Stock Market: సెన్సెక్స్‌కు 500 పాయింట్ల లాభం.. 17000 ఎగువకు నిఫ్టీ

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి...

Updated : 29 Sep 2022 09:39 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్‌లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ట్రేడింగ్‌ను లాభాలతో ప్రారంభించాయి. అమెరికా మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. పౌండ్‌ విలువను కాపాడి పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు బాండ్‌ మార్కెట్‌లో జోక్యం చేసుకుంటామన్న ‘బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌’ ప్రకటన అమెరికా మార్కెట్లు పుంజుకోవడానికి కారణమైంది. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు లాభాలతో ట్రేడవుతున్నాయి. మరోవైపు గతకొన్ని రోజుల భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:18 గంటల సమయానికి సెన్సెక్స్‌ 511 పాయింట్ల లాభంతో 57,110 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి 17,008 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.61 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌ షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. టాటా స్టీల్‌, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ఫార్మా, రిలయన్స్‌, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఎల్అండ్‌టీ షేర్లు అత్యధికంగా లాభపడుతున్న జాబితాలో ఉన్నాయి.

నేడు గమనించాల్సిన స్టాక్స్‌...

ఎస్సార్‌ షిప్పింగ్‌: విపిన్‌ జైన్‌ను సీఎఫ్‌ఓగా నియమించేందుకు ఎస్సార్‌ షిప్పింగ్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ఆయన నియామకం 2022 అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానుంది.

రామ్‌కో సిమెంట్స్‌: ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల వద్ద రామ్‌కో సిమెంట్స్‌ ఐదో సిమెంట్‌ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది.

అనుపమ్‌ రసాయన్‌ ఇండియా: ఈ కంపెనీ సెప్టెంబరు 28 నుంచి క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ ఇష్యూని ప్రారంభించింది. ఒక్కో షేరు ధరను రూ.762.88గా నిర్ణయించింది.

బ్లూడార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌: 2022తో పోలిస్తే వచ్చే ఏడాది షిప్పింగ్‌ ధరలను 9.6 శాతం పెంచనున్నట్లు బ్లూడార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని