Stock Market: సూచీలకు ‘ఫెడ్‌’ భయాలు.. రెండురోజుల లాభాలకు బ్రేక్‌!

వరుసగా రెండురోజుల పాటు భారీగా లాభపడ్డ దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నెమ్మదించాయి.....

Updated : 22 Apr 2022 15:56 IST

ముంబయి: వరుసగా రెండురోజుల పాటు భారీగా లాభపడ్డ దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నెమ్మదించాయి. ఉదయం ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. అమెరికాలో వడ్డీరేట్లను వేగంగా పెంచనున్నామన్న ఫెడ్‌ సంకేతాలు మార్కెట్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. మరోవైపు నిన్న, మొన్నటి భారీ లాభాల వచ్చిన నేపథ్యంలో మదుపర్లు ఈ రోజు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపారు. మరోవైపు ద్రవ్యోల్బణ భయాలు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వంటి పరిణామాలతో పాటు దేశీయంగా కొవిడ్‌ కేసులు పెరుగుతుండటం సూచీలకు ప్రతికూలాంశాలుగా మారాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లూ నష్టాల్లో చలించడం గమనార్హం.

ఉదయం సెన్సెక్స్‌ 57,531.95 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 57,134.72 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరకు 714.53 పాయింట్ల నష్టంతో 57,197.15 వద్ద ముగిసింది. 17,242.75 వద్ద ప్రారంభమైన నిఫ్టీ చివరకు 220.65 పాయింట్లు నష్టపోయి 17,171.95 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 17,149.20 వద్ద కనిష్ఠాన్ని తాకింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.76.48 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎం అండ్‌ ఎం, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, మారుతీ, హెచ్‌సీఎల్‌ టెక్ షేర్లు మాత్రమే లాభాల్లో పయనించాయి. ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా స్టీల్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

*  బోరోసిల్‌ రెన్యూవబుల్స్ షేర్లు ఇంట్రాడేలో 14 శాతం మేర లాభపడ్డాయి. గత ఏడాది వ్యవధిలో ఇదే అతిపెద్ద ఒకరోజు లాభం. ఈక్విటీ షేర్ల జారీ ద్వారా నిధులు సమీకరించడంపై సోమవారం బోర్డు సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో షేర్లు ఎగబాకాయి. 

*  నైకా మాతృసంస్థ ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఈ-కామర్స్‌.. ఎర్త్‌ రిథమ్‌లో 18.5 శాతం వాటాలను కొనుగోలు చేసింది. అలాగే నడ్జ్‌ వెల్‌నెస్‌లో 60 శాతం వాటాలను సొంతం చేసుకుంది. దీంతో కంపెనీ షేరు ఈరోజు 1.23 శాతం లాభంతో 1845 వద్ద ముగిశాయి. 

* హిందూస్థాన్ జింక్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. దీంతో ఈ కంపెనీ షేర్లు ఈరోజు 2 శాతం మేర కుంగాయి. 

* ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు 6 శాతం మేర పడిపోయాయి. మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలు అంచనాలు అందుకోలేకపోవడమే అందుకు కారణం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని