Stock Market: నష్టాలకు బ్రేక్‌.. సూచీలకు ‘గుజరాత్‌’ జోష్‌!

Stock Market: వరుస నాలుగు రోజుల నష్టాల నుంచి దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు విరామం తీసుకున్నాయి. కీలక రాష్ట్రమైన గుజరాత్‌లో భాజపా అధికారాన్ని నిలబెట్టుకోవడం సూచీలకు కలిసొచ్చింది.

Published : 08 Dec 2022 16:02 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో నాలుగు రోజుల వరుస నష్టాలకు గురువారం బ్రేక్‌ పడింది. కీలక రాష్ట్రమైన గుజరాత్‌లో భాజపా వరుసగా ఏడోసారీ అధికారాన్ని నిలబెట్టుకోవడం సూచీల్లో ఉత్సాహాన్ని నింపింది. ఉదయం సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఫలితాల సరళిలో తొలి నుంచి భాజపా ముందంజలో ఉండడంతో కాసేపటికే లాభాల్లోకి ఎగబాకాయి. ఒంటిగంట సమయంలో స్వల్పంగా లాభాల స్వీకరణ కనిపించింది. గుజరాత్‌లో భాజపా విజయం ఖరారు కావడంతో తిరిగి పుంజుకొని స్పష్టమైన లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి.

సెన్సెక్స్‌ 160 పాయింట్ల లాభంతో 62,570.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 48.85 పాయింట్లు లాభపడి 18,609.35 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.41 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌30 సూచీలో 13 షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. సన్‌ఫార్మా, పవర్‌ గ్రిడ్‌, టీసీఎస్‌, నెస్లే ఇండియా, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, విప్రో, బజాజ్‌ ఫైనాన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టెక్‌ మహీంద్రా, టైటన్‌ షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర అంశాలు..

* త్రివేణి ఇంజినీరింగ్‌ షేరు ఇంట్రాడేలో 5 శాతం మేర నష్టపోయింది. చివరకు 4.03 శాతం నష్టపోయి రూ.282.10 వద్ద స్థిరపడింది. ఈరోజు ట్రేడింగ్‌లో భారీ ఎత్తున షేర్లు చేతులు మారడమే దీనికి కారణం.

* కల్యాణ్‌ జువెలర్స్‌ 2023లో 52 కొత్త షోరూంలను తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. సంస్థ షేరు ఈరోజు 1.96 శాతం నష్టపోయి రూ.107.70 వద్ద ముగిసింది.

* ఎల్‌ఐసీకి ప్రైవేటు వ్యక్తిని సీఈఓగా నియమించే యోచనలో ప్రభుత్వం ఉందన్న వార్తల నేపథ్యంలో స్టాక్‌ ధర ఈరోజు 1.05 శాతం పెరిగి రూ.661.05కి చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని