Stock Market: ఆర్‌బీఐ నిర్ణయాల వేళ మార్కెట్‌ సూచీల్లో అప్రమత్తత!

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి...

Published : 30 Sep 2022 09:36 IST

ముంబయి: నేడు ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెలువడనున్న వేళ దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలు సైతం నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. కీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ మరో 50 బేసిస్‌ పాయింట్లు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:22 గంటల సమయానికి సెన్సెక్స్‌ 118 పాయింట్ల నష్టంతో 56,291 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 21 పాయింట్లు కోల్పోయి 16,796 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.52 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌, టైటన్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌, విప్రో, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

నేడు గమనించాల్సిన స్టాక్స్‌...

హీరో మోటోకార్ప్‌: అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న జీరో మోటార్‌సైకిల్స్‌తో హీరో మోటోకార్ప్‌ భాగస్వామ్యం కుదుర్చుకొంది. ఇరు కంపెనీలు కలిసి ఖరీదైన విద్యుత్తు ద్విచక్రవాహనాలు, వాటి పవర్‌ట్రెయిన్‌లను తయారు చేయనున్నాయి. ఈ మేరకు జీరో మోటార్‌సైకిల్స్‌లో 60 మిలియన్‌ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు పెట్టేందుకు హీరో మోటోకార్ప్‌ బోర్డు ఆమోదం తెలిపింది.

పీఎన్‌బీ: ‘ఆస్తుల పునర్‌వ్యవస్థీకరణ కంపెనీ ఇండియా లిమిటెడ్‌ (ARCIL)’లో ఉన్న తమ మొత్తం 10.01 శాతం వాటాలను విక్రయించాలని ‘పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB)’ నిర్ణయించింది.

రైల్‌ వికాస్‌ నిగమ్‌: ఆంధ్రప్రదేశ్‌లోని సామర్లకోట నుంచి అచ్చంపేట జంక్షన్‌ వరకు 4 వరుసల రహదారి నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టును ఎన్‌హెచ్‌ఏఐ నుంచి రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది.

టాటా కమ్యూనికేషన్స్‌: పుణెలో టాటా కమ్యూనికేషన్స్‌ ప్రైవేట్‌ 5జీ గ్లోబల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ప్రారంభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని