Stock Market Update: 4 రోజుల వరుస లాభాలకు బ్రేక్‌!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి....

Published : 29 Jun 2022 16:03 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. దీంతో వరుసగా నాలుగు రోజుల పాటు నమోదైన లాభాల పరంపరకు అడ్డుకట్ట పడింది. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నానికి పూర్తిగా కోలుకున్నాయి. కానీ, చివర్లో మళ్లీ అమ్మకాల సెగ తగిలి తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు దేశీయ సూచీలను కుంగదీశాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, వడ్డీరేట్ల పెంపు, చమురు ధరల పెరుగుదల మార్కెట్లను ఇంకా కలవరపెడుతూనే ఉన్నాయి.

ఉదయం సెన్సెక్స్‌ 52,623.15 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 53,244.84 - 52,612.68 మధ్య కదలాడింది. చివరకు 150.48 పాయింట్ల నష్టంతో 53,026.97 వద్ద ముగిసింది. 15,701.70 వద్ద ప్రతికూలంగా ప్రారంభమైన నిఫ్టీ చివరకు 51.10 పాయింట్లు నష్టపోయి 15,799.10 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 15,861.60 - 15,687.80 మధ్య చలించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.79.04 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎన్‌టీపీసీ, రిలయన్స్‌, సన్‌ఫార్మా, ఐటీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్‌, మారుతీ, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. హెచ్‌యూఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, టైటన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర సంగతులు.. 

* ఎంటార్‌ టెక్‌ షేరు ఈరోజు 7.91 శాతం నష్టపోయి రూ.1,242 వద్ద స్థిరపడింది. ఈ స్టాక్‌ 52 వారాల గరిష్ఠం నుంచి ఇప్పటి వరకు 52 శాతం దిగజారింది. కంపెనీకి చెందిన 1.55 మిలియన్‌ షేర్లు చేతులు మారడమే ఇందుకు కారణం.

* ముకేశ్‌ అంబానీ స్పష్టమైన వారసత్వ ప్రణాళికతో ముందుకు వెళ్లానున్నారన్న సంకేతాల నేపథ్యంలో కంపెనీ షేర్లు ఈరోజు రాణించాయి. నేడు కంపెనీ షేరు విలువ 1.91 శాతం లాభపడి రూ.2,576కు ఎగబాకింది. రానున్న రోజుల్లో ఈ షేరు మరింత రాణించే అవకాశం ఉందని పలు బ్రోకరేజీ సంస్థలు అంచనా వేశాయి.

* మొత్తంగా జూన్‌ నెలలో సెన్సెక్స్‌, నిఫ్టీ ఐదు శాతం మేర పతనమయ్యాయి. మార్చి 2020 తర్వాత ఒకనెలలో ఈ స్థాయి నష్టాల్ని నమోదు చేయడం ఇదే తొలిసారి.

* డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. ఈరోజు 14 పైసలకు పైగా నస్టపోయిన రూపాయి రూ.79 వద్ద జీవితకాల కనిష్ఠాన్ని తాకింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని