Stock Market Opening bell: నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market Opening bell: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి...

Published : 18 Aug 2022 09:40 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. బుధవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. జులై నెల ఫెడరల్‌ రిజర్వు సమావేశం మినిట్స్‌ నిన్న విడుదలయ్యాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకరంగానే ఉందని ఫెడ్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో రేట్ల పెంపు ఇంకా కొనసాగుతుందని తేల్చి చెప్పింది. అయితే, పరిస్థితులకు అనుగుణంగా రేట్ల పెంపు వేగం తగ్గే అవకాశం ఉందని తెలిపింది. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు సైతం నేడు అప్రమత్తంగా ట్రేడవుతున్నాయి. మరోవైపు గతకొన్ని రోజుల వరుస లాభాల నేపథ్యంలో మదుపర్లు కీలక కౌంటర్లలో లాభాల స్వీకరణకు దిగడం కూడా సూచీలపై ప్రభావం చూపుతోంది.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:31 గంటల సమయానికి సెన్సెక్స్‌ 270 పాయింట్ల నష్టంతో 59,983 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 63 పాయింట్లు నష్టపోయి 17,880 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.64 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఐటీసీ, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, మారుతీ, టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టైటన్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ఫార్మా, విప్రో, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌, టెక్‌ మహీంద్రా, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని