Published : 12 May 2022 15:54 IST

Stock Market: దలాల్‌ స్ట్రీట్‌లో బ్లడ్‌బాత్‌..

ముంబయి: వరుసగా ఐదో సెషన్‌లో దేశీయ మార్కెట్ల (Stock Market)పై బేర్‌ పట్టు బిగించింది. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు, ద్రవ్యోల్బణ భయాలు సూచీలు కిందకు తోసేశాయి. ఫలితంగా గురువారం నాటి ట్రేడింగ్‌లో మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ (Sensec) ఏకంగా 1100 పాయింట్లకు పైగా పతనమై 53వేల మార్క్‌ దిగువకు పడిపోగా.. నిఫ్టీ (Nifty) 16వేల మైలురాయిని కోల్పోయింది.

సూచీల పయనం సాగిందిలా..

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే సూచీలు కుప్పకూలాయి. 53,608 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్‌ ఆద్యంతం భారీ నష్టాల్లోనే సాగింది. ఒకానొక దశలో 52,702 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరకు 1158.08 (2.14శాతం) పాయింట్లు దిగజారి 52,930.31 వద్ద స్థిరపడింది. అటు జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ కూడా 15,735.75 - 16,041 మధ్య కదలాడింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 359.10 (2.22 శాతం) పాయింట్ఉల నష్టపోయి 15,808 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 పైసలు క్షీణించి 77.44గా ఉంది.

అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. ముఖ్యంగా క్యాపిటల్ గూడ్స్‌, ఆటోమొబైల్‌, బ్యాంకింగ్‌, లోహ, చమురు, విద్యుత్‌, ఫార్మా, రియల్టీ రంగ సూచీలు 1-4శాతం మేర కుంగాయి. నిఫ్టీలో అదానీపోర్ట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, టాటా స్ట్రీల్‌ హిందాల్కో భారీ నష్టాలను చవిచూశాయి. కేవలం విప్రో మాత్రమే లాభపడటం గమనార్హం.

మార్కెట్‌ పతనానికి కారణాలివే..

* ఆర్థిక మాంద్య భయాలు, ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో అమెరికా మార్కెట్లు నిన్న భారీగా పతనమయ్యాయి. డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ 500 సూచీలు ఒక శాతానికి పైగా నష్టపోగా.. నాస్‌డాక్‌ సూచీ ఏకంగా 3 శాతం మేర కుంగింది. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై తీవ్రంగానే పడింది.

గత కొన్ని రోజులుగా విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు సాగిస్తున్నారు. నిన్న ఒక్కరోజే రూ.3,609.35 కోట్ల విలువైన అమ్మకాలు జరిపారు. ఇది మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బకొట్టింది.

అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల, ప్రపంచ ఆర్థిక మందగమనం తదితర కారణాలతో వచ్చే రెండు ఏళ్లలో భారత జీడీపీ అంచనాలను మోర్గాన్‌ స్టాన్లీ తగ్గించింది. 2023 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 7.6 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. అంతక్రితం అంచనాల కంటే ఇది 30 బేసిస్‌ పాయింట్లు తక్కువ కావడం గమనార్హం. ఇది కూడా సూచీలపై ప్రతికూల ప్రభావం చూపించింది.

* ఇక, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ముగింపు దిశగా ఎలాంటి పురోగతి లేకపోవడం, దేశీయంగా దిగ్గజ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడడం సూచీలను మరింత బలహీనపర్చాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని