Stock market: ఆగని దూకుడు.. ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి సెన్సెక్స్‌, నిఫ్టీ

అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో గతవారం లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు.. ఈ వారాన్ని అదే దూకుడుతో ప్రారంభించాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గడం, ప్రధాన కంపెనీల షేర్లు రాణించడంతో సోమవారం నాటి ట్రేడింగ్‌లో సూచీల పరుగు కొనసాగింది.

Updated : 28 Nov 2022 16:06 IST

ముంబయి: అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో గతవారం లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు.. ఈ వారాన్ని అదే దూకుడుతో ప్రారంభించాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గడం, ప్రధాన కంపెనీల షేర్లు రాణించడంతో సోమవారం నాటి ట్రేడింగ్‌లో సూచీల పరుగు కొనసాగింది. దీంతో సూచీలు జీవితకాల గరిష్ఠాలకు చేరాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లు మేర లాభపడగా.. నిఫ్టీ 18,550 ఎగువన ముగిసింది. చివర్లో లాభాల స్వీకరణకు మదుపరులు మొగ్గు చూపారు. డాలరుతో రూపాయి మారకం విలువ 81.66గా ఉంది.

చైనాలో జీరో కొవిడ్‌ పాలసీకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల కారణంగా ఆసియా షేర్లు ఈ ఉదయం స్తబ్ధుగా ప్రారంభమయ్యాయి. దీంతో మన సూచీలు సైతం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. కాసేపటికే కోలుకున్నాయి. చైనాను కొవిడ్‌ పట్టిపీడిస్తున్న వేళ ఆ దేశ చమురు దిగుమతులు తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు క్షీణించాయి. బ్యారెల్‌ క్రూడాయిల్‌ 2 డాలర్ల మేర క్షీణించడంతో మన సూచీలకు కలిసొచ్చే అంశంగా మారింది. దిగుమతులపై ప్రధానంగా ఆధారపడే మన దేశానికి ఇది ప్రయోజనం కలిగించే అంశంగా మారడంతో దేశీయ మార్కెట్లపై మదుపరుల్లో సానుకూలత ఏర్పడింది. అంతర్జాతీయంగా బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్ ధర 3.11 శాతం క్షీణించి 81.03 వద్ద ట్రేడవుతోంది.

ఉదయం 62,077 వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌.. తర్వాత లాభాల్లోకి వచ్చింది. ఓ దశలో 62,701.40 వద్ద ఆల్‌టైమ్‌ గరిష్ఠాన్ని తాకింది. చివరికి 211.16 పాయింట్ల లాభంతో 62,504.80 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 50 పాయింట్ల లాభంతో 18,562.75 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో రిలయన్స్‌ (3.48 శాతం), నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, విప్రో, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టపోయాయి. మొత్తం 2024 షేర్లు లాభపడగా.. 1458 షేర్లు క్షీణించాయి. 185 షేర్లలో ఎలాంటి మార్పూ లేదు. మెటల్‌ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణించాయి. పెట్రోలియం, పెయింట్స్‌ షేర్లు లాభపడ్డాయి.

  • డిసెంబర్‌ 1 నుంచి ధరలు పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్‌ ప్రకటించడంతో బీఎస్‌ఈలో ఆ కంపెనీ షేరు 2.38 శాతం లాభపడి రూ.2,771.50 వద్ద ముగిసింది.
Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు