Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.

Published : 29 Nov 2022 09:38 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు సానుకూలంగా ట్రేడింగ్‌ను ప్రారంభించడం విశేషం. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర స్వల్పంగా పెరిగినప్పటికీ.. ఇంకా 85 డాలర్ల దిగువనే ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు సోమవారం భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. చైనాలో కొవిడ్‌ కేసుల విజృంభణ, కట్టడి కోసం అమలు చేస్తున్న కఠిన ఆంక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆసియా- పసిఫిక్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ 129 పాయింట్ల లాభంతో 62,634 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 42 పాయింట్లు ఎగబాకి 18,605 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.60 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో మారుతీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. టైటన్‌, హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్ రెడ్డీస్‌, సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు అత్యధికంగా లాభపడుతున్న వాటిలో ఉన్నాయి.

గమనించాల్సిన స్టాక్స్‌...

హెచ్‌సీఎల్‌ టెక్‌: స్విట్జర్లాండ్‌కు చెందిన నిర్వహణ, మరమ్మతు, ఓవర్‌హాల్‌ (ఎంఆర్‌ఓ) సేవల సంస్థ ఎస్‌ఆర్‌ టెక్నిక్స్‌ నుంచి కాంట్రాక్ట్‌ దక్కించుకున్నట్లు ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్‌ తెలిపింది. ఈ కాంట్రాక్టు కాలపరిమితి పలు ఏళ్ల పాటు ఉండనుంది. ఎస్‌ఆర్‌ టెక్నిక్స్‌ కార్యకలాపాలను డిజిటల్‌కు మార్చడానికి హెచ్‌సీఎల్‌ టెక్‌ తోడ్పడనుంది.

ఎయిర్‌లైన్స్‌ స్టాక్స్‌: ఎయిర్‌ట్రాఫిక్‌ కొవిడ్‌ మునుపటికి చేరిన నేపథ్యంలో ఆయా విమానయాన సంస్థలపై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది. గడిచిన వారంలో చివరి రెండు రోజుల్లో ఎయిర్‌ట్రాఫిక్‌ 4 లక్షలకు పైకి చేరడం విశేషం.

ఎన్‌బీసీసీ: గతంలో అమ్రపాలి గ్రూప్‌ పేరిట వ్యాపార కార్యకలాపాలు నిర్వహించిన నిర్మాణ సంస్థ నుంచి ఎన్‌బీసీసీకి రూ.271.62 కోట్ల ఆర్డర్ లభించింది.

మ్యాన్‌కైండ్‌ ఫార్మా: ప్రముఖ ఔషధ సంస్థ ఉపకర్మ ఆయుర్వేదలో మెజారిటీ వాటాలను మ్యాన్‌కైండ్‌ ఫార్మా సొంతం చేసుకుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు