Stock Market: లాభాల జైత్రయాత్రకు బ్రేక్‌.. 18,700 దిగువకు నిఫ్టీ!

Stock Market: వరుసగా 8 రోజుల పాటు దూసుకెళ్లిన సూచీలు ఈరోజు విరామం తీసుకున్నాయి. నిఫ్టీ 18,700 దిగువకు చేరింది.

Published : 02 Dec 2022 15:51 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుస ఎనిమిది రోజుల లాభాల నుంచి శుక్రవారం విరామం తీసుకున్నాయి. ఉదయమే నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. మరోవైపు వరుస లాభాల నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాలను స్వీకరించారు. మరోవైపు ఆటో, బ్యాంకింగ్‌ వంటి కీలక రంగాల్లో విక్రయాలు కూడా సూచీల కుంగుబాటుకు దోహదం చేశాయి.

చివరకు సెన్సెక్స్‌ 415.69 పాయింట్ల నష్టంతో 62,868.50 వద్ద ముగిసింది. నిఫ్టీ 116.40 పాయింట్లు నష్టపోయి 18,696.10 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.33 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌30 సూచీలో 09 షేర్లు లాభపడ్డాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్‌, మారుతీ, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, పవర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ఫార్మా, టీసీఎస్‌ షేర్లు నష్టపోయాయి. 

మార్కెట్‌లోని మరిన్ని విశేషాలు..

తెలంగాణలో రూ.9,500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అమరరాజా బ్యాటరీస్‌ అవగాహనా ఒప్పందం కుదుర్చుకొంది. దీంతో కంపెనీ షేరు ఈరోజు 1.06 శాతం పెరిగి రూ.652.60 వద్ద స్థిరపడింది.

వీనస్‌ పైప్స్‌ షేరు ఈరోజు 5.10 శాతం పెరిగి రూ.715 వద్ద స్థిరపడింది. హిమాలయన్‌ ఫైనాన్స్‌ ఓపెన్‌ మార్కెట్‌లో 5 మిలియన్ల షేర్లను కొనుగోలు చేయడమే ర్యాలీకి కారణం.

టాటా స్టీల్‌ గత నాలుగు రోజుల్లో 6 శాతానికి పైగా పెరిగి 3 నెలల గరిష్ఠానికి చేరింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉక్కు ఎగుమతులపై సుంకాన్ని తొలగించిన విషయం తెలిసిందే. ఈరోజు స్టాక్‌ ధర 1 శాతం పెరిగి రూ.111.95 వద్ద స్థిరపడింది.

బ్లాక్‌ డీల్‌ ద్వారా 5 శాతం షేర్లు చేతులు మారిన నేపథ్యంలో పాలసీబజార్‌ మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్‌ షేరు ఇంట్రాడేలో 6 శాతానికి పైగా పెరిగింది. చివరకు 5.10 శాతం లాభంతో రూ.485.60 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు