Fixed Deposits: సీనియ‌ర్ సిటిజ‌న్స్ స్పెష‌ల్ ఎఫ్‌డీ స్కీమ్‌లో పెట్టుబ‌డులు పెట్టొచ్చా?

సీనియ‌ర్ సిటిజ‌న్లకు సాధార‌ణ ఎఫ్‌డీల‌లో ల‌భించే వ‌డ్డీ రేట్ల కంటే స్పెష‌ల్ ఎఫ్‌డీ స్కీమ్‌లో అధిక వ‌డ్డీ ల‌భిస్తుంది. 

Updated : 10 Dec 2021 16:13 IST

సీనియ‌ర్ సిటిజ‌న్లు ఎక్కువ‌గా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో మ‌దుపు చేసేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. కార‌ణం ఖ‌చ్చిత‌మైన వ‌డ్డీ ఆదాయం, అలాగే న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా ఉండ‌డం. అయితే గ‌త ఏడాది క‌రోనా ప‌రిస్థితుల కార‌ణంగా వ‌డ్డీ రేట్లు భారీగా త‌గ్గాయి. ఈ నేప‌థ్యంలో సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఊర‌టనిచ్చేందుకు ప్ర‌భుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐతో పాటు మ‌రికొన్ని బ్యాంకులు అధిక వ‌డ్డీ రేట్ల‌తో ప్ర‌త్యేక‌ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను తీసుకొచ్చాయి. మ‌రి ఈ స్పెష‌ల్ డిపాజిట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టొచ్చా?ఎస్‌బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలు అందించే స్పెష‌ల్ డిపాజిట్ స్కీమ్‌లు, తాజా వ‌డ్డీ రేట్ల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

"ఎస్‌బీఐ వియ్‌కేర్" డిపాజిట్ స్కీమ్‌..
సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం 'ఎస్‌బీఐ వియ్‌కేర్‌' పేరుతో ప్ర‌త్యేక డిపాజిట్ ప‌థ‌కాన్ని ఎస్‌బీఐ అందిస్తోంది. ఐదేళ్లు, అంత‌కంటే ఎక్కువ కాల‌ప‌రిమితితో డిపాజిట్ చేసిన సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు.. సాధార‌ణంగా వ‌ర్తించే వ‌డ్డీ రేటు కంటే 30 బేసిస్ పాయింట్లు, సాధార‌ణ‌ ప్ర‌జ‌ల‌కు వ‌ర్తించే రేటు కంటే 80 బేసిస్ పాయింట్లు (బీపీఎస్‌) అద‌న‌పు వ‌డ్డీ ల‌భిస్తుంది. ప్ర‌స్తుతం ఎస్‌బీఐ సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు 5 ఏళ్ల కాల‌ప‌రిమితి గ‌ల‌ ఎఫ్‌డీపై 5.4 శాతం వ‌డ్డీ రేటు ఆఫ‌ర్ చేస్తుండ‌గా, సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ప్ర‌త్యేక ఎఫ్‌డీ ప‌థ‌కంలో చేసిన డిపాజిట్ల‌కు 6.20 శాతం వ‌డ్డీ అందిస్తోంది.

ఐసిఐసిఐ బ్యాంక్ స్పెష‌ల్ ఎఫ్‌డీ స్కీమ్‌..
సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం..ఐసిఐసిఐ బ్యాంక్, గోల్డెన్‌ ఇయ‌ర్స్ పేరుతో ఈ ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఇచ్చే వ‌డ్డీ రేటు కంటే 70 బేసిస్ పాయింట్లు అద‌న‌పు వ‌డ్డీని అందిస్తుంది. ఈ ప‌థ‌కం ద్వారా అందించే ప్ర‌స్తుత వార్షిక వ‌డ్డీ రేటు 6.30 శాతం. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌..
"హెచ్‌డీఎఫ్‌సీ సీనియ‌ర్ సిటిజ‌న్ కేర్" పేరుతో స్పెష‌ల్ ఎఫ్‌డీ ప‌థ‌కాన్ని సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు సాధార‌ణంగా ఇచ్చే వ‌డ్డీ రేటు కంటే 25 బేసిస్ పాయింట్ల అద‌నంగా ఆఫ‌ర్ చేస్తుంది. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అందించేదానికంటే 75 బేసిస్ పాయింట్లు మేర‌ అధిక వ‌డ్డీ రేటును ఇస్తుంది. ఈ డిపాజిట్ల‌పై ప్ర‌స్తుతం వ‌ర్తించే వ‌డ్డీ రేటు 6.25 శాతం.

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా..
సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఈ డిపాజిట్ల‌పై 100 బేసిస్ పాయింట్లు అధికంగా వ‌డ్డీ అందిస్తుంది. ప్ర‌త్యేక ఎఫ్‌డీ ప‌థ‌కం కింద (5 సంవ‌త్స‌రాల నుండి 10 సంవ‌త్స‌రాల వ‌ర‌కు) వ‌ర్తించే వ‌డ్డీ రేటు 6.25 శాతం ఉంటుంది.

బ్యాంకులు అందించే స్పెష‌ల్ డిపాజిట్ స్కీమ్‌లు పెద్ద‌ల‌కు లాభ‌దాయ‌క‌మేనా?
సాధార‌ణ ఎఫ్‌డి ప‌థ‌కాలు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 50 బేసిస్ పాయింట్ల‌ (బీపీఎస్‌) మేర అద‌న‌పు వ‌డ్డీని అందిస్తాయి. ప్ర‌త్యేక ఎఫ్‌డీ స్కీమ్ దానిపైన అద‌న‌పు వ‌డ్డీ రేటును అందిస్తుంది. వడ్డీ రేట్లు త‌క్కువ‌గా ఉన్న‌ ఈ స‌మ‌యంలో ఈ ప‌థ‌కం ద్వారా ఎక్కువ వ‌డ్డీ ల‌భిస్తున్నప్ప‌టికీ, 5 సంవత్సరాల సుదీర్ఘ కాలం డబ్బును లాక్ చేయ‌డం మంచి ఆలోచన కాద‌ని నిపుణ‌ల అభిప్రాయం.

వీటి స్థానంలో సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్‌, లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేష‌న్ వ‌యో వంద‌న యోజ‌న,  పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్‌, ఫ్లోటింగ్ రేట్ బాండ్లును ఎంచుకోవ‌చ్చు. 
స్పెష‌ల్ డిపాజిట్ స్కీమ్‌ల కంటే ఎక్కువ వ‌డ్డీ రేటు అందుస్తున్న ప‌థకాలు, వ‌డ్డీ రేట్లు..
సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్... 7.4 శాతం
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్  ... 6.6 శాతం
5 ఏళ్ల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ... 6.7 శాతం
ప్ర‌ధాన‌మంత్రి వ‌యోవంద‌న యోజ‌న ... 7.4 శాతం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని