ ఆరోగ్య బీమా ప్లాన్‌ల‌ను స‌హా-చెల్లింపుతో అందిస్తాయి. అంటే, వైద్య ఖ‌ర్చుల‌లో కొంత భాగాన్ని పాల‌సీదారు సొంతంగా భ‌రించాల్సి ఉంటుంది. స‌హా-చెల్లింపు సాధార‌ణంగా క్లెయిమ్ మొత్తంలో క‌నీసం 20 శాతం ఉంటుంది. అయితే, సహా చెల్లింపులు ఉండడం లో తప్పేమీ లేదు. చిన్న చిన్న వాటిని క్లెయిమ్ చేసుకోకుండా ఇది బీమా సంస్థకు లాభిస్తుంది. అలాగే, ప్రీమియం తగ్గడం వల్ల పాలసీ దారుడికి కూడా కొంత లాభమే. 

ఓపీడీ, హోమ్ కేర్ ట్రీట్‌మెంట్‌..
సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు నిరంత‌రం ఆరోగ్య ప‌రీక్ష‌లు, చికిత్స‌లు అవ‌స‌ర‌మ‌వ్వ‌చ్చు. అందువ‌ల్ల పాల‌సీలో ఓపీడీ సేవ‌లు క‌వ‌ర‌య్యేలా చూసుకోవాలి. అలాగే హోమ్ కేర్ ట్రీట్‌మెంట్‌కి సంబంధించిన డొమిసిలియ‌రీ ప్ర‌యోజ‌నాలు ఉండేలా చూసుకోవడం మంచిది. 

నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రులు..
పాల‌సీ తీసుకునేట‌ప్పుడు ఎక్కువ నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రులు ఉన్న బీమా సంస్థ‌ను ఎంచుకోవ‌డం మేలు. ముఖ్యంగా పాల‌సీదారుడు నివాస‌ముంటున్న ప్రాంతానికి ద‌గ్గ‌ర‌లో నెట్‌వ‌ర్క్ ఆసుప్ర‌తి ఉండేలా చూసుకోవాలి. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌లో త్వ‌రిత‌గ‌తిన ఆసుప్ర‌తికి తీసుకెళ్ల‌గ‌ల‌గ‌డంతో పాటు న‌గ‌దు ర‌హిత సేవ‌ల‌ను అందించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. 

బీమా ప్రీమియం..
సాధారణంగా ఫ్యామిలీ ఫ్లోట‌ర్ ప్లాన్‌ లో పాల‌సీ ప్రీమియం పాల‌సీదారు వ‌య‌సుపై ఆధార‌ప‌డి ఉంటుంది. వ‌య‌సు కార‌ణంగా సీనియ‌ర్ సిటిజ‌న్ల పాల‌సీ ప్రీమియం ఎక్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల ఫ్యామిలీ ఫ్లోట‌ర్ ప్లాన్‌లో కాకుండా సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు విడిగా వ్య‌క్తిగత ఆరోగ్య బీమా తీసుకోవ‌డం మంచిది. 

ముందుగా నిర్ధార‌ణ‌యిన వ్యాధులు..
పాల‌సీ కొనుగోలుకు 48 నెల‌లు ముందుగా గుర్తించిన వ్యాధులు ముందుగా నిర్ధార‌ణ అయిన వ్యాధుల కింద‌కి వ‌స్తాయి. కొన్ని పాల‌సీలు కాస్త అధిక ప్రీమియం తో ర‌క్త‌పోటు, మధుమేహ్యం వంటి ముందుగా నిర్ధార‌ణ అయిన వ్యాధుల‌కు కూడా క‌వ‌రేజ్‌ను అందిస్తాయి. వీటి కవరేజీ ఉండడం వల్ల ఇలాంటి అనారోగ్యాల మూలకారణం చేత ఏదైనా క్లిష్ట సమస్యలు వచ్చినా అది కవర్ చేయబడతాయి.

చివ‌రిగా..
సీనియ‌ర్ సిటిజ‌న్స్‌ ఆరోగ్య బీమా పాల‌సీని ఎంచుకున్న‌ప్పుడు పైన పేర్కొన్న అంశాలే కాకుండా, క్లెయిమ్ త‌ర్వాత క‌వ‌రేజ్‌ పునరుద్ధరణ, జీరో డిడక్టిబుల్‌, ఎయిర్ అంబులెన్స్ క‌వ‌ర్‌, హామీ మొత్తాన్ని పెంచుకునేందుకు టాప్ అప్‌, సూపర్ టాప్ అప్‌ వంటి విష‌యాల‌పై కూడా దృష్టి పెట్టాలి. కొన్ని కంపెనీలు మొద‌ట్లో త‌క్కువ ప్రీమియం వ‌సూలు చేసినా నిర్దిష్ట వ‌య‌స్సు దాటిన త‌ర్వాత ప్రీమియం పెంచ‌వ‌చ్చు. వీటి గురించి కూడా తెలుసుకోవాలి. పాల‌సీ తీసుకునేముందు పాల‌సీ ప‌త్రాల‌ను క్షుణ్ణంగా చ‌ద‌వాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని