Stock Market: నష్టాల నుంచి తేరుకుని.. కొత్త రికార్డుల్లో మార్కెట్‌ సూచీలు

Stock Market Closing Bell: దేశీయ మార్కెట్లు శుక్రవారం కొత్త రికార్డుల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 77వేల మార్క్‌కు కొద్ది దూరంలో నిలవగా.. నిఫ్టీ 23,400 పైన స్థిరపడింది.

Published : 14 Jun 2024 15:58 IST

Stock Market Closing Bell ముంబయి: స్టాక్‌ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలతో ఈ ఉదయం సూచీలు నష్టాలతో ప్రారంభమైనప్పటికీ.. దేశీయంగా కొనుగోళ్ల మద్దతు లభించడం మార్కెట్‌ (Stock Market) సెంటిమెంట్‌ను బలపర్చింది. ఫలితంగా సూచీలు జీవనకాల తాజా గరిష్ఠాలకు చేరాయి. సెన్సెక్స్‌ 77వేల మార్క్‌కు కొద్ది దూరంలో నిలవగా.. నిఫ్టీ 23,400 పైన స్థిరపడింది.

ఈ ఉదయం 76,912 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ (Sensex) కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఒక దశలో 76,549.05 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అయితే, మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు ఊపందుకోవడంతో సూచీలు తేరుకున్నాయి. నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పట్టాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 77,081 మార్క్‌ను తాకింది. చివరకు 181.87 పాయింట్లు లాభపడి 76,992.77 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిలో ముగిసింది.

జులై 22న కేంద్ర బడ్జెట్‌.. జులై 3న ఆర్థిక సర్వే..!

అటు నిఫ్టీ (Nifty) కూడా 23,334-23,490 పాయింట్ల మధ్య కదలాడింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 66.70 పాయింట్ల లాభంతో 23,465.60 వద్ద కొత్త రికార్డును తాకి స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు క్షీణించి 88.57గా ముగిసింది. ఐటీ మినహా దాదాపు అన్నిరంగాల షేర్లు రాణించాయి. ఆటో, టెలికాం, రియల్టీ, లోహ, హెల్త్‌కేర్‌ సూచీలు 0.5-1 శాతం మేర పెరిగాయి. నిఫ్టీలో ఐషర్‌ మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, అదానీ పోర్ట్స్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, టైటాన్‌ కంపెనీ షేర్లు లాభపడగా.. టీసీఎస్‌ టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో, నెస్లే షేర్లు నష్టపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని