Stock Market: నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు ఈవారం ఆఖరి రోజును నష్టాలతో ప్రారంభించాయి.

Published : 02 Dec 2022 09:40 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు గత ఎనిమిది రోజుల వరుస లాభాల నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాలను స్వీకరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. చైనాలో కొవిడ్‌ ఆంక్షల్ని సడలిస్తున్నప్పటికీ.. ఆసియా- పసిఫిక్‌ సూచీలు నేడు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అమెరికా ఫ్యూచర్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ఉన్నాయి. అయితే, నవంబరులో బలమైన వాహన విక్రయాలు, జీఎస్టీ వసూళ్లు, తయారీ పుంజుకోవడం వంటి దేశీయ సానుకూల పరిణామాలు సూచీలకు కనిష్ఠాల వద్ద మద్దతుగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్‌ 256 పాయింట్ల నష్టంతో 63,027 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 71 పాయింట్లు నష్టపోయి 18,740 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.10 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌ లాభాల్లో ఉన్నాయి. మారుతీ, హెచ్‌యూఎల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టీసీఎస్‌, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎప్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

గమనించాల్సిన స్టాక్స్‌...

పీబీ ఫిన్‌టెక్‌: పాలసీబజార్‌ మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌ 5 శాతం వాటాలను బ్లాక్‌ డీల్‌ ద్వారా విక్రయించే యోచనలో ఉంది.

ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా, ఆర్‌ఐఎల్‌: దేశీయంగా ఉత్పత్తి చేసిన ముడి చమురుతో పాటు డీజిల్‌ ఎగుమతులపై విధించిన అదాటు (విండ్‌ఫాల్‌) లాభాల పన్నును ప్రభుత్వం తగ్గించింది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై  పన్నును టన్నుకు రూ.5,300 తగ్గించి రూ.4,900కు పరిమితం చేసింది. లీటర్‌ డీజిల్‌ ఎగుమతిపై రూ.10.50 గా ఉన్న పన్నును రూ.2.50 తగ్గించి, రూ.8కి పరిమితం చేసింది.

విమానయాన స్టాక్స్‌: అంతర్జాతీయంగా ముడిచమురు ధర తగ్గినందున, దేశీయంగా విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరను 2.3 శాతం తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు గురువారం ప్రకటించాయి.

ఆటో స్టాక్స్‌: గతంలో ఎప్పుడూ లేనన్ని కార్ల విక్రయాలు ఈ ఏడాది నవంబరులో నమోదయ్యాయి. దిగ్గజ వాహన సంస్థలైన మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్‌, టాటా మోటార్స్‌, మహీంద్రా విక్రయాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. కియా ఇండియా అత్యధికంగా 69% వృద్ధిని నమోదు చేసింది. మహీంద్రా, హోండా కార్స్‌, స్కోడా, ఎంజీ మోటార్‌ కూడా బలమైన విక్రయాలను నమోదు చేశాయి.

ఎన్‌ఎమ్‌డీసీ: ఎన్‌ఎమ్‌డీసీకి చెందిన నాగర్నార్‌ స్టీల్‌ ప్లాంటు వ్యూహాత్మక విక్రయానికి ప్రాథమిక బిడ్లకు ప్రభుత్వం గురువారం ఆహ్వానం పలికింది. బిడ్ల దాఖలుకు ఆఖరు తేదీ 2023 జనవరి 27గా నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని