Sensex Analysis: 78500-78900 ఎగువన లాభాలే!

సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం దేశీయ సూచీలు జీవనకాల తాజా గరిష్ఠాలకు చేరాయి. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనే గణాంకాలకు తోడు బడ్జెట్‌పై అంచనాలు మెరుగవ్వడం, రుతుపవనాలు పుంజుకోవడం కలిసొచ్చాయి.

Published : 08 Jul 2024 01:52 IST

సమీక్ష: సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం దేశీయ సూచీలు జీవనకాల తాజా గరిష్ఠాలకు చేరాయి. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనే గణాంకాలకు తోడు బడ్జెట్‌పై అంచనాలు మెరుగవ్వడం, రుతుపవనాలు పుంజుకోవడం కలిసొచ్చాయి. దేశీయంగా చూస్తే.. హెచ్‌ఎస్‌బీసీ తయారీ పీఎంఐ జూన్‌లో 58.3 పాయింట్లుగా నమోదైంది. మేలో కీలక రంగాలు 6.3% వృద్ధి నమోదుచేశాయి. జూన్‌లో వాహన రిటైల్‌ విక్రయాలు ఏడాది క్రితం ఇదే నెలతో పోలిస్తే 0.73 శాతమే పెరిగాయి. కార్పొరేట్‌ వార్తలు, ప్రభుత్వ ప్రకటనలతో షేరు/రంగం ఆధారిత కదలికలు మార్కెట్లను నడిపించాయి. బ్యారెల్‌ ముడిచమురు 0.2% లాభంతో 86.5 డాలర్లకు చేరింది. అమెరికాలో నిల్వలు తగ్గడం, భౌగోళిక పరిస్థితులు చమురు ధరలపై ప్రభావం చూపాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.34 నుంచి 83.49కు చేరింది. అంతర్జాతీయంగా చూస్తే.. వడ్డీ రేట్ల కోతలను ప్రారంభించేందుకు మరింత సానుకూల గణాంకాలు కావాలని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ పావెల్‌ పునరుద్ఘాటించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, అంచనాల కంటే అధికంగా జూన్‌లో 2,06,000 కొత్త ఉద్యోగాలు సృష్టించింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 1.2% లాభంతో 79,997 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 1.3% పెరిగి 24,324 పాయింట్ల దగ్గర స్థిరపడింది. రంగాల వారీ సూచీల్లో ఐటీ, యంత్ర పరికరాలు, ఆరోగ్య సంరక్షణ లాభపడగా.. మన్నికైన వినిమయ వస్తువులు, వాహన, బ్యాంకింగ్‌ షేర్లు నష్టపోయాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.7,278 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, డీఐఐలు రూ.385 కోట్ల షేర్లను విక్రయించారు. ఈ నెలలో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ.7,962 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 5:4గా నమోదు కావడం..
 పెద్ద షేర్లలో కొనుగోళ్లను సూచిస్తోంది. 

ఈ వారంపై అంచనా: గత వారం 80,392 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసిన సెన్సెక్స్, లాభాల్లో ముగిసింది. స్వల్పకాలంలో 78,500- 78,900 పాయింట్ల ఎగువన ట్రేడైతే.. సానుకూల ధోరణి కొనసాగే అవకాశం ఉంది. ఈ స్థాయి దిగువన ముగిస్తే స్థిరీకరణకు ఆస్కారం ఉంటుంది.

ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దేశీయ సూచీలు సంకేతాలు తీసుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థ గణాంకాలు, బడ్జెట్‌పై అంచనాలు ప్రభావం చూపొచ్చు. మార్కెట్లు గరిష్ఠ స్థాయులకు చేరడంతో కొంత ఒడుదొడుకులకు అవకాశం ఉండొచ్చు. ఈ వారం టీసీఎస్, హెచ్‌సీఎల్‌ టెక్, టాటా ఎలెక్సీ, ఐఆర్‌ఈడీఏ, డీమార్ట్‌ త్రైమాసిక ఫలితాలు వెలువడనున్నాయి. ఆయా యాజమాన్యాల వ్యాఖ్యలను గమనించాలి. షేరు/రంగం ఆధారిత కదలికలు మార్కెట్లను నడిపించొచ్చు. రుతుపవనాల పురోగతి కీలకం కానుంది. జూన్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణం, టోకు ద్రవ్యోల్బణం, మే పారిశ్రామికోత్పత్తి గణాంకాలపై కన్నేయొచ్చు. అంతర్జాతీయంగా.. బ్రిటన్‌ కొత్త ప్రభుత్వ నిర్ణయాలు, ఫ్రాన్స్‌ ఎన్నికల తుది ఫలితాలు ప్రభావం చూపొచ్చు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ పావెల్‌ ఈనెల 9న వెల్లడించనున్న అభిప్రాయాలను గమనించాలి. అమెరికా - చైనా ద్రవ్యోల్బణం, బ్రిటన్‌ జీడీపీ గణాంకాలు విడుదల కానున్నాయి. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడుల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు. చమురు ధరలు మరింత పెరిగితే మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం పడొచ్చు. 

తక్షణ మద్దతు స్థాయులు: 78,905, 78,467, 77,800
తక్షణ నిరోధ స్థాయులు: 80,600, 81,000, 81,600 
సెన్సెక్స్‌ 78,500- 78,900 ఎగువన ట్రేడైతే లాభాలు కొనసాగొచ్చు. 

సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు