Stock Market: స్వల్పనష్టాల్లో మార్కెట్‌ సూచీలు

స్టాక్‌మార్కెట్ సూచీలు నేడు అప్రమత్తంగా ట్రేడవుతున్నాయి. ఉదయం నుంచి సూచీలు లాభనష్టాల మధ్య దోబూచులాడుతున్నాయి. 

Published : 09 Mar 2023 09:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్‌(stock market) సూచీలు మిశ్రమంగా  ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.23 సమయంలో సెన్సెక్స్‌(BSE) 90 పాయింట్ల నష్టంతో 60,251 వద్ద, నిఫ్టీ (NSE)18 పాయింట్ల నష్టంతో 17,735 వద్ద ట్రేడవుతున్నాయి. తొలుత లాభాల్లోకి వెళ్లిన సూచీలు మళ్లీ నష్టాల్లోకి జారుకొన్నాయి. సీక్వెంట్‌ సైంట్‌ఫిక్‌, అదానీ విల్మర్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌ షేర్ల విలువ పెరిగింది.  హోం ఫస్ట్‌ ఫైనాన్స్‌, డిష్‌టీవీ, క్రిసిల్‌ షేర్ల విలువ కుంగింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసలు విలువ కోల్పోయి రూ. 81.89 వద్ద కొనసాగుతోంది.  

* ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) నాలుగో త్రైమాసికంలో (జనవరి-మార్చి) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 4 శాతంగా నమోదు కావొచ్చని ఇండియా రేటింగ్స్‌ అంచనా వేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి దేశ జీడీపీ వృద్ధి రేటు, ప్రభుత్వ అంచనా అయిన 7% కంటే తక్కువగా నమోదు కావొచ్చని పేర్కొంది.

* స్టాక్‌ మార్కెట్‌ ద్వారా ‘ఓపెన్‌ మార్కెట్‌’ పద్ధతిలో షేర్ల బైబ్యాక్‌ చేపట్టదలచిన కంపెనీలకు కొత్త నిబంధనలను సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా) నిర్దేశించింది. ఈ నిబంధనలు నేటి నుంచే అమల్లోకి వస్తున్నాయి. 

నేడు గమనించాల్సిన షేర్లు..

* ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్‌) చేయాలని నాట్కో ఫార్మా డైరెక్టర్ల బోర్డు బుధవారం నిర్ణయించింది. ‘ఓపెన్‌ మార్కెట్‌’ పద్ధతిలో స్టాక్‌మార్కెట్ల ద్వారా ఈక్విటీ షేర్లను వెనక్కి కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. ఒక్కో షేరును గరిష్ఠంగా రూ.700 ధర వరకు కొనుగోలు చేస్తారు. 

*  మల్టిపుల్‌ మైలోమా అనే కేన్సర్‌ వ్యాది చికిత్సలో వినియోగించే లెనలిడోమైడ్‌ కేప్సూల్స్‌ను అరబిందో ఫార్మా అమెరికాలో విక్రయించనుంది. ఈ ఔషధానికి తన అనుబంధ సంస్థ అయిన యూగియా ఫార్మా స్పెషాలిటీస్‌, యూఎస్‌ఎఫ్‌డీఏ (అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ) నుంచి తుది అనుమతి తీసుకున్నట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది.

*  అదానీ గ్రూప్‌లో జీక్యూజీ మరిన్ని పెట్టుబడులు: అదానీ గ్రూప్‌లో మరిన్ని పెట్టుబడులు పెడతామని అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే జీక్యూజీ పార్టనర్స్‌ వ్యవస్థాపకుడు రాజీవ్‌ జైన్‌ తెలిపారు. మరిన్ని పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులపై ప్రతిఫలాల ఆధారంగా ముందుకు వెళ్లనున్నట్లు జైన్‌ వివరించారు. 

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర డివిడెండ్‌ ప్రతిపాదనను పరిశీలించేందుకు ఈ నెల 13న గెయిల్‌ బోర్డు సమావేశం కానుంది. డివిడెండ్‌కు ఆమోదం లభిస్తే, మార్చి 21ను రికార్డు తేదీగా నిర్ణయించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని