Stock Market: ఏడోరోజూ తప్పని నష్టాలు.. 56,400కు సెన్సెక్స్‌!

Stock Market Closing Bell: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి...

Updated : 29 Sep 2022 16:08 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలకు వరుసగా ఏడో రోజూ నష్టాలు తప్పలేదు. ఉదయం అంతర్జాతీయ సంకేతాల మధ్య భారీ లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించినప్పటికీ గరిష్ఠాల వద్ద అమ్మకాలతో మధ్యాహ్నానికి పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. రేపు ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెలువడనున్నాయి. దీంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. మరోవైపు రూపాయి పతనం, మాంద్యం, ద్రవ్యోల్బణ ప్రభావం మార్కెట్లపై ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం యూఎస్‌ ఫ్యూచర్స్‌ భారీ నష్టాల్లోకి జారుకోవడం కూడా సూచీలపై ప్రభావం చూపింది.

సెన్సెక్స్‌ ఉదయం 56,997.90 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 57,166.14 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని.. 56,314.05 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 188.32 పాయింట్ల నష్టంతో 56,409.96 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 40.50 పాయింట్లు కోల్పోయి 16,818.10 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,026.05- 16,788.60 పాయింట్ల మధ్య కదలాడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.81.88 వద్ద నిలిచింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 15 షేర్లు లాభపడ్డాయి. ఐటీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఏషియన్‌ పెయింట్స్‌, టెక్ మహీంద్రా, టైటన్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, విప్రో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర సంగతులు..

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు ఈరోజు ఇంట్రాడేలో రూ.2,315.55 దగ్గర ఆరు నెలల కనిష్ఠానికి చేరాయి. ఈవారంలో షేరు ధర 7 శాతానికిపైగా కుంగింది. ఈరోజు చివరకు షేరు విలువ 0.19శాతం నష్టంతో రూ.2,328 వద్ద స్థిరపడింది.

సన్‌ఫార్మా షేరు గత రెండు రోజుల్లో 7 శాతానికి పైగా ఎగబాకి రూ.954.25 వద్ద ఐదు నెలల గరిష్ఠానికి చేరింది. భవిష్యత్తు వృద్ధిపై సానుకూల అంచనాల నేపథ్యంలోనే షేర్లు ర్యాలీ అవుతున్నాయి. చివరకు 1.54 శాతం లాభంతో రూ.932 వద్ద ముగిసింది.

అదానీ గ్రీన్‌ ఎనర్జీ విలువ పెరిగిన నేపథ్యంలో తమ 20 శాతం వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించే యోచనలో ఉన్నట్లు టోటల్‌ఎనర్జీస్‌ ఎస్‌ఈ ప్రకటించింది. దీంతో ఈరోజు అదానీ గ్రీన్‌ షేరు 3.03 శాతం కుంగి రూ.1,989 వద్ద స్థిరపడింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని