Stock Market: మార్కెట్లలో ‘బ్రిటన్‌ ట్యాక్స్‌’ జోష్‌.. సెన్సెక్స్‌కు 1000 పాయింట్ల లాభం

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి....

Published : 04 Oct 2022 09:42 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ట్రేడింగ్‌ను భారీ లాభాలతో ప్రారంభించాయి. సోమవారం అమెరికా మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. నేడు ఆసియా-పసిఫిక్ సూచీలు సైతం లాభాల్లో కొనసాగుతున్నాయి. సంపన్నులపై భారీ పన్నులను తొలగించడానికి ఉద్దేశించిన విధానాన్ని బ్రిటన్‌ ప్రభుత్వం సోమవారం ఉపసంహరించుకుంది. ఇది మార్కెట్లలో ర్యాలీకి ప్రధాన కారణంగా నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ రకం ముడి చమురు బ్యారెల్‌ ధర 0.5 శాతం పెరిగి 89 డాలర్లకు పెరిగింది. గతకొన్ని రోజుల భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ పేరిట ఎలక్ట్రానిక్స్‌ గృహోపకరణాలను విక్రయిస్తున్న ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఐపీఓ నేటి నుంచి ప్రారంభం కానుంది. ధరల శ్రేణిని రూ.56-59గా నిర్ణయించింది.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:31 గంటల సమయానికి సెన్సెక్స్‌ 1,122 పాయింట్ల భారీ లాభంతో 57,911 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 327 పాయింట్లు లాభపడి 17,214 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.57 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ఉండడం విశేషం. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, ఎంఅండ్‌ఎం, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్ షేర్లు అత్యధికంగా లాభపడుతున్న షేర్లలో ఉన్నాయి. 

నేడు గమనించాల్సిన స్టాక్స్‌...

కేఈసీ ఇంటర్నేషనల్‌: ఈ కంపెనీకి చెందిన వివిధ విభాగాలకు రూ.1,407 కోట్ల ఆర్డర్‌ అందింది. వీటిలో విద్యుత్తు సరఫరా, పంపిణీతో పాటు రైల్వే బిజినెస్‌కు చెందిన సిగ్నలింగ్‌, టెలీకమ్యూనికేషన్‌ వర్క్స్‌ ఉన్నాయి.

దిలీప్‌ బిల్డ్‌కాన్‌: గుజరాత్‌లోని సూరత్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి ఈ కంపెనీకి తమ అనుబంధ సంస్థలైన ఆర్‌బీఎల్‌-డీబీఎల్‌తో కలిసి అనుమతి పత్రాన్ని పొందింది.

వేదాంత: తమ అల్యూమినా ఉత్పత్తి 11 శాతం తగ్గినట్లు వేదాంత తెలిపింది. అదే సమయంలో జింక్‌ ఇండియా ఉత్పత్తి వార్షిక ప్రాతిపదికన 3 శాతం పెరిగి 2.55 లక్షల టన్నులకు చేరినట్లు వెల్లడించింది. మరోవైపు ఉక్కు విభాగంలో ఉత్పత్తి 11 శాతం వృద్ధి చెంది 3.25 లక్షల టన్నులకు చేరినట్లు  పేర్కొంది.

అవెన్యూ సూపర్‌మార్ట్స్‌: సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో డిమార్ట్‌ ఏకీకృత ఆదాయం 36 శాతం పెరిగి రూ.10,384.66 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. మొత్తం స్టోర్ల సంఖ్య 302కు చేరినట్లు తెలిపింది.

ఎన్‌సీసీ: వివిధ ప్రభుత్వ ఏజెన్సీల నుంచి తమ నిర్మాణ విభాగానికి సెప్టెంబరులో రూ.393 కోట్ల ఆర్డర్లు దక్కినట్లు ఎన్‌సీసీ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని