Stock market: ర్యాలీకి బ్రేక్‌: నష్టాల్లో సూచీలు.. 24,350 దిగువకు నిఫ్టీ

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 426 పాయింట్లు, నిఫ్టీ 116 పాయింట్లు నష్టపోయాయి.

Updated : 10 Jul 2024 16:05 IST

Stock market | ముంబయి: వరుస లాభాలతో దూసుకెళుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలకు (Stock market) బ్రేక్‌ పడింది. ఏ రోజుకారోజు సరికొత్త గరిష్ఠాల నెలకొల్పుతున్న సూచీలకు గట్టి షాక్‌ తగిలింది. బుధవారం ఉదయం కూడా ఎప్పటిలానే రికార్డు స్థాయిల వద్ద ఆరంభమైన సూచీలు.. ఒక్కసారిగా యూటర్న్‌ తీసుకున్నాయి. సెన్సెక్స్‌ ఓ దశలో 900 పాయింట్లు మేర నష్టపోయింది. నిఫ్టీ కూడా దాదాపు 300 పాయింట్లు నష్టాన్ని చవిచూసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, గరిష్ఠాల వద్ద మదుపర్ల లాభాల స్వీకరణకు దిగడం ఇందుక్కారణం. ముఖ్యంగా మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీల పతనాన్ని శాసించాయి.

సెన్సెక్స్‌ ఉదయం 80,481.36 రికార్డు గరిష్ఠాల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 915.88 పాయింట్లు నష్టంతో 79,435.76 వద్ద కనిష్ఠాన్ని తాకింది. తర్వాత కోలుకుంది. చివరికి 426.87 పాయింట్ల నష్టంతో 79,924.77 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 24,461.05 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠాల వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 291 పాయింట్లు నష్టపోయింది. చివరికి 116.20 పాయింట్ల నష్టంతో 24,317 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.56గా ఉంది.

సెన్సెక్స్‌లో మహీంద్రా అండ్‌ మహీంద్రా అత్యధికంగా 6.69 శాతం మేర నష్టపోయింది. ఎక్స్‌యూవీ 700 వేరియంట్‌పై రూ.2 లక్షల వరకు డిస్కౌంట్‌ ప్రకటించడం ఇందుకు నేపథ్యం. ఆటోమొబైల్‌ రంగంలో వీక్‌ డిమాండ్‌ను ఇది సూచిస్తోంది. టాటా మోటార్స్ షేర్లపైనా ప్రతికూల ప్రభావం పడింది. సెన్సెక్స్‌ 30లో మహీంద్రాతో పాటు టాటా స్టీల్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టపోయాయి. ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌ లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 84.83 డాలర్లు, బంగారం ఔన్సు ధర 2379 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు