Stock market: వరుసగా నాలుగో రోజూ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్‌ 60,000+

దేశీయ స్టాక్‌ మార్కె్ట్‌ సూచీలు మరోసారి లాభాల్లో ముగిశాయి.

Published : 17 Aug 2022 15:59 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి లాభాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గడంతో మదుపరులు కొనుగోళ్లకు  మొగ్గుచూపారు. దీంతో వరుసగా నాలుగోరోజూ సూచీలు లాభపడ్డాయి. విదేశీ మదుపరులు సైతం కొనుగోళ్లకు దిగడం మార్కెట్లలో కొనుగోళ్ల కళ సంతరించుకుంది. దీంతో సెన్సెక్స్‌, నిఫ్టీలు ఏప్రిల్‌ స్థాయికి చేరుకున్నాయి. సెన్సెక్స్‌ 60వేల పాయింట్లు దాటగా.. నిఫ్టీ 17,900 ఎగువన ముగిసింది.

Also read: 60 వేలు దాటిన సెన్సెక్స్‌.. రెండు నెలల్లో ఎంత మార్పో!

బుధవారం నాటి ట్రేడింగ్‌లో ఉదయం 59,938 వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌.. రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత 60 వేల మార్కును అందుకుంది. ఇంట్రాడేలో 60,323 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 417.92 పాయింట్ల లాభంతో 60,260.13 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 119 పాయింట్లు లాభపడి 17,944.25 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, టాటా స్టీల్‌ స్వల్పంగా నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంక్‌, పవర్‌, ఐటీ షేర్లలో కొనుగోళ్ల సందడి కనిపించింది. ఆటో మినహా అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని