Stock Market: ప్చ్‌.. మార్కెట్లకు మళ్లీ నష్టాలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి...

Published : 27 Apr 2022 16:02 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం ప్రతికూలంగా ట్రేడింగ్‌ను ప్రారంభించిన మార్కెట్లు ఇంట్రాడేలో ఏ దశలోనూ కోలుకోలేదు. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సూచీలను ప్రభావితం చేశాయి. మిశ్రమ కార్పొరేట్‌ ఫలితాలు, ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు (Fed Rate Hike), ఐరోపా దేశాలకు రష్యా గ్యాస్‌ (Russia Gas) సరఫరాను నిలిపివేసే అవకాశం ఉందన్న ఊహాగానాల వంటి పరిణామాలు సూచీలకు ప్రతికూలంగా మారాయి. చైనాలో కరోనా (China Corona) విజృంభణ మధ్య ఆసియా-పసిఫిక్‌ సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

ఉదయం సెన్సెక్స్‌ 56,983.68 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 57,079.03 - 56,584.04 మధ్య కదలాడింది. చివరకు 537.22 పాయింట్ల నష్టంతో 56,819.39 వద్ద ముగిసింది. 17,073.35 వద్ద నష్టాలతో ప్రారంభమైన నిఫ్టీ చివరకు 162.40 పాయింట్లు నష్టపోయి 17,038.40 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 17,110.70 - 16,958.45 మధ్య చలించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.76.54 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఆరు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. టాటా స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డ వాటిలో ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టైటన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, విప్రో, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎంఅండ్‌ఎం, మారుతీ, సన్‌ ఫార్మా షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

* క్లౌడ్‌ నెట్‌వర్కింగ్‌ అంకుర సంస్థ సినర్జీ టెక్‌లో ఎయిర్‌టెల్‌ (Airtel) 7 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ విలువను మాత్రం బయటకు వెల్లడించలేదు.

* క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌ (Campus IPO) ఐపీఓ రెండో రోజు సబ్‌స్క్రిప్షన్‌లో 2.57 రెట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్‌ విభాగంలో 3.41 రెట్ల అధిక స్పందన లభించింది. ఈరోజు ప్రారంభమైన రెయిన్‌బో చిల్డ్రన్‌ మెడికేర్ (Rainbow children medicare IPO) ఐపీఓకి స్పందన పెద్దగా కనిపించలేదు. రిటైల్‌ విభాగంలో కేవలం 43 శాతం షేర్లకు మాత్రమే బిడ్లు దాఖలయ్యాయి. అన్ని విభాగాల్లో కలిపి 26 శాతం షేర్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి.

* ఆలోక్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు ఈరోజు దాదాపు 20 శాతం మేర ఎగబాకాయి. గత మూడు నెలల వ్యవధిలో ఒక్కరోజులో ఈ స్థాయిలో లాభపడడం ఇదే తొలిసారి.

* దేశంలో రూ.19 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను అందుకున్న తొలి కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిలిచింది. ఈరోజు 2 శాతం మేర లాభపడ్డ కంపెనీ షేర్లు రూ.2,827 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి.

* గత ఏడాది నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించడంతో కేపీఐటీ షేర్లు ఈరోజు 11 శాతం మేర లాభపడడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని