Stock Market: ఆరోరోజూ ఆగని అమ్మకాలు.. 16,850కి నిఫ్టీ!

Stock Market Closing Bell: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి...

Updated : 28 Sep 2022 15:59 IST

 

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా ఆరోరోజూ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య ఉదయం నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు మధ్యలో కాసేపు లాభాల్లోకి ఎగబాకినప్పటికీ.. అమ్మకాల సెగతో చివరకు నష్టాలు మూటగట్టుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం భయాలు, రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం సూచీలను కలవరపెడుతున్నాయి. ఉదయం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల అండతో లాభాల్లోకి పుంజుకున్నాయి. కానీ, వెంటనే అప్రమత్తమైన మదుపర్లు గరిష్ఠాల వద్ద అమ్మేసి లాభాలను స్వీకరించేశారు. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ సైతం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.

* సెన్సెక్స్‌ ఉదయం 56,710.13 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 57,213.33 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని.. 56,485.67 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 509.24 పాయింట్ల నష్టంతో 56,598.28 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 148.80 పాయింట్లు కోల్పోయి 16,858.60 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,037.60- 16,820.40 పాయింట్ల మధ్య కదలాడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 12 షేర్లు లాభపడ్డాయి. ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌, ఎంఅండ్‌ఎం, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, రిలయన్స్‌, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎన్‌టీపీసీ, టైటన్‌ అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

* ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు ఇంట్రాడేలో 3 శాతానికి పైగా రాణించి ఎనిమిది నెలల గరిష్ఠానికి చేరాయి. ముడి సరకుల ధరలు తగ్గడంతో లాభాలు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు షేరు రాణింపునకు దోహదం చేసింది. చివరకు 2.80 శాతం లాభపడి రూ.3,568 వద్ద స్థిరపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని