Stock Market: స్వల్ప నష్టాల్లో మార్కెట్‌ సూచీలు ప్రారంభం

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న మిశ్రమ సంకేతాలతో దేశీయ సూచీలు స్వల్పనష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. 

Published : 25 Apr 2023 09:38 IST

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్‌ (Stock Market) సూచీలు నేడు స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం సూచీలపై కనిపిస్తోంది. ఉదయం 9.28 సమయంలో సెన్సెక్స్‌ (BSE) 31 పాయింట్ల నష్టంతో 60,024 వద్ద, నిఫ్టీ (NSE) 14 పాయింట్ల నష్టంతో 17,728 వద్ద ట్రేడవుతున్నాయి. మిర్జా ఇంటర్నేషనల్‌, జొమాటో, గ్లాండ్‌ ఫార్మా, రైల్‌ వికాస్‌ నిగమ్‌, ఇండియా బుల్స్‌ షేర్లు లాభాల్లో ఉండగా..  క్రామ్టన్‌ గ్రీవ్స్‌, ఇప్కా ల్యాబొరేటరీస్‌, ఈకేఐ ఎనర్జీ సర్వీస్‌, బ్రైట్‌కామ్‌ గ్రూప్‌, సింధూ ట్రేడ్‌ లింక్‌ షేర్ల ధరలు కుంగాయి. ఆసియా పసిఫిక్‌ మార్కెట్లు నేడు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిసిన ప్రభావం వీటిపై పడింది. నిన్నటి ట్రేడిండ్‌లో అమెరికాలోని నాస్‌డాక్‌ సూచీ 0.29శాతం తగ్గగా.. డోజోన్స్‌ సూచీ 0.2శాతం, ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.09శాతం పతనమైంది.  జపాన్‌కు చెందిన నిక్కీ మాత్రమే 0.54శాతం లాభాల్లో ఉంది. దక్షిణ కొరియా, హాంకాంగ్‌ మార్కెట్లు నష్టాల్లో ఉండగా.. చైనా సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

కార్పొరేట్‌ రంగంలో ముఖ్య పరిణామాలు..

* హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ కంపెనీకు గ్రిహా పీటీఈలో షేర్లను కొనుగోలు చేయడానికి మానిటరీ అథారిటీ ఆఫ్‌ సింగపూర్‌ నుంచి అనుమతి లభించింది.

* కేంద్రీయ పోలీసు కల్యాణ్‌ భండార్‌ (కేపీకేబీ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు టాటా మోటార్స్‌ సోమవారం వెల్లడించింది. ఇందువల్ల దేశవ్యాప్తంగా 34 లక్షల మందికి పైగా పోలీసులు ప్రత్యేక ధరలకు టాటా వాహనాలను కొనుగోలు చేసుకునేందుకు వీలవుతుంది.

* బిహార్‌లోని దాదాపు 13 లక్షల గృహాలకు నేరోబ్యాండ్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ఇచ్చేలా భారతీ ఎయిర్‌ టెల్‌ సంస్థ సెక్యూర్‌ మీటర్స్ సంస్థతో ఒప్పందం చేసుకొంది.

* విల్‌స్పన్‌ ఇండియా ఏప్రిల్‌ 27న బోర్డు సమావేశంలో షేర్ల బైబ్యాక్‌ అంశాన్ని చర్చించనుంది.

* ఎబిక్స్‌ ఇంక్‌ భారత అనుబంధ సంస్థ ఎబిక్స్‌ క్యాష్‌, స్పెషాలిటీ రసాయనాల సంస్థ సర్వైవల్‌ టెక్నాలజీస్‌ ఐపీఓలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి లభించింది. ఐపీఓ ద్వారా ఎబిక్స్‌ క్యాష్‌ రూ.6000 కోట్లు, సర్వైవల్‌ టెక్నాలజీస్‌ రూ.1000 కోట్లు సమీకరించాలని భావిస్తున్నాయి. ఈ రెండు సంస్థలు 2022 మార్చి- డిసెంబరు మధ్య ముసాయిదా పత్రాలు దాఖలు చేశాయి.

* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో పునరుత్పాదక ఇంధన విభాగం రిలయన్స్‌ న్యూ ఎనర్జీని విలీనం చేయాలన్న ప్రతిపాదనలను కంపెనీ విరమించుకుంది. గత వారం బోర్డు సమావేశంలో వ్యాపార సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.

* సౌదీ అరేబియా చమురు దిగ్గజ సంస్థ ఆరామ్‌కోతో అవగాహనా ఒప్పందాన్ని దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కుదుర్చుకుంది. ఆరామ్‌కో ఉద్యోగులను డిజిటల్‌గా అనుసంధానించేందుకు కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని ఇన్ఫోసిస్‌ వినియోగించనుంది.

* క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జూమర్‌ ఎలక్ట్రికల్స్‌ ఎండీ, సీఈఓగా ప్రొమీత్‌ ఘోష్‌ నియమితులయ్యారు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌గా శంతను ఖోస్లా పదోన్నతి పొందారు.

* ఐపీఓకు ముందు యాంకర్‌ మదుపర్ల నుంచి రూ.1,298 కోట్లు సమీకరించినట్లు మ్యాన్‌కైండ్‌ ఫార్మా వెల్లడించింది. ఒక్కో షేరు రూ.1080 చొప్పున, 77 ఫండ్‌లకు 1.2 కోట్లకు పైగా షేర్లను కంపెనీ కేటాయించింది. నేడు ప్రారంభం కానున్న కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ.. 27న ముగియనుంది.

* మార్చి త్రైమాసికంలో రూ.840 కోట్ల నికరలాభాన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం) నమోదు చేసింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.355 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువ. నిరర్థక ఆస్తులకు కేటాయింపులు తగ్గడం, వడ్డీ ఆదాయం పెరగడమే ఇందుకు కారణం. 

*యునికెమ్‌ ల్యాబ్స్‌లో 33.38% వాటా కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ఇప్కా లేబొరేటరీస్‌ సోమవారం వెల్లడించింది. కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) నుంచి అనుమతి రాగానే ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఈ లావాదేవీ విలువ సుమారు రూ.1,034.06 కోట్లు. 

* ఎమ్‌జీ మోటార్‌లో వాటా సొంతం చేసుకోవడం కోసం సజ్జన్‌ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. బీవైడీ ఇండియాలోనూ వాటా కొనుగోలు అవకాశాలను ఈ కంపెనీ పరిశీలిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని